Viral Volcano Video: వీడియో ఇదిగో.. బద్దలైన అనక్ క్రకటోవా అగ్నిపర్వతం.. ఆకాశంలోకి ఎగిసిన లావా, పొగ.. 2,300 విమాన సర్వీసులు రద్దు..
ఇండోనేషియాలోని సుప్రసిద్ధ అనక్ క్రాకటోవా (Anak Krakatoa) అగ్నిపర్వతం ఒక్కసారిగా బద్దలై ఉగ్రరూపం దాల్చింది. సుమారు 25 గంటల పాటు నిరంతరాయంగా లావా, విష వాయువులు, వేడి రాళ్లు, భారీగా బూడిదను వెదజల్లడంతో ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
Viral Volcano Video: ఇండోనేషియాలోని సుప్రసిద్ధ అనక్ క్రాకటోవా (Anak Krakatoa) అగ్నిపర్వతం ఒక్కసారిగా బద్దలై ఉగ్రరూపం దాల్చింది. సుమారు 25 గంటల పాటు నిరంతరాయంగా లావా, విష వాయువులు, వేడి రాళ్లు, భారీగా బూడిదను వెదజల్లడంతో ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఆకాశంలో కిలోమీటర్ల మేర దట్టమైన బూడిద మేఘాలు అలుముకోవడంతో దేశంలో రవాణా వ్యవస్థ, ముఖ్యంగా విమాన సర్వీసులు పూర్తిగా స్తంభించిపోయాయి. ఈ విస్ఫోటనానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ముందుజాగ్రత్త చర్యగా రాజధాని జకార్తాలోని సోకర్నో-హట్టా, హలిమ్ పెర్దనకుసుమ అంతర్జాతీయ విమానాశ్రయాలతో సహా మొత్తం 8 ఎయిర్‌పోర్టులను రవాణా శాఖ తాత్కాలికంగా మూసివేసింది. దీనివల్ల సుమారు 2,300 విమాన సర్వీసులు రద్దు కావడం లేదా దారి మళ్లించడం జరిగింది. ఫలితంగా దాదాపు 2.70 లక్షల మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే చిక్కుకుపోయారు.
Viral Volcano Video:
ఇండోనేషియా జియోలాజికల్ ఏజెన్సీ పరిస్థితిని సమీక్షించి 'లెవెల్-3' (హై అలర్ట్) హెచ్చరికలను జారీ చేసింది. ప్రమాదకర ప్రాంతాల్లోని పాఠశాలలకు తక్షణమే సెలవులు ప్రకటించారు. ఈ విస్ఫోటనం వల్ల ఎలాంటి సునామీ ముప్పు లేదని అధికారులు స్పష్టం చేయడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. 2018లో ఇదే అగ్నిపర్వతం బద్దలైనప్పుడు వచ్చిన సునామీ కారణంగా 430 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతానికి సునామీ ప్రమాదం లేనప్పటికీ, గాలిలో విపరీతంగా వ్యాపించిన బూడిద, విష వాయువులు మరియు వేడి రాళ్ల ముప్పు మాత్రమే ఉందని అధికారులు వెల్లడించారు.
పరిస్థితి వేగంగా మారుతున్నందున విమానాశ్రయాల పునఃప్రారంభంపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని ఇండోనేషియా రవాణా శాఖ మంత్రి దుదీ పుర్వగంధీ స్పష్టం చేశారు. ప్రయాణికులు ఎప్పటికప్పుడు తమ విమానయాన సంస్థలతో సంప్రదింపులు జరపాలని సూచించారు. కాగా, పసిఫిక్ 'రింగ్ ఆఫ్ ఫైర్' (Ring of Fire) ప్రాంతంలో ఉండటం వల్ల ఇండోనేషియాలో తరచూ ఇలాంటి అగ్నిపర్వత విస్ఫోటనాలు, భూకంపాలు సంభవిస్తుంటాయి.