
Nagar Kurnool, March 09: నాగర్‌కర్నూల్ జిల్లాలో కూలిన ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో (SLBC Tunnel) సహాయక చర్యల్లో కొంత పురోగతి లభించింది. ప్రమాదం జరిగిన 100 మీటర్ల దూరంలో డి-2 పాయింట్‌లో మనుషుల ఆనవాళ్లను కేరళ జాగిలాలు గుర్తించాయి. దీంతో ఆ ప్రాంతంలో సిబ్బంది మట్టిని తొలగించి ఒక మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడు టీబీఎం ఆపరేటర్ గురుప్రీత్‌సింగ్‌గా గుర్తించారు. మిగిలిన ఏడుగురి కోసం గాలింపు కొనసాగుతోంది.
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో 16వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇంకా 8 మంది కార్మికుల జాడ తెలియలేదు. ఇక రోబోల వినియోగం తప్పదని అధికారులు అంటున్నారు. ఆ మేరకు చర్యలకు ఉపక్రమిస్తున్నారు. చివరి 50 మీటర్ల ప్రాంతంలో సహాయక చర్యలు క్లిష్టంగా మారాయి. టెన్నెల్ ఎండ్ పాయింట్‌లో కీలక స్పాట్స్‌ను గుర్తించారు. కీలకమైన స్పాట్స్‌లో ర్యాట్ హోల్ మైనర్ల తవ్వకాలు చేపట్టారు. రెస్య్కూలో జాతీయ, అంతర్జాతీయ నిపుణులు పాల్గొంటున్నారు.
జీపీఆర్, కేడవర్ డాగ్స్ గుర్తించిన ప్రదేశాలలో చిక్కుకున్న వారి ఆచూకీ కోసం తవ్వకాలు ముమ్మరం చేశారు. టీబీఎంకు ఎడమ పక్కన కనిపించిన ఓ మృతదేహానికి సంబంధించిన చేయిని గుర్తించారు. మృతదేహం పూర్తిగా కాంక్రీట్‌లో కూరుకుపోయింది. డ్రిల్లింగ్ ద్వారానే బయటికి తీసేందుకు ప్రయత్నాలు చేశారు. ఎట్టకేలకు ఆ మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చింది రెస్క్యూ టీమ్.
కాగా, గత నెల 22వ తేదీన శైలం ఎడమ గట్టు కాల్వ (SLBC) సొరంగం తవ్వకం పనుల్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సొరంగం పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలడంలో 8 మంది లోపలే చిక్కుకుపోయారు. అందులో ఇద్దరు ఇంజనీర్లు, మరో ఇద్దరు మెషీన్ ఆపరేటర్లు, నలుగురు కార్మికులు ఉన్నారు. వారిని కాపాడేందుకు అధికారులు హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. కానీ బాధితులు సొరంగంలో 14 కిలోమీటర్ల లోపల శిథిలాలు, బురదలో చిక్కుకుపోవడంతో బయటికి తీసుకురావడం కష్టంగా మారింది.