Godavari Floods: తెలంగాణలో భారీ వర్షాలు.. గోదావరి ఉగ్రరూపం.. కాళేశ్వరం-భద్రాచలంలో ప్రమాద స్థాయికి వరద.. రెడ్ అలర్ట్ ప్రకటించిన అధికారులు
తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. కాళేశ్వరం, భద్రాచలం వద్ద వరద ప్రవాహం ప్రమాద స్థాయికి చేరుకోవడంతో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించి అప్రమత్తమయ్యారు.
Godavari Floods: తెలంగాణను అల్పపీడనంతో పాటు తీవ్ర వరద ముంచెత్తుతోంది. ఎగువ ప్రాంతాలైన విదర్భ, ఛత్తీస్‌గఢ్‌లతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. దాంతో పాటు దాని ఉపనదులైన ఇంద్రావతి, ప్రాణహితలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నదీ పరివాహక ప్రాంతాల్లో తీవ్రమైన వరద ప్రవాహం నమోదవుతుండటంతో కాళేశ్వరం, భద్రాచలం వద్ద పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం, అధికార యంత్రాంగం అప్రమత్తమై సహాయక చర్యలను ముమ్మరం చేశాయి.
ఎగువ నుంచి వచ్చి చేరుతున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం గంటగంటకూ వేగంగా పెరుగుతోంది. శుక్రవారం ఉదయం 10:14 గంటల సమయానికి నీటిమట్టం 43 అడుగులకు చేరడంతో అధికారులు అధికారికంగా మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. గడిచిన రాత్రి నుంచి ఇప్పటివరకు నది నీటిమట్టం ఏకంగా 14 అడుగులు పెరగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ముఖ్యంగా ఇంద్రావతి నది నుంచి రికార్డు స్థాయిలో దాదాపు 10 లక్షల క్యూసెక్కుల వరద నీరు గోదావరిలో కలుస్తోంది. రాబోయే 24 నుంచి 36 గంటల్లో మేడిగడ్డ, భద్రాచలం వద్ద నది ప్రవాహం 12 నుంచి 17 లక్షల క్యూసెక్కులకు పెరిగే అవకాశం ఉందని వరద ముందస్తు అంచనా విభాగాలు వెల్లడించాయి.
వరద తీవ్రత దృష్ట్యా భద్రాచలం సబ్ కలెక్టర్ ‘గోదావరి ఫ్లడ్ మాన్యువల్’ ప్రకారం అన్ని శాఖల అధికారులు తక్షణమే విధుల్లోకి చేరాలని ఆదేశించారు. పరిస్థితిని సమీక్షించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను అందుబాటులోకి తెచ్చారు. అయితే, భద్రాచలం స్నాన ఘట్టాల వద్ద నీటిమట్టం పెరుగుతున్నా ప్రమాద సూచిక బోర్డులు అమర్చకపోవడం, హెచ్చరించాల్సిన సిబ్బంది లేకపోవడంపై భక్తులు, స్థానికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఘాట్ల వద్ద వెంటనే మైకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసి భద్రతా సిబ్బందిని కాపలా ఉంచాలని కోరుతున్నారు.
మరోవైపు కాళేశ్వరం సీడబ్ల్యూసీ (CWC) స్టేషన్ వద్ద గోదావరి నీటిమట్టం 11.50 మీటర్లకు చేరుకుంది. ఇక్కడ హెచ్చరిక స్థాయి 12.210 మీటర్లు కాగా, ప్రమాద స్థాయి 13.460 మీటర్లుగా ఉంది. మేడిగడ్డ (లక్ష్మీ బ్యారేజ్) వద్ద నీటిమట్టం 96.40 మీటర్లు నమోదు కాగా, ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో సమానంగా 8,35,800 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. వరద నీటిని ఏమాత్రం నిల్వ చేయకుండా దిగువకు పంపేందుకు బ్యారేజ్ 85 గేట్లను పూర్తిగా ఎత్తివేసి ఫ్రీ ఫ్లో పద్ధతిలో ప్రవాహాన్ని కొనసాగిస్తున్నారు. ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి, సుందిళ్ల, అన్నారం ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు నిండిపోవడంతో దిగువకు భారీగా నీటిని విడుదల చేస్తున్నారు.
వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం.. రానున్న 12 నుంచి 18 గంటల్లో ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, కామారెడ్డి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లి ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం ఉందనగా, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, సిరిసిల్ల, సిద్ధిపేట, కరీంనగర్ జిల్లాల్లో నిరంతరాయంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని అంచనా వేశారు.
రాజధాని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనూ మధ్యాహ్న సమయానికి భారీ వర్షం కురిసే అవకాశం ఉండటంతో జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. వర్షం కారణంగా నగరంలో తీవ్ర ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఐటీ కారిడార్‌లోని మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, కొండాపూర్ ప్రాంతాల్లోని కంపెనీలకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేశారు. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని, ఆఫీసుల్లో ఉన్నవారికి ఎర్లీ లాగౌట్ కల్పించాలని సూచించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని, మ్యాన్‌హోల్స్, తెగిపడిన విద్యుత్ వైర్ల పట్ల తీవ్ర జాగ్రత్త వహించాలని అధికార యంత్రాంగం హెచ్చరించింది.