Andhra Pradesh Rains: ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఆరు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు..ఉత్తరాంధ్రకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్.. నేడు తీరం దాటనున్న వాయుగుండం..
ఆంధ్రప్రదేశ్‌పై వాయుగుండం ప్రభావం అత్యంత తీవ్రరూపం దాల్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం డీప్ డిప్రెషన్ (తీవ్ర వాయుగుండం)గా బలపడటంతో కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Andhra Pradesh Rains: ఆంధ్రప్రదేశ్‌పై వాయుగుండం ప్రభావం అత్యంత తీవ్రరూపం దాల్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం డీప్ డిప్రెషన్ (తీవ్ర వాయుగుండం)గా బలపడటంతో కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజా IMD బులెటిన్ ప్రకారం ఈ డీప్ డిప్రెషన్ ప్రస్తుతం విశాఖపట్నానికి తూర్పు-ఆగ్నేయంగా సుమారు 220 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా వేగంగా కదులుతూ సెప్టెంబర్ 23 రాత్రికి విశాఖపట్నం – గోపాల్‌పూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
తీర ప్రాంతాల్లో గంటకు 25 నుంచి 30 నాటికల్ మైళ్ల వేగంతో బలమైన గాలులు వీస్తుండగా, కొన్ని సమయాల్లో ఇవి 40 నాట్స్ వరకు పెరుగుతున్నాయి. సముద్రం తీవ్రంగా అల్లకల్లోలంగా మారడంతో కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ పోర్టుల్లో స్థానిక మూడో ప్రమాద హెచ్చరిక (Local Cautionary Signal No. 3) ఎగురవేశారు. మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లవద్దని అధికారులు స్పష్టం చేశారు.
వర్షాల తీవ్రత దృష్ట్యా ముందస్తు జాగ్రత్త చర్యగా ఉత్తరాంధ్రలోని ఆరు జిల్లాలు (శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి) తో పాటు కాకినాడ, కృష్ణా జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు మరియు కళాశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు. లోతట్టు ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లో నివసించే ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు కలెక్టరేట్‌లు, మండల కేంద్రాల్లో అత్యవసర కంట్రోల్ రూమ్‌లను అందుబాటులోకి తెచ్చారు.
వంశధార, నాగావళి నదీ పరివాహక ప్రాంతాల్లో వరద ముప్పు పెరిగే అవకాశం ఉండటంతో ఎగువన ఒడిశాలోని రాయగడ క్యాచ్‌మెంట్ ప్రాంత వర్షపాతాన్ని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. రైల్వే శాఖ సైతం అప్రమత్తమైంది; విశాఖపట్నం – కిరందూల్ మార్గంలో ప్రతికూల వాతావరణం కారణంగా పలు రైళ్ల రాకపోకలపై ప్రభావం పడుతోందని, ప్రయాణికులు ముందస్తు సమాచారం తెలుసుకుని ప్రయాణించాలని రైల్వే అధికారులు తెలిపారు.
గడిచిన 24 గంటల్లో శ్రీకాకుళం జిల్లా పలాసలో అత్యధికంగా 10.07 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా తాళభద్ర, రావివలస, సంతబోమ్మాళి, కోటబోమ్మాళి ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురిసాయి. రానున్న 24 నుంచి 48 గంటలు అత్యంత కీలకం కావడంతో ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని, ఉప్పొంగే వాగులు, కాలువలను దాటే ప్రయత్నం చేయవద్దని యంత్రాంగం హెచ్చరించింది.