Telangana: మీ జీవితం చాలా విలువైనది.. తొందరపడవద్దు.. ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారికి సీపీ సజ్జనార్ కీలక సూచన.. సీఏ సూసైడ్ చాలా బాధాకరమని ఆవేదన..
33 ఏళ్ల వయసులో చార్టర్డ్ అకౌంటెంట్ వంటి అత్యున్నత అర్హత సాధించిన యువకుడు ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనంతో ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్‌లో గెలుపు అనేది కేవలం భ్రమ మాత్రమేనని.. క్షణిక వినోదం కోసం కష్టార్జిత సంపాదనను, భవిష్యత్తును పణంగా పెట్టవద్దని యువతకు సూచించారు.
Telangana: ఆన్‌లైన్ గేమింగ్ జూదం ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. చార్టర్డ్ అకౌంటెంట్‌గా (CA) బాధ్యతలు నిర్వర్తిస్తున్న 33 ఏళ్ల యువకుడు ఆన్‌లైన్ గేమింగ్‌కు బానిసై.. భారీగా అప్పులు కూరుకుపోయి సూసైడ్ చేసుకున్నాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్ధిపేట పట్టణంలోని మంగమ్మతోటకు చెందిన గుడూరి సంతోష్ చార్టర్డ్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నారు. కొంతకాలంగా ఆన్‌లైన్ గేమింగ్‌కు అలవాటు పడిన ఆయన తీవ్రమైన అప్పుల్లో కూరుకుపోయారు. గతంలో కూడా అప్పుల ఒత్తిడితో ఇంటి నుంచి వెళ్లిపోయిన సంతోష్.. అనంతరం తిరిగి వచ్చినప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. ఆర్థిక ఇబ్బందులు మరింత పెరగడంతో కుటుంబంలోనూ తీవ్ర సమస్యలు తలెత్తాయి.
ఈ క్రమంలో రెండు నెలల క్రితం ఆయన భార్య రాణి తన స్వగ్రామానికి వెళ్లగా.. సంతోష్ హైదరాబాద్‌లోని ఒక హాస్టల్‌లో ఉంటున్నారు. పెరిగిన అప్పుల భారాన్ని తగ్గించుకోవడానికి హైదరాబాద్‌లో ఉన్న తన సొంత ఇంటిని కూడా విక్రయించినట్లు పోలీసు విచారణలో వెల్లడైంది.
ఈ నెల 1న సిద్ధిపేట శివారులోని ఒక హోటల్‌లో గది తీసుకున్న సంతోష్.. నిర్ణీత సమయానికి గది ఖాళీ చేయకపోవడంతో హోటల్ సిబ్బంది అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు గది తలుపులు తెరిచి లోపలికి వెళ్లేసరికి సంతోష్ అచేతనంగా పడి ఉన్నారు. ఘటనాస్థలిలో పోలీసులు ఒక లేఖను స్వాధీనం చేసుకున్నారు. తన నిర్ణయానికి మరెవరూ బాధ్యులు కారని ఆ నోట్‌లో సంతోష్ పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.
Sajjanar Tweet
ఈ విషాద ఘటనపై సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 33 ఏళ్ల వయసులో చార్టర్డ్ అకౌంటెంట్ వంటి అత్యున్నత అర్హత సాధించిన యువకుడు ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనంతో ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్‌లో గెలుపు అనేది కేవలం భ్రమ మాత్రమేనని.. క్షణిక వినోదం కోసం కష్టార్జిత సంపాదనను, భవిష్యత్తును పణంగా పెట్టవద్దని యువతకు సూచించారు.
ఆర్థిక లేదా వ్యక్తిగత సమస్యలు ఎదురైనప్పుడు కుటుంబ సభ్యులతో మాట్లాడటం.. మానసిక ఆరోగ్య నిపుణుల సలహా తీసుకోవడం లేదా పోలీసుల సహాయం పొందడం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏ సమస్యకూ ఆత్మహత్య పరిష్కారం కాదని, ప్రతి ఒక్కరి జీవితం వారి కుటుంబానికి ఎంతో విలువైనదని సజ్జనార్ హెచ్చరించారు.