Gmail Users Alert: జీ మెయిల్ ఓపెన్ చేసి చాలా రోజులైందా? మీ అకౌంట్ డిలీట్ అయ్యే అవకాశం, సుధీర్ఘంగా వాడకుండా ఉన్న కోట్లాది అకౌంట్ల లిస్ట్ రెడీ
కనీసం రెండేళ్లుగా ఎలాంటి యాక్టివిటీ లేని జీమెయిల్ అకౌంట్లకు డిలీట్ ముప్పు పొంచి ఉందని గూగుల్ (Google) గత మే నెలలోనే హెచ్చరించింది. 2023 డిసెంబర్ నుంచి దశలవారీగా ఖాతాల తొలగింపు ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపింది.
New Delhi, NOV 10: సుదీర్ఘంగా ఖాతాలను వినియోగించని జీమెయిల్ యూజర్ల అకౌంట్లు (Gmail Account) పూర్తిగా డిలీట్ అయ్యే ప్రమాదం ఉంది. కనీసం రెండేళ్లుగా ఎలాంటి యాక్టివిటీ లేని జీమెయిల్ అకౌంట్లకు డిలీట్ ముప్పు పొంచి ఉందని గూగుల్ (Google) గత మే నెలలోనే హెచ్చరించింది. 2023 డిసెంబర్ నుంచి దశలవారీగా ఖాతాల తొలగింపు ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపింది. తొలగింపునకు ముందు కొన్ని నెలల పాటు హెచ్చరిక సందేశాలు పంపుతామని గూగుల్ (Google) మే నెలలో తమ బ్లాగ్‌లో పేర్కొంది. తొలగింపునకు గురయ్యే ఖాతాతో పాటు రికవరీ మెయిల్‌కు కూడా ఈ సందేశం వస్తుందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో డిలీట్ ముప్పు ఉన్న జీమెయిల్ అకౌంట్ల (Gmail Account)కు ఇప్పటికే పలుసార్లు హెచ్చరిక మెసేజ్‌లు వచ్చి ఉంటాయి. కనీసం రెండేళ్ల నుంచి వినియోగించకుండా, లాగిన్ కాకుండా ఉన్న జీమెయిల్ అకౌంట్లతో పాటు దానికి అనుసంధానమై ఉన్న డాక్స్, డ్రైవ్, మీట్, కేలండర్, ఫొటోస్‌లోని కంటెంట్ సైతం తొలగిపోతుందని గూగుల్ స్పష్టం చేసింది.
సుదీర్ఘకాలంగా వినియోగించని ఖాతాలకు పాత పాస్‌వర్డ్‌లు, పలుసార్లు ఉపయోగించిన పాస్‌వర్డ్‌లు ఉండి ఉంటాయని గూగుల్ (Google) వివరించింది. పైగా వీటికి టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ కూడా ఉండి ఉండదని గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో సెక్యూరిటీ, ప్రైవసీ విషయంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వివరించింది. ఒకవేళ వీటిని ఇప్పటికే ఎవరైనా దుర్వినియోగం చేసి ఉంటే.. చాలా ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉందని పేర్కొంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొనే డిలీట్ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిపింది. తమ అంతర్గత విశ్లేషణ ప్రకారం.. యాక్టివ్‌గా ఉన్న ఖాతాలతో పోలిస్తే నిరుపయోగంగా ఉన్నవి చాలా తక్కువేనని పేర్కొంది.
కనీసం రెండేళ్ల నుంచి నిరుపయోగంగా ఉన్న వ్యక్తిగత జీమెయిల్ అకౌంట్లను మాత్రమే తొలగిస్తామని గూగుల్ తెలిపింది. బిజినెస్‌లు, స్కూళ్ల వంటి సంస్థలకు సంబంధించిన ఖాతాలపై మాత్రం ఈ ప్రభావం ఉండబోదని స్పష్టం చేసింది. గూగుల్ బ్లాగ్‌లో పేర్కొన్న ప్రకారం ఒక గూగుల్ అకౌంట్ యాక్టివ్‌గా ఉండాలంటే.. కనీసం రెండేళ్లకు ఒకసారైనా ఖాతాలోకి లాగిన్ కావాలి. గూగుల్ అకౌంట్ లేదా దానికి అనుసంధానమై ఉన్న ఇతర ఏ సేవనైనా గడిచిన రెండేళ్లలో ఒకసారి ఉపయోగించుకొని ఉంటే ఆ ఖాతా యాక్టివ్‌గా ఉన్నట్లు లెక్క. జీమెయిల్ పంపడం, గూగుల్ డ్రైవ్ వాడడం, లాగిన్ అయ్యి యూట్యూబ్‌లో వీడియో చూడడం, గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్ డౌన్‌లోడ్ చేయడం, గూగుల్ సెర్చ్ చేయడం, గూగుల్ ఖాతా సాయంతో థర్డ్ పార్టీ యాప్‌లకు లాగిన్ కావడం.. ఈ చర్యలలో ఏ ఒక్క దాన్నైనా మీరు తాజాగా చేపట్టి ఉంటే ఆ గూగుల్ అకౌంట్‌కు ఢోకా లేనట్లే. యూట్యూబ్ వీడియోస్‌తో అనుసంధానమై ఉన్న ఖాతాలను మాత్రం తొలగించబోమని స్పష్టం చేసింది.