PayPal India Layoffs: ఆగని ఉద్యోగాల కోత.. ముందస్తు హెచ్చరికలు లేకుండా 600 మందిని ఇంటికి సాగనంపుతున్న పేపాల్..భోరుమంటున్న ఉద్యోగులు..
ఖర్చులను నియంత్రించుకోవడం, అంతర్జాతీయ స్థాయి పునర్వ్యవస్థీకరణలో భాగంగా ప్రముఖ ఫిన్‌టెక్ దిగ్గజం 'పేపాల్' (PayPal) భారతదేశంలోని తన వివిధ బృందాల్లో పనిచేస్తున్న దాదాపు 600 మంది ఉద్యోగులను తొలగించింది.
PayPal India Layoffs: ఖర్చులను నియంత్రించుకోవడం, అంతర్జాతీయ స్థాయి పునర్వ్యవస్థీకరణలో భాగంగా ప్రముఖ ఫిన్‌టెక్ దిగ్గజం 'పేపాల్' (PayPal) భారతదేశంలోని తన వివిధ బృందాల్లో పనిచేస్తున్న దాదాపు 600 మంది ఉద్యోగులను తొలగించింది. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లోని కార్యాలయాల్లో టెక్నాలజీ, ఇంజనీరింగ్, ఆపరేషన్స్, పేమెంట్స్, ఫైనాన్స్ విభాగాల్లో ఈ లేఆఫ్స్ చోటుచేసుకున్నట్లు తెలిసింది. భారత్‌లోని పేపాల్ డెవలప్‌మెంట్ సెంటర్లలో ఉన్న మొత్తం 6,000 మంది ఉద్యోగులలో ఇది సుమారు 10 శాతం కావడం గమనార్హం.
ఉబెర్‌లో మళ్లీ లేఆఫ్స్.. 3,300 మంది ఉద్యోగులపై వేటు వేసిన రైడ్-హెయిలింగ్ దిగ్గజం..
ఈ లేఆఫ్స్ ప్రక్రియ అత్యంత ఆకస్మికంగా జరిగిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ముందస్తు హెచ్చరికలు లేకుండానే సోమవారం ఉదయం ఒక ఆన్‌లైన్ సమావేశంలో పాల్గొనాలని కోరారని, కాల్ ముగిసిన వెంటనే సిస్టమ్స్, ఈమెయిల్ యాక్సెస్‌లను తక్షణమే నిలిపివేశారని తెలిపారు. నష్టపరిహారంగా ఒక నెల జీతంతో పాటు అవుట్‌ప్లేస్‌మెంట్ సహాయం అందిస్తామని యాజమాన్యం హామీ ఇచ్చినప్పటికీ, తుది సెటిల్‌మెంట్‌పై స్పష్టత లేదని ప్రభావిత ఉద్యోగులు పేర్కొన్నారు.
రాబోయే రెండు నుండి మూడు సంవత్సరాలలో తమ ప్రపంచవ్యాప్త ఉద్యోగుల సంఖ్యను 20 శాతం తగ్గించి, $1.5 బిలియన్ల వ్యయాన్ని ఆదా చేయాలని పేపాల్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఆసియా-పసిఫిక్ రీజియన్‌తో పాటు ఐర్లాండ్, అమెరికా, యూరోప్ వ్యాప్తంగా దశలవారీగా ఉద్యోగ కోతలను అమలు చేస్తోంది.
భారత్‌లోని గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు (GCC) ఈ తాజా లేఆఫ్స్ తీరని ప్రతికూలంగా మారాయి. ఉబెర్, ఒరాకిల్ వంటి ఇతర బహుళజాతి సంస్థలు కూడా భారత్‌లోని తమ కార్యాలయాల్లో ఉద్యోగుల సంఖ్యను తగ్గించే పనిలో పడ్డాయి. గ్లోబల్ మాతృ సంస్థలపై ఆర్థిక ఒత్తిడులు పెరగడం, సంప్రదాయ ఉపాధి కంటే కృత్రిమ మేధ (AI) ఆధారిత ఆటోమేషన్‌పై నిపుణులు దృష్టి సారించడమే భారతీయ జిసిసిలలో ఊచకోతలకు ప్రధాన కారణమని పరిశ్రమ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.