వలసదారులపై కఠిన విధానాలు అమలుచేస్తోన్నఅగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కారు తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. వలస కార్మికుల ఉపాధి అధికారం పత్రాల (Employment Authorization Documents - EAD) ఆటోమేటిక్ పొడిగింపును ఇకపై కొనసాగించబోమని అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ (DHS) ప్రకటించింది. ఈ నిర్ణయం వలసదారులపై ముఖ్యంగా భారతీయ ఉద్యోగులపై గణనీయమైన ప్రభావం చూపనుంది. వేలాది మంది భారతీయ ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం ఉంది.
బుధవారం విడుదల చేసిన మధ్యంతర నియమ ప్రకటనలో అక్టోబర్ 30, 2025 లేదా ఆ తర్వాత తమ EAD పునరుద్ధరణ కోసం దరఖాస్తు చేసే విదేశీయులు ఇకపై ఆటోమేటిక్ రిన్యువల్‌కు అర్హులు కారని DHS తెలిపింది. అయితే, అక్టోబర్ 30కి ముందు దాఖలైన, ఇప్పటికే ఆటోమేటిక్‌గా పొడిగించబడిన పత్రాలు ప్రభావితం కావని తెలిపింది.
ఈ కొత్త నియమం ప్రకారం, అమెరికా ప్రభుత్వం జాతీయ భద్రత, ప్రజా భద్రత రక్షణ కోసం అదనపు స్క్రీనింగ్ మరియు తనిఖీలను చేపడుతుంది. ట్రంప్ పరిపాలన ఈ మార్పును భద్రతను బలోపేతం చేసే చర్యగా పేర్కొంది. ఇది బైడెన్ పరిపాలన అమలు చేసిన 540 రోజుల ఆటోమేటిక్ పొడిగింపు విధానానికి ప్రత్యామ్నాయం. గత నియమం ప్రకారం, వలస కార్మికులు తమ పునరుద్ధరణ దరఖాస్తు సకాలంలో దాఖలు చేసినట్లయితే, వారి EAD గడువు ముగిసినా 540 రోజుల పాటు అమెరికాలో పనిచేయగలిగేవారు.
కొత్త నియమంలో కొన్ని పరిమిత మినహాయింపులు ఉన్నాయి. ఉదాహరణకు టెంపరరీ ప్రొటెక్టెడ్ స్టేటస్ (TPS) కింద ఉన్న వ్యక్తులు లేదా ప్రత్యేక నిబంధనల ప్రకారం పొడిగింపులు పొందినవారికి మాత్రమే ఈ మినహాయింపులు వర్తిస్తాయి. USCIS (యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్)డైరెక్టర్ జోసెఫ్ ఎడ్లో మాట్లాడుతూ.. అమెరికాలో పనిచేయడం హక్కు కాదు, అది ప్రత్యేక అనుమతి. వలసదారుల నేపథ్యాన్ని తరచుగా సమీక్షించడం అవసరమని పేర్కొన్నారు.
ఆయన ప్రకారం ఈ కొత్త విధానం మోసపూరిత EAD దరఖాస్తులను తగ్గించడమే లక్ష్యం. USCIS సూచనల ప్రకారం, వలసదారులు తమ EAD గడువు ముగియడానికి 180 రోజుల ముందే పునరుద్ధరణ దరఖాస్తు దాఖలు చేయాలని సూచించింది. ఆలస్యం చేస్తే, ఉపాధి అధికారంలో తాత్కాలిక అంతరాయం వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది.
EAD అంటే ఏమిటి?
EAD లేదా Employment Authorization Document (ఫారం I-766) అనేది ఒక విదేశీయుడికి అమెరికాలో నిర్దిష్ట కాలం పాటు పని చేసే అధికారం ఉందని రుజువు చేసే పత్రం. శాశ్వత నివాసితులు (గ్రీన్ కార్డ్ హోల్డర్లు) ఈ పత్రం అవసరం లేకుండా పని చేయవచ్చు. అయితే, వీసా స్థితి మార్పు కోరుకుంటున్న తాత్కాలిక వలసదారులకు ఇది తప్పనిసరి.
ఇక, H-1B వీసా ఫీజు విషయంలో కూడా ఇటీవల ట్రంప్ పరిపాలన పెద్ద పెంపు చేసింది. సెప్టెంబర్‌లో ప్రకటించిన కొత్త నిర్ణయం ప్రకారం, కొత్త H-1B వీసా దరఖాస్తుదారుల నుండి లక్ష డాలర్లు (రూ. 88 లక్షలు) ఫీజు వసూలు చేయబడుతుంది. అయితే ఇప్పటికే అమెరికాలో ఉన్నవారికి ఇది వర్తించదు.
మరోవైపు, ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్ కూడా దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలకు అమెరికన్ పౌరులను ఉద్యోగాల్లో నియమించాలి, విదేశీ కార్మికులను H-1B వీసాలతో తీసుకోవద్దు అనే ఆదేశాలు జారీ చేశారు. ఈ చర్యలతో అమెరికాలో వలస కార్మికుల భవిష్యత్తుపై మరింత అనిశ్చితి నెలకొంది. ముఖ్యంగా భారతీయ వృత్తి నిపుణులు, టెక్ ఉద్యోగులు తమ ఉపాధి పత్రాల పునరుద్ధరణలో పెద్ద సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.