Diplomatic Passport: విదేశాలకు వెళ్లాంటే పాస్‌పోర్ట్ ఎందుకు అవసరం? ఇండియాలో ఎన్ని రకాల పాస్‌పోర్ట్‌లు జారీచేస్తారు మరియు డిప్లోమాటిక్ పాస్‌పోర్ట్ విశేషాలు తెలుసుకోండి.

ఒక్కొక్క పాస్ పోర్ట్ ఒక్కొక్క దానికి ఉద్దేశించబడింది. రాజకీయ ప్రజాప్రతినిధులు, పెద్ద పెద్ద ఆఫీసర్లకు ఎలాంటి పాస్ పోర్ట్ లు ఉంటాయి, వాటి ప్రయోజనాలు ఏమిటో తెలుసుకోండి..

Different types of passports in India| (Photo Credits: Wikimedia Commons)

విదేశాలకు వెళ్లాలంటే మనకు పాస్‌పోర్ట్ (Passport) కావాలి. ప్రపంచంలో ఎవరైనా ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్తున్నారంటే పాస్ పోర్ట్ తప్పనిసరి. ఈ పాస్‌‌పోర్ట్ తోనే వ్యక్తి ఒక వ్యక్తి ఎవరు, ఏంటి? వారి పేరు, గుర్తింపు, నేషనాలిటీ తదితర విషయాలు తెలుసుకోవటానికి వీలుపడుతుంది. ఇండియాలో ఈ పాస్‌పోర్ట్ జారీలకు సంబంధించిన ప్రక్రియలన్నీ కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖకు (Indian Ministry of External Affairs) అనుంబంధంగా పనిచేసే వీసా మరియు పాస్ పోర్ట్ కౌన్సిలర్ డివిజన్ (CPV - Consular Passport and Visa Division) పర్యవేక్షిస్తుంది. 1967 పాస్‌పోర్ట్ చట్టం ప్రకారంగా వీటిని జారీచేయడం జరుగుతుంది.

ఇండియన్ పాస్ పోర్ట్ పొందేందుకు దేశవ్యాప్తంగా 93 ప్రాంతీయ పాస్‌పోర్ట్ కేంద్రాలు, వాటికి అనుబంధంగా సహాయక కేంద్రాలు మరియు ప్రపంచ వ్యాప్తంగా 160కు పైగా డిప్లోమాటిక్ మిషన్లు అందుబాటులో ఉన్నాయి.

ఇండియాలో 4 రకాల పాస్‌పోర్ట్ లు జారీ చేస్తున్నారు.

1) సాధారణ పాస్‌పోర్ట్: భారత పౌరులు ఎవ్వరికైనా విదేశీ ప్రయాణాలు చేసేవారి కోసం కామన్‌గా ఇదే పాస్‌పోర్ట్ జారీ చేస్తారు. ఇది నేవీ బ్లూ కలర్‌లో ఉంటుంది. దీనిని 'Type P' (P stands of Personal) పాస్‌పోర్ట్ అంటారు. అంటే విదేశాల్లో చదువు, వ్యాపారం, విదేశీ ప్రయాణాలు తదితర వ్యక్తిగత అవసరాల కోసం ఉపయోగపడుతుంది.

2) డిప్లోమాటిక్ పాస్‌పోర్ట్: దీనిని 'Type D' పాస్‌పోర్ట్ అంటారు. ఇది మెరూన్ కలర్ లో ఉంటుంది. ఇది అందరికీ లభించే పాస్‌పోర్ట్ కాదు. ఇండియాలో డిప్లోమాట్స్‌కి , టాప్ ర్యాంకింగ్స్ గల వ్యక్తులకు మాత్రమే ఈ పాస్‌పోర్ట్ జారీ చేస్తారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, సుప్రీం ప్రధాన న్యాయమూర్తి, రాష్ట ముఖ్యమంత్రి, గవర్నర్, మంత్రులు, విదేశీ వ్యవహారాల ముఖ్య అధికారులు ఈ డిప్లోమాటిక్ పాస్ పోర్ట్ పొందేందుకు అర్హులు.

అన్ని దేశాలతో ఈ డిప్లోమాటిక్ పాస్‌పోర్ట్ సంబంధించి కీలక ఒప్పందాలు ఉంటాయి. వీరిని సాధారణ ప్రయాణికులుగా కాకుండా ప్రత్యేకంగా చూస్తారు. డిప్లోమాట్ పాస్‌పోర్ట్ కలిగిన వారికి, వారి కుటుంబ సభ్యులకు మరియు సిబ్బందికి విమానాశ్రయాల్లో భద్రతాపరమైన తనిఖీల నుండి మినహాంపు ఉంటుంది. అంతేకాకుండా వీరు తమ సొంత వాహనంలో విమానం దగ్గర వరకు వెళ్లవచ్చు. వీరికి ప్రత్యేకమైన సీట్ల కేటాయింపు, విశ్రాంతి తీసుకోటానికి ప్రత్యేక వసతి లభిస్తుంది.  విదేశాల్లో కూడా వీరికి తగైన భద్రత లభిస్తుంది.

3) అఫీషియల్ పాస్‌పోర్ట్ :  Type S (Stands for Service). భారత ప్రతినిధులుగా అధికారిక కార్యకలాపాలు, విధి నిర్వహణ కోసం విదేశాలకు వెళ్లేవారి కోసం ఈ పాస్‌పోర్ట్ జారీ చేస్తారు.  ఇది తెలుపు రంగులో ఉంటుంది. ఈ పాస్‌పోర్ట్ తో ప్రత్యేక ప్రయోజనాలు ఏమి లభించనప్పటికీ, భారత్ నుంచి వచ్చిన ఆఫీసర్లుగా ఒక గుర్తింపు లభిస్తుంది. పోలీసులు, ఇతర సివిల్ సర్వెంట్లు జాతీయ ప్రయోజనాల కోసం విదేశాల్లో ప్రయాణిస్తున్నప్పుడు స్థానిక  అధికారుల నుంచి ఏదైనా సహాకారం కోరేందుకు అవకాశం ఉంటుంది.

4) తత్కాల్ పాస్ పోర్ట్ లేదా తక్కువ కాలపరిమితి పాస్‌పోర్ట్: దీనిని సాధారణమైన పాస్‌పోర్ట్ గానే పరిగణిస్తారు. అత్యవసరంగా విదేశాలకు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడితే, పాస్‌పోర్ట్ లేనివారి కోసం అప్పటికప్పుడు ఈ తత్కాల్ పాస్‌పోర్ట్ జారీ చేస్తారు. అలా విదేశంలో తమ పని ముగించుకొని తిరిగి స్వదేశం వచ్చేంతవరకు మాత్రమే ఈ పాస్‌పోర్ట్ ఉపయోగపడుతుంది.