Jammu Kashmir is now UT: ఇకపై భారతదేశంలో 28 రాష్ట్రాలే. జమ్మూకాశ్మీర్ రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మారుస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న మోడీ సర్కార్.

మోడీ సర్కార్ వ్యూహాత్మకంగా జమ్మూకాశ్మీర్ ను కేంద్ర ప్రాంతపాలిత ప్రాంతంగా మార్చేయడంతో అది రాష్ట్ర హోదా పాటు దానికి లభించిన స్వయంప్రతిపత్తి హోదా కూడా కోల్పోయినట్లయింది....

Map of India with new Jammu Kashmir-2019.

జమ్మూకాశ్మీర్ (Jammu & Kashmir) ఇకపై ఎంత మాత్రం రాష్ట్రం కాదు.   చివరగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ఇదివరకు భారతదేశం 29 రాష్ట్రాలతో ఉండేది. అయితే ఆగష్టు 05, 2019న కేంద్రప్రభుత్వం జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రంను కేంద్ర పాలిత ప్రాంతంగా (United Territory) మార్చటంతో దేశంలోని రాష్ట్రాల సంఖ్య 28కి కుదించబడినట్లయింది.  మరోవైపు కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య 9కి పెరిగింది.

జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రాన్ని రెండుగా పునర్విభజిస్తూ కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇకపై పాకిస్థాన్‌తో సరిహద్దును పంచుకునే భూభాగం జమ్మూకాశ్మీర్ పేరుతో అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా కొనసాగుతుంది. అలాగే మరోవైపు భూభాగం లడఖ్ పేరుతో అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా కొనసాగుతుంది.

జమ్మూకాశ్మీర్ రాష్ట్రం హోదాను కోల్పోవడంతో ఆ ప్రాంతానికి ఇదివరకు స్వయంప్రతిపత్తి (స్వతహాగా నిర్ణయాలు తీసుకునే అధికారం) కల్పించిన ఆర్టికల్ 370 మరియు ఆర్టికల్ 35ఎ రద్దు చేయబడ్డాయి. దీనిప్రకారం జమ్మూకాశ్మీర్‌లో భారత రాజ్యాంగం పూర్తిస్థాయిలో అమలులోకి వస్తుంది. దేశంలోని మిగతా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలాగే జమ్మూకాశ్మీర్ కూడా భారత రాజ్యాంగానికి లోబడి చట్టాలను అమలు చేయాల్సి ఉంటుంది. ఇకపై జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ తీసుకునే ప్రతీ నిర్ణయం రాష్ట్రపతి ఆమోదానికి పంపాల్సి ఉంటుంది.

'జమ్మూ కాశ్మీర్‌ను భారత్ తో అనుసంధానం చేశాం' అని రాజ్యసభలో హోంమంత్రి అమిత్‌షా వ్యాఖ్యానించడం హైలైట్.

జమ్మూ- కాశ్మీర్ వివాదం ఏంటి? దానికి స్పెషల్ స్టేటస్ ఎందుకు లభించింది?

1947లో ఆగష్టు 15తో బ్రిటిష్ పాలన ముగియడంతో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. అయితే అంతకు ముందురోజే ఆగష్టు14న పాకిస్థాన్ ప్రత్యేక దేశంగా అవతరించింది. అయితే అప్పటికే జమ్మూ-కాశ్మీర్ ప్రాంతం ఎవరితో సంబంధం లేకుండా స్వతంత్ర రాజ్యంగా కొనసాగుతుంది. కాశ్మీరీలు అటు పాకిస్థాన్‌తో గానీ, ఇటు ఇండియాతోగానీ కలవకుండా స్వతంత్రంగానే కొనసాగాలనుకున్నారు.

కానీ, 1947, అక్టోబర్ 20న పాకిస్థాన్ సైన్యం ప్రోత్సాహంతో 'ఆజాద్ కాశ్మీర్ ఫోర్స్' అనే దళం కాశ్మీర్ రాజ్యంపై దండెత్తింది. ఈ సమయంలో కాశ్మీర్ మహరాజైన హరి సింగ్, భారత మద్ధతు కోరాడు. అనివార్యమైన రాజకీయ కారణాల నేపథ్యంలో కాశ్మీర్‌ను భారత్‌లో కలిపేసేందుకు నిర్ణయం తీసుకున్నాడు.

ఫలితంగా కాశ్మీర్‌ను భారత్‌లో అంతర్భాగం చేస్తూ కాశ్మీర్ మహరాజు హరి సింగ్ మరియు అప్పటి భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రుకు మధ్య  షరతులతో కూడిన ఒప్పందం కుదిరింది.

ఆ ఒప్పందంలో భాగంగా కాశ్మీర్ ప్రజల హక్కులకు ఎలాంటి భంగం కలగకూడదు. జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రానికి స్వయంప్రతిపత్తి ఉంటుంది. కేవలం రక్షణ, విదేశీ వ్యవహారాలు మరియు కమ్యూనికేషన్ వ్యవహారాలు మాత్రమే కేంద్రం పరిధిలోకి వస్తాయి.

ఈ మేరకు ప్రధాని నెహ్రూ అందుకు అంగీకారం తెలుపుతూ కాశ్మీర్ ప్రజలకు ప్రత్యేక హక్కులను కల్పిస్తూ ఆర్టికల్ 370 మరియు ఆర్టికల్ 35ఎ అధికరణలను ప్రతిపాదించారు. ప్రధాని సూచన మేరకు పార్లమెంటు ఆమోదం లేకుండానే వాటికి రాష్ట్రపతి ఆమోదం లభించింది. అయితే అప్పుడే స్వయంప్రతిపత్తి తాత్కాలికం అని ప్రస్తావించడం జరిగింది.

ఈ స్వయం ప్రతిపత్తి కారణంగా జమ్మూ-కాశ్మీర్ అంశంలో ముఖ్య వ్యవహారాల నిర్ణయాధికారం అంతా ఆ రాష్ట్రానిదే ఇందులో కేంద్ర ప్రభుత్వం జోక్యం పరిమితం.

ఈ నేపథ్యంలోనే మోడీ సర్కార్ వ్యూహాత్మకంగా జమ్మూకాశ్మీర్‌ను కేంద్ర ప్రాంతపాలిత ప్రాంతంగా మార్చేయడంతో అది రాష్ట్ర హోదా పాటు దానికి లభించిన స్వయంప్రతిపత్తి హోదా కూడా కోల్పోయినట్లయింది.