Citizenship Amendment Bill 2019: 'మత రాజకీయాలు ఆపండి', విపక్షాల నిరసనల మధ్య లోక్‌సభలో పౌరసత్వ సవరణ బిల్లును ప్రవేశపెట్టిన హోంశాఖ మంత్రి అమిత్ షా
మార్చి 24, 1971 తరువాత దేశంలోని ప్రవేశించిన వలసదారులను తిరిగి వారి దేశాలకు వెనక్కి పంపేందుకు, 1985, అసోం ఒప్పందాన్ని నిర్వీర్యం చేసేందుకే కేంద్రం ఈ పౌరసత్వ సవరణ బిల్లును తీసుకొస్తుందని వారు ఆరోపణలు చేస్తున్నారు....
New Delhi, December 9: భారత పౌరసత్వ (సవరణ) బిల్లు (Citizenship Amendment Bill 2019) ను లోక్‌సభలో సోమవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై ప్రతిపక్షాలు అందోళన చేపట్టాయి. ఇందులో ముస్లింలను ఎందుకు చేర్చలేదు, కేవలం ముస్లిమేతరులకే పౌరసత్వం లౌకికత్వానికి విరుద్ధం అంటూ కాంగ్రెస్ సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. పార్లమెంట్ గాంధీ విగ్రహం దగ్గర ముస్లిం లీగ్ సభ్యులు నిరసన చేపట్టారు.
పార్లమెంటులో ఈ బిల్లును ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటామని టీఎంసీ, సీపీఐ, సీపీఎం, సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ వాదీ పార్టీలు ప్రకటించాయి. టీఆర్ఎస్ పార్టీ కూడా ఈ బిల్లుకు వ్యతిరేకిస్తుంది. లోక్‌సభ మరియు రాజ్యసభల్లో ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని తమ ఎంపీలకు టీఆర్ఎస్ పార్టీ విప్ జారీ చేసింది. అయితే ఈ బిల్లు ఏ వర్గానికి వ్యతిరేకం కాదని, అన్ని అంశాలపై చర్చకు సిద్ధమేనని అమిత్ షా బదులిచ్చారు.
1955 నాటి పౌరసత్వ బిల్లుకు సవరణ చేస్తూ బంగ్లాదేశ్, పాకిస్థాన్ మరియు అఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు భారత పౌరసత్వం కల్పించే విషయమై కేంద్ర ప్రభుత్వం ఈ సవరణ బిల్లును సోమవారం పార్లమెంటులో ప్రవేశ పెట్టింది. ఇదే రోజు ఈ బిల్లును పార్లమెంటులో ఆమోదింపజేసుకోవాలని మోదీ సర్కార్ పట్టుదలతో ఉంది. పౌరసత్వ సవరణ బిల్లు అంటే ఏమిటి?
ఈ బిల్లు ఆమోదం పొందితే, పైన చెప్పినట్లు మూడు దేశాల నుంచి భారత్ లోకి వలస వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్దులు, జైనులు, క్రైస్థవులు మరియు పార్శి మతస్థులు ఇకపై అక్రమ వలసదారులు అనిపించుకోరు. వారు కూడా అందరి భారతీయులలాగే దేశంలో సమాన హక్కులు వర్తించనున్నాయి. చట్ట బద్ధంగా దేశంలోని ఏ చోటనైన స్వేచ్ఛగా నివసించవచ్చు.
ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో ఈ సవరణ బిల్లుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇందులో ముస్లిం మతస్థులను ఎందుకు చేర్చలేదు? బీజేపీ ప్రభుత్వం మత రాజకీయాలతో లబ్ది పొందాలనే ప్రయత్నం చేస్తుందని ప్రతిపక్షాల ప్రధాన ఆరోపణ అయితే, వలసదారులకు కూడా పౌరసత్వం కలిపిస్తే స్థానికులు తమ హక్కులు దెబ్బతింటాయి. తమకు దక్కాల్సిన ప్రయోజనాల్లో వారికీ వాటా లభిస్తుందనేది మరొక అభియోగం.
ఇటు ఈశాన్య భారతదేశంలోని రాష్ట్రాల ప్రజలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకంగా వ్యతిరేకిస్తున్నారు. పలు విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాల అధ్వర్యంలో పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆల్ అస్సాం స్టూడెంట్ యూనియన్ (AASU) ఈ బిల్లుకు వ్యతిరేకంగా రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చాయి. మార్చి 24, 1971 తరువాత దేశంలోని ప్రవేశించిన వలసదారులను తిరిగి వారి దేశాలకు వెనక్కి పంపేందుకు, 1985, అసోం ఒప్పందాన్ని నిర్వీర్యం చేసేందుకే కేంద్రం ఈ పౌరసత్వ సవరణ బిల్లును తీసుకొస్తుందని వారు ఆరోపణలు చేస్తున్నారు.