
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్లు ఇవాళ (మార్చి 4) తొలి సెమీఫైనల్లో తలపడ్డాయి.దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. 49.3 ఓవర్లలో ఆ జట్టు 264 పరుగులకు ఆలౌటైంది.అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఇండియా లక్ష్యాన్ని చేధించి ఫైనల్ లోకి అడుగుపెట్టింది.
కింగ్ కోహ్లీ (84) కీలక ఇన్నింగ్స్‌తో పాటు శ్రేయస్ అయ్యర్ (45), కేఎల్ రాహుల్ (42) సమయోచితంగా రాణించడంతో ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్‌లో ఆస్ట్రేలియాపై టీమిండియా నాలుగు వికెట్లు తేడాతో గెలుపొందింది. అక్షర్ పటేల్ (27), రోహిత్ శర్మ (28) కూడా చెప్పుకోదగిన స్కోర్లు సాధించారు. చివర్లో హార్దిక్ పాండ్యా (28) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ఆస్ట్రేలియా నిర్దేశించిన లక్ష్యాన్ని టీమిండియా 48.1 ఓవర్లలోనే ఛేదించింది. ఆదివారం దుబాయ్‌లో జరగబోయే ఫైనల్ మ్యాచ్‌లో తలపడబోతోంది.
రోహిత్ శర్మ వికెట్ వీడియో ఇదిగో, కూపర్ కొన్నోలీ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగిన భారత కెప్టెన్
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 264 పరుగులు సాధించింది. స్టీవ్ స్మిత్ (73), అలెక్స్ క్యారీ (61) రాణించడంతో ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264 పరుగులు చేసింది. భారత్ ఎదుట 265 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ (39), మిడిలార్డర్‌లో లంబుషేన్ (29) కూడా రాణించారు. టీమిండియా బౌలర్లలో మహ్మద్ షమీ మూడు వికెట్లు తీశాడు. వరుణ్ చక్రవర్తి, జడేజా రెండేసి వికెట్లు పడగొట్టారు. అక్షర్, హార్దిక్ ఒక్కో వికెట్ తీశారు.
బుధవారం లాహోర్‌లో జరబోయే సెమీస్‌లో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లు తలపడతాయి. ఆ మ్యాచ్‌లో గెలిచే జట్టు ఆదివారం టీమిండియాతో ఫైనల్‌లో తలపడనుంది.