Hyderabad Water Crisis: హైదరాబాద్‌లో పాతాళానికి భూగర్భ జలాలు..ఈ నెల వర్షాలు లేకుంటే తీవ్ర నీటి కష్టాలు తప్పవని హెచ్చరిక.. ఏడాదిలోనే 4.84 మీటర్ల పతనం

వర్షాకాలం ముగింపు దశకు చేరుకుంటున్నా గ్రేటర్ హైదరాబాద్ నగరవాసులకు భూగర్భ జలాల పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడం, మరోవైపు నగరంలో నీటి వినియోగం పెరగడంతో భూగర్భ జలమట్టాలు గణనీయంగా పడిపోయాయి.

Water Crisis Representative Image (Photo Credit- Pixabay)

Hyderabad Water Crisis: వర్షాకాలం ముగింపు దశకు చేరుకుంటున్నా గ్రేటర్ హైదరాబాద్ నగరవాసులకు భూగర్భ జలాల పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడం, మరోవైపు నగరంలో నీటి వినియోగం పెరగడంతో భూగర్భ జలమట్టాలు గణనీయంగా పడిపోయాయి. 2026 ఆగస్టు నాటికి గ్రేటర్ హైదరాబాద్‌లో సగటు భూగర్భ జలమట్టం 11.20 మీటర్ల లోతుకు చేరింది. గత ఏడాది ఇదే సమయంలో 6.36 మీటర్లుగా ఉన్న నీటిమట్టంతో పోలిస్తే ఏకంగా 4.84 మీటర్ల మేర క్షీణత నమోదైంది.

భూగర్భ జలవనరుల శాఖ గణాంకాల ప్రకారం.. ఆగస్టు చివరి నాటికి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సాధారణంగా 460 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా, ఈసారి సుమారు 360 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. అంటే సాధారణ వర్షపాతంతో పోలిస్తే దాదాపు 22 శాతం లోటు ఏర్పడింది. వర్షపాతం తక్కువగా ఉండటంతో పలు ప్రాంతాల్లో భూగర్భ జలాల రీచార్జ్‌కు అవసరమైన నీటి లభ్యత తగ్గింది.

తెలంగాణ ప్రజలకు వాతావరణ అలర్ట్.. మరో గంటలో భారీ వర్షాలు కురిసే అవకాశం..హైదరాబాద్ వాసులు అప్రమత్తంగా ఉండాలని సూచన..

వర్షాలు తగ్గడంతో తాగునీరు, గృహ అవసరాలు, ఇతర అవసరాల కోసం బోర్లపై ఆధారపడే పరిస్థితి పెరిగింది. ఫలితంగా భూగర్భ జలాలపై ఒత్తిడి మరింత పెరిగింది. తక్కువ వర్షపాతం, అధిక నీటి వినియోగం రెండూ కలిసి భూగర్భ జలమట్టాలు వేగంగా పడిపోవడానికి కారణమయ్యాయి. గతేడాది ఆగస్టులో సగటున 6.36 మీటర్ల లోతులో నీరు లభిస్తే.. ఈ ఏడాది అదే కాలానికి 11.20 మీటర్ల లోతుకు చేరడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది.

గ్రేటర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, అమీర్‌పేట్, బాచుపల్లి, శేరిలింగంపల్లి, దుండిగల్, రాజేంద్రనగర్, సరూర్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ తదితర ప్రాంతాల్లో భూగర్భ జలాలు 15 నుంచి 20 మీటర్లకు పైగా లోతుకు వెళ్లినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా కుత్బుల్లాపూర్ ప్రాంతంలో నీటిమట్టం దాదాపు 40 మీటర్ల లోతుకు చేరినట్లు తాజా నివేదికలు పేర్కొంటున్నాయి.

గ్రేటర్ హైదరాబాద్‌లో మొత్తం 73 శాతం ప్రాంతాల్లో భూగర్భ జలాలు 10 మీటర్ల కంటే ఎక్కువ లోతులో ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీంతో రాబోయే వేసవిపై ఆందోళన వ్యక్తమవుతోంది. సెప్టెంబర్‌లో సమృద్ధిగా వర్షాలు కురిసి భూగర్భ జలాల రీచార్జ్ జరిగితే పరిస్థితిలో కొంత మెరుగుదల వచ్చే అవకాశం ఉంది. అయితే వర్షపాతం ఆశించిన స్థాయిలో లేకపోతే వేసవిలో బోర్లు, ఇతర స్థానిక నీటి వనరులపై మరింత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.

హైదరాబాద్‌లో పెరుగుతున్న జనాభా, నిర్మాణాలు, నీటి వినియోగం నేపథ్యంలో భూగర్భ జలాల సంరక్షణకు ప్రాధాన్యం పెరుగుతోంది. వర్షపు నీటిని ఒడిసిపట్టే చర్యలు, రైన్‌వాటర్ హార్వెస్టింగ్, నీటి పొదుపు వంటి చర్యలను విస్తృతంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. సెప్టెంబర్‌లో నమోదయ్యే వర్షపాతం, తదుపరి నెలల్లో భూగర్భ జలాల రీచార్జ్ పరిస్థితి హైదరాబాద్‌ నీటి భద్రతపై కీలక ప్రభావం చూపనుంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement