
Hyd, Feb 17: రంజాన్ (Ramzan) మాసం సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు (Muslim Employees) తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) శుభవార్తను తెలిపింది. రంజాన్ నెలలో ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు గంట ముందు తమ కార్యాలయాలు, పాఠశాలల నుంచి ఇంటికి వెళ్లడానికి అనుమతి ఇచ్చింది. ముస్లిం సోదరులకు ఈ అవకాశం కల్పిస్తూ తెలంగాణ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది.
ఇది మార్చి 2 నుంచి మార్చి 31,2025 వరకు వర్తిస్తుంది. ఇది కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, బోర్డు, ప్రభుత్వ రంగ ఉద్యోగులకు వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రంజాన్ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు సాయంత్రం 4 గంటలకు ఇంటికి బయలుదేరవచ్చు.ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో పని చేస్తున్న ముస్లిం ఉద్యోగులు, టీచర్లు, కాంట్రాక్ట్ వర్కర్లు అందరికీ ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని సీఎస్ పేర్కొన్నారు.ఆయా రోజుల్లో అత్యవసర పరిస్థితుల వల్ల వారు తప్పనిసరిగా హాజరుకావల్సి వస్తే తప్ప.. గంట ముందే వెళ్లిపోవడానికి సర్కారు అనుమతి ఇచ్చింది.
తెలంగాణ ప్రభుత్వం ముస్లిం ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రంజాన్ వేడుకల నిర్వహణ, ప్రత్యేక రేషన్ సరఫరా, మసీదుల వద్ద వసతులు, ట్రాఫిక్ నియంత్రణ వంటి అనేక చర్యలను చేపడుతోంది. మతపరమైన విధులు నిర్విఘ్నంగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం సూచనలు అందించింది.