Artificial Sun: కృత్రిమ సూర్యుడి దిశగా చైనా మరో అడుగు.. ప్రపంచంలోనే అతిపెద్ద మాగ్నెట్ నిర్మించిన చైనా.. ఏకంగా 582 టన్నుల అయస్కాంతంతో..
స్వచ్ఛమైన, దాదాపు అపరిమితమైన విద్యుత్ ఉత్పత్తికి మార్గం సుగమం చేసే అణు సంలీనం (Nuclear Fusion) సాంకేతికతలో చైనా మరో కీలక మైలురాయిని అధిగమించింది. చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా ఫిజిక్స్ శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత శక్తివంతమైన టోరాయిడల్ ఫీల్డ్ సూపర్‌కండక్టింగ్ అయస్కాంతాన్ని విజయవంతంగా తయారు చేసి పరీక్షించారు.
Artificial Sun: స్వచ్ఛమైన, దాదాపు అపరిమితమైన విద్యుత్ ఉత్పత్తికి మార్గం సుగమం చేసే అణు సంలీనం (Nuclear Fusion) సాంకేతికతలో చైనా మరో కీలక మైలురాయిని అధిగమించింది. చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా ఫిజిక్స్ శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత శక్తివంతమైన టోరాయిడల్ ఫీల్డ్ సూపర్‌కండక్టింగ్ అయస్కాంతాన్ని విజయవంతంగా తయారు చేసి పరీక్షించారు. ఈ సాంకేతిక విజయం భవిష్యత్తులో కృత్రిమ సూర్యుడు (Artificial Sun) ప్రాజెక్టుల అభివృద్ధికి కీలకంగా మారనుంది.
డ్రాగన్ కంట్రీ రూపొందించిన ఈ D-ఆకారపు సూపర్‌కండక్టింగ్ అయస్కాంతం 21 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పు, 582 టన్నుల బరువు కలిగి ఉంది. ఇది ప్రస్తుతం అంతర్జాతీయంగా అభివృద్ధి చేస్తున్న ITER (International Thermonuclear Experimental Reactor) ప్రాజెక్టులో ఉపయోగిస్తున్న అయస్కాంతాల కంటే 1.3 రెట్లు పెద్దది. అలాగే మూడు రెట్లు అధిక శక్తి నిల్వ సామర్థ్యం కలిగి ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.
కృత్రిమ సూర్యుడు అంటే సూర్యుడిలో సహజంగా జరిగే అణు సంలీనం (Fusion) ప్రక్రియను భూమిపై పునరావృతం చేసే రియాక్టర్. ఇందులో దాదాపు 100 మిలియన్ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద హైడ్రోజన్ అణువులు కలిసిపోవడం ద్వారా అపారమైన శక్తి విడుదల అవుతుంది. ఈ ప్రక్రియలో కార్బన్ డయాక్సైడ్ వంటి గ్రీన్‌హౌస్ వాయువులు విడుదల కాకపోవడం వల్ల ఇది భవిష్యత్తు పరిశుభ్రమైన ఇంధన వనరుగా పరిగణిస్తున్నారు.
అయితే ఇంత భారీ ఉష్ణోగ్రతలను తట్టుకోవడం సాధ్యం కాదు. అందుకే అత్యంత వేడిగా ఉండే ప్లాస్మాను రియాక్టర్ గోడలకు తాకకుండా మధ్యలోనే బంధించి ఉంచేందుకు ఈ సూపర్‌కండక్టింగ్ అయస్కాంతం అత్యంత బలమైన అయస్కాంత క్షేత్రాన్ని సృష్టిస్తుంది. ఇదే ఫ్యూజన్ రియాక్టర్‌లో కీలక పాత్ర పోషిస్తుంది.
ఈ ప్రాజెక్టులో భాగంగా ఫ్యూజన్ రియాక్టర్‌కు హార్ట్ గా భావించే సెంట్రల్ సోలెనాయిడ్ కాయిల్ ను కూడా చైనా శాస్త్రవేత్తలు విజయవంతంగా పరీక్షించారు. ఈ మొత్తం సాంకేతికతను పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేయడం విశేషం. ఈ ప్రాజెక్టు ద్వారా చైనా 47 పేటెంట్లు, 25 పరిశ్రమ ప్రమాణాలు సాధించడంతో పాటు విదేశీ సాంకేతికతపై ఆధారపడే అవసరాన్ని గణనీయంగా తగ్గించుకుంది.
ఈ తరహా సూపర్‌కండక్టింగ్ అయస్కాంతాన్ని రూపొందించడం ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన ఇంజినీరింగ్ పనుల్లో ఒకటిగా భావిస్తారు. ఇది మైనస్ 269 డిగ్రీల సెల్సియస్ అత్యల్ప ఉష్ణోగ్రత వద్ద పనిచేస్తుంది. అంతేకాదు 100,000 ఆంపియర్లకు పైగా విద్యుత్ ప్రవాహాన్ని శక్తి నష్టం లేకుండా మోయగలదు. తీవ్రమైన రేడియేషన్‌ను తట్టుకుని దాదాపు 60 సంవత్సరాల పాటు పనిచేసేలా దీనిని రూపొందించారు.
ఇంతకుముందు చైనాకు చెందిన EAST (Experimental Advanced Superconducting Tokamak) ఫ్యూజన్ రియాక్టర్ 100 మిలియన్ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద 1,066 సెకన్ల పాటు ప్లాస్మాను స్థిరంగా నిలిపి ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈ విజయాన్ని ఇప్పుడు మరింత అధునాతన సాంకేతికతతో ముందుకు తీసుకెళ్తోంది.
చైనా రూపొందించిన రోడ్‌మ్యాప్ ప్రకారం 2027 నాటికి బర్నింగ్ ప్లాస్మా రియాక్టర్‌ను పూర్తి చేసి.. 2030 నాటికి అణు సంలీనం ద్వారా వాణిజ్యపరమైన విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. పూర్తి స్థాయి ఫ్యూజన్ రియాక్టర్ నిర్మాణం, నిరంతర విద్యుత్ ఉత్పత్తి వంటి సవాళ్లు ఇంకా ఉన్నప్పటికీ, ఈ తాజా విజయం ప్రపంచ స్వచ్ఛ ఇంధన రంగంలో చైనాను అగ్రగామిగా నిలబెట్టే కీలక అడుగుగా భావిస్తున్నారు.
భవిష్యత్తులో ఈ సాంకేతికత విజయవంతమైతే.. కార్బన్ ఉద్గారాలు లేకుండా అపారమైన, దాదాపు అంతులేని స్వచ్ఛ విద్యుత్‌ను ఉత్పత్తి చేసే కొత్త ఇంధన యుగానికి నాంది పలికే అవకాశముందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.