Artificial Moon: వెన్నెల్లో హాయ్.. హాయ్.. కృత్రిమ చంద్రుడిని తయారు చేస్తున్న చైనా, ఇకపై అక్కడ ప్రతి రాత్రి వెన్నెల రాత్రే!

ఒక స్విచ్ ఆన్ చేస్తే చాలు ఆకాశంలో నిండు చంద్రుడు ఆవిష్కృతమవుతుంది.

Image used for representational purpose only | (Photo Credits: Pixabay)

టెక్నాలజీతో దూసుకుపోయే చైనా (China) దేశం మరో అద్భుతానికి వేదిక సిద్ధం చేసుకుంటుంది. నిండు పౌర్ణమిని (Fool Moon day) చూడాలంటే అందరిలాగా చైనాలో రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదు. ఒక స్విచ్ ఆన్ చేస్తే చాలు ఆకాశంలో నిండు చంద్రుడు ఆవిష్కృతమవుతుంది.

చైనాలోని చెంగ్డూ (Chengdu) నగర పాలక అధికారులు నగరంలోని వీధి లైట్లకు (Street Lights) బదులుగా కృతిమ చంద్రుడు (Artificial Moon) ను ఏర్పాటు చేసే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకూ ఉన్న వివరాల ప్రకారం మరి కొన్ని నెలల్లోనే 2020 కల్లా ఈ ప్రాజెక్టును పూర్తి చేసి నగర ప్రజలకు కృత్రిమంగా జాబిల్లి వెలుగులు అందించాలనేది వారి లక్ష్యం. ఈ ప్రాజెక్ట్ పనులను చెంగ్డూ అంతరిక్ష విభాగం(CASC - Chengdu Aerospace Science & Technology Corporation) కు అప్పగించారు. ఈ ప్రాజెక్టు కోసం మన భారత కరెన్సీ ప్రకారం దాదాపు రూ. 1700 కోట్లు ఖర్చు చేస్తున్నారు.

నగరంలో వీధి దీపాలకు బదులుగా ఈ కృత్రిమ చంద్రుడిని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అలా చేస్తే భారీగా విద్యుత్ ఆదా అవడంతో పాటు వీధి లైట్ల కంటే ఇంకా ఎన్నో మెరుగైన ప్రయోజనాలు ఉంటాయి అనేది వారి ఆలోచన. అంతరిక్షంలో ఇప్పుడు ఉన్న చందమామ కంటే ఈ కృత్రిమ చంద్రుడి వెలుగు 8 రేట్లు ప్రకాశవంతంగా ఉంటుంది. దాదాపు 10 కి.మీ నుంచి 80 కి.మీ పరిధి వరకు వెలుతురును ప్రసరింపజేస్తుందని ఈ ప్రాజెక్టుకు చైర్మన్ గా వ్యవహరిస్తున్న వూ చున్‌ఫెంగ్ (Wu Chunfeng) చెప్తున్నారు.

ఈ కృత్రిమ చంద్రుడు వెలుగులు చెంగ్డూ నగరానికే పరిమితమైనా దీనిని చైనా వ్యాప్తంగా మరియు చైనాకు సమీపంగా ఉండే దేశాలు సైతం వీక్షించే అవకాశం ఉంటుందట. అయితే ప్రపంచమంతటా కనిపించే చంద్రుడి కంటే ఈ కృత్రిమ చంద్రుడు చాలా తక్కువ పరిమాణంలో ఆకాశంలో వేలాడుతున్న ఓ వీధి దీపంలో కనిపిస్తుందని చెప్తున్నారు.

అయితే, ఇలాంటి ప్రయోగాలు కొత్తవేమి కావు. గతంలో కూడా 1990 ల్లోనే రష్యా (Russia) దేశం తమ దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కృత్రిమంగా సూర్యుడి వెలుగులు అందించడానికి స్పేస్ మిర్రర్ (Space Mirror) పేరుతో సోలార్ సిస్టమ్ ను ప్రతిబింబించేలా ఓ ప్రాజెక్టుతో ముందుకొచ్చింది. అయితే ఆ ప్రయోగం విఫలమయ్యింది.

చూడాలి మరి, చైనా ఈ కృత్రిమ చంద్రుడి విషయంలో ఏ మేరకు సక్సెస్ అవుతుందో. ఒకవేళ ఈ ప్రయోగం సక్సెస్ అయితే ప్రపంచ వింతల్లో ఒకటైనా చైనా గోడ (Great Wall of China)తో పాటు ఇది మరో వింత అవుతుంది. అయితే దీని వల్ల కలిగే దుష్ప్రభావాలు, నిశాచార జీవులకు ఏమైనా హాని ఉంటుందా అనేది మరి కొందరి వాదన.