
Hyderabad, March 08: నైజీరియా నుంచి తీసుకొచ్చిన డ్రగ్స్‌ను (Drugs) హైదరాబాద్ నగరంలో విక్రయించడానికి వచ్చిన వ్యక్తితో పాటు కొనుగోలు చేయడానికి వచ్చిన వ్యక్తిని అరెస్టు చేసి… వారి వద్ద 13 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్ (MMDA) స్వాధీనం చేసుకున్నారు. కేపీహెచ్‌బీ కాలనీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నైజీరియా దేశానికి చెందిన ముర్తాల మహమ్మద్ అంతర్జాతీయ బిజినెస్ వీసా తీసుకొని ముంబై నగరానికి చేరుకున్నాడు. నైజీరియా దేశస్థులతో కలిసి వస్త్ర వ్యాపారం ప్రారంభించాడు. కొద్దిరోజులకు తమ దేశస్తులతో కలిసి డ్రగ్స్ వ్యాపారం చేయాలని నిర్ణయించుకొన్నాడు.
మరోవైపు హైదరాబాద్ నగరానికి చెందిన గంగిరెడ్డి గారి రోహిత్ యూఎస్ఏలో బిబిఏ చదువుతున్నప్పుడు డ్రగ్స్‌కు బానిస అయ్యాడు. తదనంతరం అతడు ముంబై యాక్టింగ్ స్కూల్లో చేరి అజాహు జోషు అనే వ్యక్తిని కలిసి టాక్సిన్ కొనుగోలు చేసి సేవించేవాడు. ఈ క్రమంలో ముర్తాల మహమ్మద్ అనే వ్యక్తితో గంగిరెడ్డి గారి రోనిత్‌కు 2021లో పరిచయం ఏర్పడింది. ముంబై నగరంలో అతను డ్రగ్స్ విక్రయిస్తుండగా ముర్తాల మహమ్మద్‌ను పోలీసులు పట్టుకొని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.
2023లో బెయిల్‌పై జైలు నుంచి విడుదలైన తర్వాత మరల డ్రగ్స్ వ్యాపారం ప్రారంభించాడు. తదనంతరం రోనిత్ మూర్తల మహమ్మద్ లు నగరంలో డ్రగ్స్ విక్రయించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఈనెల 6న రోహిత్… అవైజ్ అనే నకిలీ పేరుతో డాల్ఫిన్ బస్సులో టికెట్లు బుక్ చేయగా… డ్రగ్స్ తీసుకొని ముర్తల మహమ్మద్ నగరంలోని మియాపూర్ మెట్రో స్టేషన్‌కు చేరుకున్నాడు.
విశ్వసనీయ సమాచారంతో మాటు వేసిన పోలీసులు… ఈనెల 7న రాత్రి 11 గంటల ప్రాంతంలో అడ్డగుట్టలోని విశాల్ సొసైటీ వద్దకు చేరుకోగానే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ముర్తల మహ్మద్, గంగి రెడ్డి గారి రోనిత్ తో పాటుగా నైజీరియా నుంచి డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్న అజాహు జోషులపై కేసు నమోదు చేశారు. వారి వద్ద 13 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్‌ను, 2 సెల్ ఫోన్లు, రూ .80 వేల నగదును ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్సై లింగంను, డిఐ రవికుమార్‌ల బృందాన్ని సీఐ రాజశేఖర్ రెడ్డి, ఏసీపీ శ్రీనివాస్ రావులు అభినందించారు.