Fixed Deposit Rules 2026: పెద్ద మొత్తంలో FD చేయబోతున్నారా.. అక్టోబర్ 1 నుంచి ఈ కొత్త రూల్స్ తప్పక తెలుసుకోండి
బ్యాంకింగ్ రంగంలో ధరల నిర్ణయ ప్రక్రియలో మరింత పారదర్శకత, ఏకరూపత తీసుకురావడమే లక్ష్యంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బల్క్ డిపాజిట్ల (Bulk Fixed Deposits)పై కీలక మార్గదర్శకాలను జారీ చేసింది.
Fixed Deposit Rules 2026: బ్యాంకింగ్ రంగంలో ధరల నిర్ణయ ప్రక్రియలో మరింత పారదర్శకత, ఏకరూపత తీసుకురావడమే లక్ష్యంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బల్క్ డిపాజిట్ల (Bulk Fixed Deposits)పై కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల్లో రూ. 3 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ మొత్తంలో డిపాజిట్ చేసే బల్క్ ఎఫ్‌డీలపై అక్టోబర్ 1, 2026 నుండి కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. దీని ప్రకారం బ్యాంకులు ప్రతి పనిదినం తమ అధికారిక వెబ్‌సైట్లలో వర్తించే వడ్డీ రేట్లను ముందస్తుగా వెల్లడించడం తప్పనిసరి. ఎగుమతులు, దిగుమతులపై RBI కొత్త నిబంధనలు.. అక్టోబర్ 1 నుంచి అమలు.. ఇవి తప్పక తెలుసుకోండి
నూతన నిబంధనల ప్రకారం, బ్యాంకులు ప్రతిరోజూ ఉదయం 10 గంటలలోపు ఆ రోజుకు వర్తించే బల్క్ డిపాజిట్ వడ్డీ రేట్లను వెబ్‌సైట్‌లో ప్రచురించాల్సి ఉంటుంది. ఏవైనా మార్పులు ఉంటే ప్రతి 10 నిమిషాల వ్యవధిలో వాటిని నవీకరించే (Update) సౌలభ్యం ఉంటుంది. అత్యంత ముఖ్యమైన అంశమేమిటంటే, ఒక డిపాజిట్‌పై చెల్లించే వడ్డీ రేటు సదరు బ్యాంకు ముందస్తుగా వెబ్‌సైట్‌లో వెల్లడించిన రేటుకే కట్టుబడి ఉండాలి.
కొత్త విధానంలో ప్రధానాంశాలు:
శాఖల మధ్య ఏకరూపత: ఒకే రోజున ఒకే రకమైన డిపాజిట్ చేసే ఖాతాదారునికి, వారు ఉపయోగించే బ్రాంచ్ లేదా డిజిటల్ ఛానెల్‌తో సంబంధం లేకుండా ఒకే రకమైన వడ్డీ రేటు వర్తిస్తుంది.
సులభమైన పోలిక: పెద్ద మొత్తంలో డిపాజిట్ చేసే సంస్థలు లేదా వ్యక్తులు వేర్వేరు బ్యాంకులు అందించే రేట్లను సులభంగా పోల్చి చూసుకుని సరైన నిర్ణయం తీసుకోవడానికి ఈ ముందస్తు ప్రకటనలు ఉపయోగపడతాయి.
లిక్విడిటీ ఆధారిత వ్యత్యాసాలు: లిక్విడిటీ కవరేజ్ రేషియో (LCR) ఫ్రేమ్‌వర్క్ కింద డిపాజిట్ల ద్రవ్యత్వ లక్షణాలు వేర్వేరుగా ఉన్నప్పుడు, బ్యాంకులు భిన్నమైన రేట్లను అందించే వెసులుబాటు ఇంకా కొనసాగుతుంది.
ఈ మార్పు ప్రధానంగా రూ. 3 కోట్లు అంతకంటే ఎక్కువ జమ చేసే బల్క్ డిపాజిటర్లను లక్ష్యంగా చేసుకుని తీసుకొచ్చినందున, రూ. 1 లక్ష నుండి రూ. 25 లక్షల వరకు చిన్న మొత్తాలు జమ చేసే సాధారణ రిటైల్ ఎఫ్‌డీ (Retail FD) పెట్టుబడిదారులపై దీని ప్రభావం తక్కువగా ఉంటుందని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టే డిపాజిటర్లు అక్టోబర్ 1 నుండి డబ్బు జమ చేసే ముందు బ్యాంకు వెబ్‌సైట్‌లో రేట్లను పరిశీలించి.. డిపాజిట్ చేసిన నాటి రేటు రికార్డును లేదా స్క్రీన్‌షాట్‌ను భద్రపరుచుకోవడం మంచిదని సూచిస్తున్నారు.