US Water Crisis: అమెరికాలో నీటి సంక్షోభం.. తీవ్రమైన నీటి కొరతతో అల్లాడుతున్న కార్పస్ క్రిస్టీ నగరం.. ప్రపంచ దేశాలకు గట్టి వార్నింగ్..

అగ్రరాజ్యం అమెరికాలో గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్ర నీటి సంక్షోభం తలెత్తుతోంది. టెక్సాస్ రాష్ట్రంలోని సుమారు 3 లక్షల జనాభా కలిగిన ప్రముఖ తీర ప్రాంత నగరం 'కార్పస్ క్రిస్టీ' తీవ్ర నీటి కొరతతో అల్లాడుతోంది. ఆధునిక అమెరికా చరిత్రలోనే నీళ్లు పూర్తిగా అడుగంటిన తొలి నగరంగా ఇది నిలిచే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు

Drought (photo-ANI)

US Water Crisis: అగ్రరాజ్యం అమెరికాలో గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్ర నీటి సంక్షోభం తలెత్తుతోంది. టెక్సాస్ రాష్ట్రంలోని సుమారు 3 లక్షల జనాభా కలిగిన ప్రముఖ తీర ప్రాంత నగరం 'కార్పస్ క్రిస్టీ' తీవ్ర నీటి కొరతతో అల్లాడుతోంది. ఆధునిక అమెరికా చరిత్రలోనే నీళ్లు పూర్తిగా అడుగంటిన తొలి నగరంగా ఇది నిలిచే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏళ్ల తరబడి పీడిస్తున్న కరవు, పెరుగుతున్న జనాభా, అపరిమిత పారిశ్రామిక అవసరాలు, ప్రత్యామ్నాయ నీటి వనరుల నిర్మాణంలో జాప్యమే ఈ పరిస్థితికి ముమ్మాటికీ కారణమని తెలుస్తోంది.

నగరంలో శరవేగంగా పెరిగిన పారిశ్రామికీకరణ, ముఖ్యంగా భారీ పెట్రోకెమికల్ పరిశ్రమల ఏర్పాటు నీటి నిల్వలపై తీవ్ర ఒత్తిడి తెచ్చింది. 2022లో ప్రారంభించిన ఒక ప్లాస్టిక్స్ కెమికల్ ప్లాంట్, నగర ప్రజలందరూ ఒక రోజులో వాడే నీటిని ఒక్క రోజే కూలింగ్ కోసం వినియోగిస్తోందంటే నీటి వాడకం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనికి తోడు వాతావరణ మార్పుల వల్ల రిజర్వాయర్లలో నీటి మట్టాలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయి. సముద్రపు నీటిని మంచి నీటిగా మార్చే డీశాలినేషన్ ప్లాంట్ ప్రతిపాదన ఉన్నప్పటికీ నిధుల కొరత, అనుమతులు మరియు స్థానిక వ్యతిరేకతల వల్ల ప్రాజెక్టు ఆలస్యమవుతోంది.

అమెరికాలో వేలాది మంది భారతీయ ఉద్యోగులపై ట్రంప్ మరో పిడుగు.. వర్క్‌ పర్మిట్ల ఆటోమేటిక్ రెన్యువల్స్‌ రద్దు, పూర్తి వివరాలు ఇవిగో..

ఇటీవలి వర్షాలు కొంత ఉపశమనాన్ని ఇచ్చినప్పటికీ.. నగరంలో కేవలం ఒక ఏడాదికి సరిపడా నీటి నిల్వలు మాత్రమే ఉన్నాయని, ఇది అత్యవసర పరిణామమని 'ఇన్‌సైడ్ క్లైమేట్' న్యూస్ జర్నలిస్ట్ డైలాన్ బడ్డౌర్ వెల్లడించారు. నీళ్లు పూర్తిగా అయిపోయే స్థితికి అమెరికాలో కార్పస్ క్రిస్టీ నగరం అత్యంత చేరువలో ఉందన్నారు. ప్రస్తుతం అధికారులు లోతైన భూగర్భ బావుల తవ్వకం, వ్యర్థ జలాల పునర్వినియోగం వంటి మార్గాలను అన్వేషిస్తున్నారు.

ఈ సంక్షోభం వల్ల ఇప్పటికే ప్రజల రోజువారీ జీవితంపై ఆంక్షలు మొదలయ్యాయి. ఇళ్ల తోటలకు నీరు పెట్టడం, వాహనాలు కడగడంపై తీవ్ర నిబంధనలు విధిస్తున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే నీటి సరఫరాలో కోతలు విధించడం తప్పదని అధికారులు స్పష్టం చేశారు. పెరుగుతున్న జనాభా, వాతావరణ మార్పుల నడుమ నీటి వనరులను కాపాడుకోకపోతే ప్రపంచవ్యాప్తంగా నగరాలకు ఎలాంటి ముప్పు ఎదురవుతుందో చెప్పడానికి కార్పస్ క్రిస్టీ ఒక హెచ్చరికగా నిలిచిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement