Railway Luggage Rules: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఐఆర్‌సీటీసీలో ఆన్‌లైన్ లగేజీ బుకింగ్ సదుపాయం ప్రారంభం
ఇండియన్ రైల్వే ప్రయాణికులకు మరో సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. రిజర్వేషన్ ఉన్న ప్రయాణికులు ఇకపై అదనపు వ్యక్తిగత లగేజీని ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. దీంతో పార్సెల్ కార్యాలయాల వద్ద గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన అవసరం ఉండదు.
Railway Luggage Rules:రైలు ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు భారతీయ రైల్వే మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైళ్లలో ప్రయాణించే సమయంలో అదనపు లగేజీని తీసుకెళ్లే ప్రయాణికుల కోసం సరికొత్త ఆన్‌లైన్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. కన్ఫర్మ్ రిజర్వ్‌డ్ టికెట్ ఉన్న ప్రయాణికులు ఇకపై తమ అదనపు సామానును ఐఆర్‌సీటీసీ (IRCTC) ప్లాట్‌ఫామ్ ద్వారా టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఈ కొత్త విధానం నేటి నుంచే దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది.
గతంలో ఉచిత పరిమితి కంటే ఎక్కువ లగేజీ ఉంటే ప్రయాణికులు స్టేషన్‌లోని పార్శిల్ ఆఫీసుకు వెళ్లి గంటల తరబడి వేచి ఉండి బుక్ చేసుకోవాల్సి వచ్చేది. ఈ శ్రమను తగ్గించి ప్రయాణికుల సమయాన్ని ఆదా చేసేందుకు రైల్వే బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. సిఆర్ఐఎస్ (CRIS) అభివృద్ధి చేసిన ఈ సిస్టమ్ ద్వారా ప్రయాణ తరగతిని బట్టి ఉచిత లగేజీ పరిమితి, మోయగలిగే గరిష్ఠ బరువు, అనుమతించని వస్తువులు మరియు వర్తించే రుసుముల వివరాలను ఆన్‌లైన్‌లోనే స్పష్టంగా తెలుసుకోవచ్చు.
తరగతుల వారీగా లగేజీ పరిమితులు:
ఏసీ ఫస్ట్ క్లాస్: 70 కిలోల వరకు ఉచితం. అదనపు రుసుము చెల్లించి గరిష్ఠంగా 150 కిలోల వరకు తీసుకెళ్లవచ్చు.
ఫస్ట్ క్లాస్ & ఏసీ 2-టైర్: 50 కిలోల వరకు ఉచితం. గరిష్ఠంగా 100 కిలోల వరకు అనుమతిస్తారు.
స్లీపర్ క్లాస్: 40 కిలోల వరకు ఉచితం. గరిష్ఠంగా 80 కిలోల వరకు తీసుకెళ్లే అవకాశం ఉంది.
సెకండ్ క్లాస్ (జనరల్): 35 కిలోల వరకు ఉచితం. గరిష్ఠంగా 70 కిలోల వరకు అనుమతిస్తారు.
ఏసీ 3-టైర్, ఏసీ 3 ఎకానమీ & ఏసీ చైర్ కార్: ఈ తరగతుల్లో ఉచిత మరియు గరిష్ఠ పరిమితి రెండూ 40 కిలోలే. కాబట్టి ఈ కోచ్‌లలో ప్రయాణించేవారికి అదనపు లగేజీ బుకింగ్ సదుపాయం ఉండదు.
లగేజీ సైజ్ & చార్జీల వివరాలు: కోచ్‌లలోని స్థలాన్ని బట్టి బ్యాగుల సైజులపై కూడా స్పష్టమైన నిబంధనలు విధించారు. ఏసీ 3-టైర్, ఏసీ 3 ఎకానమీ, చైర్ కార్లలో పరిమాణం 55 సెం.మీ x 45 సెం.మీ x 22.5 సెం.మీ మించకూడదు. అదే ఏసీ ఫస్ట్ క్లాస్, 2-టైర్, స్లీపర్, జనరల్ తరగతుల్లో 100 సెం.మీ x 60 సెం.మీ x 25 సెం.మీ పరిమాణం వరకు అనుమతిస్తారు. అదనపు లగేజీకి సాధారణ రేటు కంటే 1.5 రెట్లు ఎక్కువ చార్జీ వసూలు చేస్తారు. కనీస రుసుము రూ. 30గా నిర్ణయించారు.
బుకింగ్ విధానం: ప్రయాణికులు ఇండియన్ రైల్వేస్ పార్శిల్ పోర్టల్ ద్వారా స్టేషన్లు, రైలు వివరాలు ఎంచుకుని ఫార్వార్డింగ్ నోట్‌ను ఆన్‌లైన్‌లో పూరించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రింటవుట్‌తో పాటు లగేజీని స్టేషన్‌లోని పార్శిల్ ఆఫీస్‌లో అప్పగిస్తే, వారు తూకం వేసి తుది చార్జీలను నిర్ధారిస్తారు. చెల్లింపు పూర్తయ్యాక ఇచ్చే రైల్వే రసీదు (RR) ఆధారంగా ఆన్‌లైన్‌లో లగేజీని ట్రాక్ చేయవచ్చు. గమ్యస్థానానికి సామాను చేరగానే ఎస్ఎమ్‌ఎస్ ద్వారా సమాచారం లభిస్తుంది.