Kalyan Robbery Video: వీడియో ఇదిగో.. గణేష్ ఉత్సవాల వేళ పట్టపగలే రూ. 40 లక్షల దోపిడీ.. 60 ఏళ్ల వ్యాపారవేత్తపై దాడి చేసి దోచుకెళ్లిన దుండగులు..
కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, సీసీటీవీల నిఘా మధ్య కళ్యాణ్‌లోని రద్దీగా ఉండే ఆగ్రా రోడ్డుపై పట్టపగలే దారుణం జరిగింది. రూ. 40 లక్షల నగదుతో బ్యాంకుకు వెళుతున్న 60 ఏళ్ల వ్యాపారవేత్తపై దుండగులు దాడి చేసి దోచుకెళ్లిన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
Kalyan Robbery Video: కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, సీసీటీవీల నిఘా మధ్య కళ్యాణ్‌లోని రద్దీగా ఉండే ఆగ్రా రోడ్డుపై పట్టపగలే దారుణం జరిగింది. రూ. 40 లక్షల నగదుతో బ్యాంకుకు వెళుతున్న 60 ఏళ్ల వ్యాపారవేత్తపై దుండగులు దాడి చేసి దోచుకెళ్లిన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సెప్టెంబర్ 15, మంగళవారం నాడు జరిగిన ఈ ఘాతకం మొత్తం సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యింది.
పోలీసు కథనం ప్రకారం.. ఫరూఖ్ అక్తర్ అనే పొగాకు, పాన్ మసాలా వ్యాపారి తన సహచరుడితో కలిసి వల్ధుని ప్రాంతం నుండి ఆగ్రా రోడ్డులోని ఒక బ్యాంకులో రూ. 40 లక్షలు జమ చేసేందుకు మోటార్ సైకిల్‌పై బయలుదేరారు. వారు బ్యాంకుకు కొద్ది దూరంలో ఉండగా, బైక్‌లపై వచ్చిన దుండగులు వెనుక నుండి వ్యాపారి బైక్‌ను బలంగా ఢీకొట్టారు. కిందపడిపోయిన అక్తర్‌పై విచక్షణారహితంగా దాడి చేసి, ఆయన చేతిలో ఉన్న నగదు బ్యాగ్‌ను లాక్కుని భివండి వైపు పరారయ్యారు.
నిందితులు ఉపయోగించిన ద్విచక్ర వాహనాలకు నంబర్ ప్లేట్లు కూడా లేవు. బాధితుడు నగదుతో బ్యాంకుకు వస్తున్న విషయం నిందితులకు ముందే ఎలా తెలిసింది? వ్యాపారిని ఎవరైనా లోకల్‌గా వెంబడించారా? అనే కోణంలో పోలీసులు అనుమానిస్తున్నారు. బజార్ పేఠ్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, పరిసర ప్రాంతాల సీసీటీవీ ఫుటేజీని సేకరించి దర్యాప్తు వేగవంతం చేశారు.
Kalyan Robbery Video:
ప్రస్తుతం గణేష్ ఉత్సవాల సందర్భంగా కళ్యాణ్-డోంబివ్లి ప్రాంతమంతటా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కళ్యాణ్ పోలీస్ జోన్-3 పరిధిలో 1,066 మందికి పైగా పోలీసు సిబ్బంది, హోమ్‌గార్డులను మోహరించి, రూట్ మార్చ్‌లు కూడా నిర్వహించారు. అంతటి కట్టుదిట్టమైన పోలీస్ పహారా ఉన్నప్పటికీ, రద్దీ రోడ్డుపై ఈ స్థాయి దోపిడీ జరగడం ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేసింది.
బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. నిందితుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.