Weather Alert: వాయుగుండంగా మారనున్న తీవ్ర అల్పపీడనం.. ఉత్తరాంధ్ర తీరానికి బిగ్ అలర్ట్.. తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు..
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. వాయవ్య బంగాళాఖాతంలో, ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాలకు దగ్గరలో కేంద్రీకృతమైన ఈ వ్యవస్థ సోమవారం నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.
Weather Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. వాయవ్య బంగాళాఖాతంలో, ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాలకు దగ్గరలో కేంద్రీకృతమైన ఈ వ్యవస్థ సోమవారం నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. దీని ప్రభావంతో రానున్న నాలుగైదు రోజుల పాటు ఉత్తర కోస్తాంధ్రలో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఉత్తరాంధ్ర తీర ప్రాంతానికి హెచ్చరికలు జారీ చేసింది.
తీవ్ర అల్పపీడనం కారణంగా ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. సముద్రం అల్లకల్లోలంగా మారి అలల ఉద్ధృతి ఎక్కువగా ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని, ఇప్పటికే వెళ్లినవారు వెంటనే సురక్షిత ప్రాంతాలకు తిరిగి రావాలని విజ్ఞప్తి చేశారు.
ఈ అల్పపీడన ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పోలవరం, ఏలూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
మరోవైపు, ఈ వాతావరణ వ్యవస్థ ప్రభావంతో దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లలో అతిభారీ వర్షాలు కురవనున్నాయి. ఈ వ్యవస్థ మధ్య భారతం మీదుగా పయనించి జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిపించే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది. అయితే, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పటికీ వర్షాభావ పరిస్థితులు కొనసాగుతుండటం గమనార్హం.