AP SSC Exams 2021: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షలు వాయిదా, కరోనా ఉధృతి దృష్ట్యా కీలక నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం, ఏపిలో కర్ఫ్యూ పొడగించే అవకాశం!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూన్ 7 నుంచి ప్రారంభం కావాల్సిన ఎస్‌ఎస్‌సి- 2021 పరీక్షలను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం గురువారం నిర్ణయించింది. రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై ఈరోజు విద్యాశాఖ అధికారులతో...

Representational Image | File Photo

Amaravathi, May 27:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూన్ 7 నుంచి ప్రారంభం కావాల్సిన ఎస్‌ఎస్‌సి- 2021 పరీక్షలను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం గురువారం నిర్ణయించింది. రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై ఈరోజు విద్యాశాఖ అధికారులతో సీఎం జగన్ తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.

ప్రస్తుతం రాష్ట్రంలో కర్ఫ్యూ అమలులో ఉంది. కేసులు ఇప్పటికీ ఎక్కువగానే వస్తున్న కారణంగా ఇప్పుడున్న కర్ఫ్యూను మరికొన్ని రోజులు పొడగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాకుండా టీచర్లకు వ్యాక్సినేషన్ మొదలగు అంశాలను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర సర్కార్, చివరకు పరీక్షలు వాయిదా వేయాలని నిర్ణయానికి వచ్చింది. జూలైలో పరిస్థితులను మళ్లీ సమీక్షించి పదో తరగతి పరీక్షలపై అప్పుడు నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.

కరోనా నేపథ్యంలో 2020-21 సంవత్సరానికి ఎస్‌ఎస్‌సి సిలబస్‌ను ఏపి ప్రభుత్వం తగ్గించింది. అంతేకాకుండా సాధారణంగా ఉండే 11 పేపర్లకు బదులుగా 7 పేపర్లకు కుదించి పరీక్షలు నిర్వహించాలని భావించారు. ఎలాగైనా జూన్ 7 నుంచి పదో తరగతి పరీక్షలు నిర్వహించే తీరాలని పట్టుదలతో ఉండటంతో కొంతమంది సామాజిక కార్యకర్తలు హైకోర్టును ఆశ్రయించారు. పరీక్షలు రద్దు చేయాలని కొందరు, టీచర్లకు టీకాలు వేసిన తర్వాతే పది పరీక్షలు నిర్వహించాలని కొందరు తమ పిటిషన్లో కోరారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరగా, జూన్ చివరి వరకు పరీక్షలను వాయిదా వేసే నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. పాఠశాలలు కూడా ఇప్పట్లో ప్రారంభించడం లేదని వివరించింది. పరిస్థితిని విశ్లేషించిన తర్వాతే జూలై నెలలో కొత్త షెడ్యూల్ విడుదల చేస్తామని స్పష్టం చేసింది.

రాష్ట్రంలో కోవిడ్ ఉధృతి దృష్ట్యా ప్రభుత్వం అంతకుముందు ఇంటర్మీడియట్ పరీక్షలను కూడా వాయిదా వేసిన విషయం తెలిసిందే.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement