COVID-19 Vaccine: ఆగష్టు 15 లోపు కోవిడ్ వ్యాక్సిన్; మానవ ట్రయల్స్ పట్ల టెస్టింగ్ సెంటర్లకు ఐసీఎంఆర్ డెడ్‌లైన్ విధించడం పట్ల విమర్శలు, వివరణ ఇచ్చుకున్న కౌన్సిల్

వ్యాక్సిన్ అందుబాటులోకి తేవడంలో అంతతొందరెందుకు...

Representational Image | (Photo Credits: ANI)

Hyderabad, July 4: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సహాకారం మరియు భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (బిబిఐఎల్) నేతృత్వంలో దేశీయంగా అభివృద్ధి చేసిన కోవిడ్ -19 వ్యాక్సిన్ ‘బిబివి 152 కోవిడ్ వ్యాక్సిన్’ .

ప్రతిష్టాత్మక కోవిడ్ -19 వ్యాక్సిన్ కోసం హైదరాబాద్ లోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) ను మానవ క్లినికల్ ట్రయల్ సైట్‌గా ఎంపిక చేశారు. నిమ్స్ మాత్రమే కాకుండా విశాఖపట్నంలోని కేజీహెచ్ తో పాటు దేశంలోని 12 ఇతర ఆరోగ్య సంరక్షణ సంస్థలను కూడా ఐసిఎంఆర్ ఎంపిక చేసింది.

ఆగష్టు 15 నాటికి ఎలాగైనా దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురావాలని ఐసీఎంఆర్ పట్టుదలతో ఉన్న నేపథ్యంలో  రోగులపై క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించటానికి సంబంధించిన అన్ని రకాల ఆమోదాలను వేగంగా పూర్తి చేయాలని మరియు క్లినికల్ ట్రయల్స్ లో పాల్గోనే రోగుల నమోదు ప్రక్రియ కూడా వీలైనంత త్వరగా చేపట్టాలని సూచిస్తూ ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ (డిజి) డాక్టర్ బలరాం భార్గవ,   నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె. మనోహర్‌కు లేఖ రాశారు. జూలై 7 లోపు ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.

దేశంలో అన్ని ఆరోగ్య కేంద్రాల్లో క్లినికల్ ట్రయల్స్ విజయవంతమయితే గనుక ఆగష్టు 15, 2020 తర్వాత BBV152 వ్యాక్సిన్ ను ప్రజారోగ్య వినియోగానికి ఉపయోగించాలని ఐసీఎంఆర్ భావిస్తోంది. అయితే ఈ వ్యాక్సిన్ వినియోగానికి సంబంధించి తుది నిర్ణయం మాత్రం ఇప్పుడు చేపట్టబోయే క్లినికల్స్ ట్రయల్స్ మీదే ఆధారపడి ఉంటుందని బలరాం భార్గవ తన కమ్యూనికేషన్‌లో తెలిపారు.

ఐసీఎంఆర్ డెడ్‌లైన్‌పై నిపుణుల ఆందోళన

 

ఇదిలాఉంటే, క్లినికల్ ట్రయల్స్ ను వేగవంతం చేయమని ఐసీఎంఆర్ దేశంలోని నిర్ధేషిత ఆరోగ్య కేంద్రాలకు లేఖలు రాయడం పట్ల నిపుణుల నుంచి విమర్శలు వెలువెత్తాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి తేవడంలో అంతతొందరెందుకు? నిర్ధిష్ఠ గడువులోపు క్లినికల్స్ ట్రయల్స్ పూర్తి చేయాలని డెడ్ లైన్ పెట్టడం పట్ల ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ అనేది మనుషుల ప్రాణాలకు సంబంధించినది అని, తేడా వస్తే అది మరిన్ని దుష్ఫ్రభావాలకు దారితీస్తుందని హెచ్చరించారు.

ఈ విమర్శలపై స్పందించిన ఐసీఎంఆర్ తనని తాను డిఫెండ్ చేసుకుంది. తామేమి తొందరపడటం లేదని, ప్రపంచంలోని దేశాలన్నీ వీలైనంత త్వరగా కరోనావ్యాక్సిన్ అందుబాటులోకి తేవాలని ప్రయత్నాలు చేస్తున్నాయని, గ్లోబల్ ట్రెండ్స్ ను దృష్టిలో పెట్టుకొని భారత్ కూడా మిగతా దేశాలతో పోటీగానే వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొచ్చే ఉద్దేశ్యంతో చెప్పిందేనని కౌన్సిల్ వివరణ ఇచ్చుకుంది. ప్రపంచ స్థాయి ప్రమాణాల మేరకే కరోనా వ్యాక్సిన్ తయారీ, పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది.