Telangana Weather: తెలంగాణలో ఐదు జిల్లాలకు 'రెడ్ అలర్ట్'.. వచ్చేమూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు..హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తనున్న వానలు..
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, దానికి అనుబంధంగా బలపడిన వాతావరణ వ్యవస్థ ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. బంగాళాఖాత వాతావరణ పరిణామాల నేపథ్యంలో గురు, శుక్రవారాల్లో (సెప్టెంబర్ 24, 25) రాష్ట్రంలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD) హెచ్చరించింది.
Telangana Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, దానికి అనుబంధంగా బలపడిన వాతావరణ వ్యవస్థ ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. బంగాళాఖాత వాతావరణ పరిణామాల నేపథ్యంలో గురు, శుక్రవారాల్లో (సెప్టెంబర్ 24, 25) రాష్ట్రంలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD) హెచ్చరించింది. శనివారం (సెప్టెంబర్ 26) కూడా పలు ప్రాంతాల్లో ఈ వర్ష ప్రభావం కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
ప్రస్తుత పరిస్థితి తీవ్రతను పరిగణనలోకి తీసుకుని కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు , భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో 204.5 మిల్లీమీటర్లకు మించి కుండపోత వర్షపాతం నమోదయ్యే ప్రమాదముంది. మరోవైపు ఆదిలాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ విధించారు. ఈ జిల్లాల్లో గంటకు 45 నుండి 65 కిలోమీటర్ల వేగంతో ప్రచండమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని అధికారులు తెలిపారు.
వర్షాల తీవ్రత రీత్యా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రభుత్వ , ప్రైవేటు పాఠశాలలకు రెండు రోజుల పాటు సెలవు ప్రకటించారు. ఇదే జిల్లాలోని బూర్గంపాడు మండలంలో గాలుల తాకిడికి ఇళ్ల పైకప్పులు, హోర్డింగులు కొట్టుకుపోయాయి. వర్షాలతో పాటు పడుతున్న పిడుగుల వల్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. వేర్వేరు ప్రాంతాల్లో పిడుగులు పడి ముగ్గురు మహిళా కూలీలు ప్రాణాలు కోల్పోయారు. మహబూబ్‌నగర్ జిల్లా పెబ్బేరులో లక్ష్మి (35), జడ్చర్లలో యాదమ్మ (66), పెద్దపల్లి జిల్లా జూలపల్లిలో అంజమ్మ (55) మృతి చెందగా, పలువురు గాయపడటంతో పాటు పశువులు కూడా మృత్యువాత పడ్డాయి.
హైదరాబాద్ నగరంలోనూ వర్షపు ముసురు కొనసాగుతోంది. బుధవారం నగరంలో 21.8 మి.మీ. వర్షపాతం నమోదు కాగా, రాగల రెండు రోజులు నగరవ్యాప్తంగా మోస్తరు నుండి భారీ వర్షాలు, ఉరుములతో కూడిన వాతావరణం ఉండనుంది. భారీ వర్షాలు, పిడుగుపాట్లు , ఈదురుగాలుల నేపథ్యంలో ప్రజలు తీవ్ర అప్రమత్తత పాటించాలని విపత్తు నిర్వహణ శాఖ సూచించింది. ఉరుములు, మెరుపులు వస్తున్న సమయంలో పొలాలు లేదా బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా సురక్షిత భవనాల్లోకి వెళ్లాలని, చెట్లు, పాత గోడలు, విద్యుత్ స్తంభాలు , భారీ హోర్డింగుల కింద నిలబడకూడదని అధికారులు విజ్ఞప్తి చేశారు. వాగులు, వంకలు, కల్వర్టులను దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు.