Hyderabad: వీడియో ఇదిగో.. ఎల్బీనగర్ ఏసీపీ కార్యాలయంలో విధుల్లోనే కానిస్టేబుల్ ఆత్మహత్య.. స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులు..
హైదరాబాద్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. విధుల్లో ఉన్న ఓ కానిస్టేబుల్ ఏసీపీ కార్యాలయంలోనే ఆత్మహత్యకు పాల్పడటం పోలీసు శాఖలో కలకలం రేపింది. ఎల్బీనగర్ ఏసీపీ కార్యాలయంలోని విశ్రాంతి గదిలో కానిస్టేబుల్ జె. సాయి కుమార్ మృతిచెందారు.
Hyderabad: హైదరాబాద్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. విధుల్లో ఉన్న ఓ కానిస్టేబుల్ ఏసీపీ కార్యాలయంలోనే ఆత్మహత్యకు పాల్పడటం పోలీసు శాఖలో కలకలం రేపింది. ఎల్బీనగర్ ఏసీపీ కార్యాలయంలోని విశ్రాంతి గదిలో కానిస్టేబుల్ జె. సాయి కుమార్ మృతిచెందారు. ఈ ఘటన తెల్లవారుజామున సుమారు 2.30 గంటల సమయంలో జరిగినట్లు సమాచారం.
రాత్రి విధుల్లో ఉన్న సాయి కుమార్.. ఏసీపీ కార్యాలయంలోని రెస్ట్ రూమ్‌లో ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కొంతసేపటి తర్వాత తోటి సిబ్బంది ఆయనను గుర్తించి వెంటనే అప్రమత్తమయ్యారు. అత్యవసరంగా సాయి కుమార్‌ను సమీపంలోని కామినేని ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే ఆస్పత్రికి తీసుకెళ్తున్న సమయంలోనే ఆయన మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు సమాచారం. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి తరలించారు.
సాయి కుమార్ 2024 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్‌గా పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ-కాప్స్ (e-Cops) విధుల కోసం ఆయనను ఎల్బీనగర్ ఏసీపీ కార్యాలయానికి అటాచ్ చేసినట్లు సమాచారం. సాయి కుమార్ తన స్నేహితులతో కలిసి కర్మన్‌ఘాట్ ప్రాంతంలో నివాసం ఉంటున్నట్లు తెలిసింది. విధి నిర్వహణలో ఉన్న సమయంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడంతో ఆయనతో కలిసి పనిచేస్తున్న సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
హైదరాబాద్‌లో ఏసీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్య
కానిస్టేబుల్ సాయి కుమార్ ఈ తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు ఏమిటన్నది ప్రస్తుతం స్పష్టంగా తెలియరాలేదు. వ్యక్తిగత, వృత్తిపరమైన అంశాలతో పాటు ఇతర కారణాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు ముందు ఆయన ఎవరితో మాట్లాడారు? ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? అనే అంశాలపై కూడా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. మృతుడి ఫోన్, ఇతర ఆధారాలను పరిశీలించడం ద్వారా ఘటనకు దారితీసిన పరిస్థితులను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
పోలీస్ స్టేషన్ ఎదుట కుటుంబ సభ్యుల ఆందోళన
సాయి కుమార్ మృతిచెందిన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అనంతరం వారు ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. సాయి కుమార్ మృతికి దారితీసిన అసలు కారణాలను వెంటనే వెల్లడించాలని, ఘటనపై సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. పోలీసులు కుటుంబ సభ్యులతో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉండటంతో పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.