Health Risks of Sleeping Too Much: రోజులో ఎక్కువ భాగం నిద్రపోతున్నారా, అయితే గుండె పోటు వచ్చే ప్రమాదం, చైనా శాస్త్రవేత్తలు తేల్చిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెల్లడి..

మెడికల్ జర్నల్ న్యూరాలజీలో ఈమేరకు అధ్యయనం వెలువడింది.

Image used for representational purpose only | (Photo Credits: Pixabay)

రోజంతా నిద్రపోవడం మీకిష్టమైతే ….ఇదిగో ఈ సమాచారం తెలుసుకోండి….కావలసిన దానికన్నా ఎక్కువగా ఎవరు నిద్రపోతారో వారికి గుండె పోటు వచ్చే ప్రమాదం ఉంది. మెడికల్ జర్నల్ న్యూరాలజీలో ఈమేరకు అధ్యయనం వెలువడింది. రోజూ మధ్యాహ్నం పూట 30 నిమిషాల పాటు కునుకుపాటు పడేవారితో పోల్చి చూస్తే 90 నిమిషాలు మించి ఎక్కువగా కునుకుపాటు పడే వారిలో వారి తరువాతి జీవితంలో 25 శాతం గుండెపోటుకు గురయ్యే అవకాశం ఉంటుందని అధ్యయనం వెల్లడించింది. అలాగే రోజూ 30 నిమిషాల వరకు కునుకుపాటు పడే వారిలో ఒకసారైనా గుండెపోటు రావచ్చు కానీ అసలు కునుకుపాటు పడని వారిలో గుండెపోటు రానేరాదని అధ్యయనం పేర్కొంది.

ఎక్కువ సమయం కునుకుపాటు పడడం, లేదా గాఢనిద్ర పోవడం అలవాటున్న వారిలో కొలొస్టరల్ స్థాయిలు ఎక్కువ కావడం, ఛాతీ సైజు పెరగడం వంటి అనారోగ్య లక్షణాలు వస్తాయని అధ్యయనాలు నిరూపిస్తున్నాయని అధ్యయన పరిశోధకుడు జ్‌క్సియీవోమినంగ్ చెప్పారు. యుహాన్‌లో హుయాఝాంగ్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధకునిగా ఆయన ఉంటున్నారు. ఎక్కువ సేపు కునికిపాటు, సుదీర్ఘ నిద్ర చురుకు లేని జీవన శైలికి నిదర్శనమని దీని వల్ల గుండెపోటు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంటుందని చెప్పారు. సరాసరి 62 ఏళ్ల వయస్సు ఉన్న చైనాకు చెందిన 31,750 మందిని ఈ అధ్యయనంలో తీసుకున్నారు. ఈ అధ్యయనం ప్రారంభించినప్పుడు వీరికెవరికీ గుండెపోటు వచ్చిన సందర్భాలు లేనేలేవు.

వీరిని ఆరేళ్ల పాటు అధ్యయనం చేయగా 1557 గుండె పోటు కేసులు నమోదయ్యాయి. రాత్రుళ్లు ఏడు గంటలు లేదా అంతకన్నా తక్కువ సమయం నిద్ర పోయే వారి కన్నా తొమ్మిది గంటలు అంతకన్నా ఎక్కువ సేపు నిద్ర పోయేవారికి 25 శాతం వరకు గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుందని పరిశోధకులు వివరించారు. మామూలుగా తగిన విధంగా నిద్ర పోయే వారి కన్నా సుదీర్ఘ సమయం కునికిపాటు లేదా నిద్ర పోయేవారిలో 85 శాతం గుండెపోటు వచ్చే చిక్కు ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు హెచ్చరించారు.