Nellore Temple Viral Video: వీడియో ఇదిగో.. నెల్లూరు శివాలయంలో అద్భుత దృశ్యం.. శివలింగం చుట్టూ మూడు నాగుపాములు ప్రదక్షిణ..
Nellore Temple Viral Video: నెల్లూరు జిల్లా మనుబోలు బీసీ కాలనీ సమీపంలోని శ్రీకాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో సోమవారం ఉదయం ఒక అద్భుత దృశ్యం స్థానిక భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఆలయంలోని శివలింగం చుట్టూ మూడు నాగుపాములు ప్రదక్షిణ చేస్తూ కనిపించడంతో ఆ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. శివలింగాన్ని చుట్టుకుని కొద్దిసేపు పడగవిప్పిన ఆ సర్పాలు.. అనంతరం ఆలయంలోనే ఉన్న పుట్టలోకి సురక్షితంగా వెళ్లిపోయాయి. ఈ అరుదైన దృశ్యాన్ని అక్కడ ఉన్న భక్తులు తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించడంతో ఆ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
ముఖ్యంగా శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన సోమవారం నాడే ఈ సంఘటన జరగడాన్ని భక్తులు శుభ శకునంగా, దైవ సంకేతంగా భావిస్తున్నారు. ఈ వింత దృశ్యం గురించి సమాచారం చుట్టుపక్కల గ్రామాలకు వ్యాపించడంతో, శ్రీకాశీ విశ్వనాథ స్వామిని దర్శించుకోవడానికి సమీప ప్రాంతాల నుండి ప్రజలు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు.
అయితే ఈ ఆలయంలో నాగుపాములు ఇలా దర్శనమివ్వడం ఇది మొదటిసారేమీ కాదని స్థానికులు వెల్లడిస్తున్నారు. గతంలో కూడా అనేక సందర్భాల్లో ఇక్కడ సర్పాలు కనిపించి భక్తులను అలరించాయి. గతేడాది మే 17వ తేదీన స్వామివారికి అభిషేకం పూర్తి పూర్తయిన తర్వాత ఒక నాగుపాము శివలింగంపై పడగవిప్పి కనిపించగా, అదే ఏడాది అక్టోబర్‌లో నాగుల చవితి పర్వదినాన రెండు నాగుపాములు శివలింగం చెంతన ప్రత్యక్షమయ్యాయి. ఇలా తరచూ పవిత్ర దినాల్లో నాగసర్పాలు దర్శనమివ్వడం ఈ క్షేత్ర మహిమకు నిదర్శనమని స్థానిక ప్రజలు నమ్మకంతో చెబుతున్నారు.