Andhra Pradesh Weather: దిశ మార్చుకున్న వాయుగుండం.. ఉత్తరాంధ్రకు తప్పిన భారీ వర్షాల ముప్పు.. కోస్తాంధ్రలో అక్కడక్కడ వర్షాలు.. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరిక..

వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కారణంగా ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసినప్పటికీ.. దాని దిశ అనూహ్యంగా మార్చుకుంది. పశ్చిమ వాయవ్య దిశగా పయనించాల్సిన తీవ్ర వాయుగుండం ఉత్తర దిశగా మళ్లిపోవడంతో సోమవారం కోస్తాంధ్రలో అక్కడక్కడా చిరు జల్లులు మాత్రమే కురిసాయి.

Cyclone

Andhra Pradesh Weather: వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కారణంగా ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసినప్పటికీ.. దాని దిశ అనూహ్యంగా మార్చుకుంది. పశ్చిమ వాయవ్య దిశగా పయనించాల్సిన తీవ్ర వాయుగుండం ఉత్తర దిశగా మళ్లిపోవడంతో సోమవారం కోస్తాంధ్రలో అక్కడక్కడా చిరు జల్లులు మాత్రమే కురిసాయి.

ఉత్తర ఒడిశా–పశ్చిమ బెంగాల్ తీరానికి ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆదివారం వాయుగుండంగా, సోమవారం ఉదయం తీవ్ర వాయుగుండంగా మారింది. ప్రస్తుతం ఇది ఒడిశాలోని బాలసోర్‌కు తూర్పున సుమారు 80 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉత్తర దిశగా కదులుతోంది. మంగళవారం ఉదయం హల్దియా సమీపంలో తీరం దాటి అనంతరం ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ వైపు పయనించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది

తీవ్ర వాయుగుండం ప్రభావంతో మంగళవారం కోస్తాంధ్రలో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. సోమవారం కూడా కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే స్వల్ప వర్షాలు నమోదయ్యాయి. మరోవైపు దక్షిణ కోస్తాలో మాత్రం ఎండల తీవ్రత కొనసాగింది. నెల్లూరు జిల్లా కావలిలో అత్యధికంగా 38.4 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం.. సముద్రం అల్లకల్లోలం.. ఉత్తరాంధ్రకు ముంచుకొస్తున్న పెనుముప్పు.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిక..

తీవ్ర వాయుగుండం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున బుధవారం వరకు ఉత్తర కోస్తా మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. కోసాంధ్రలో కళింగపట్నం నుంచి కాకినాడ వరకు ఉన్న ఓడరేవుల్లో మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక.. మిగిలిన పోర్టుల్లో మొదటి నంబర్ ప్రమాద సూచిక ఎగురవేశారు. మత్స్యకారులు వాతావరణం పూర్తిగా సాధారణ స్థితికి చేరుకునే వరకు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు.

ఈ పరిణామంతో ఇప్పటికే వర్షాభావాన్ని ఎదుర్కొంటున్న రాష్ట్రంలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. వ్యవసాయ శాఖ వివరాల ప్రకారం.. ఈ వర్షాకాలంలో సోమవారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 54 శాతం వర్షపాతం లోటు నమోదైంది. దీంతో పలు జిల్లాల్లో కరువు ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వ్యవసాయ పనులు వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఈ పరిస్థితి తీవ్ర నిరాశ కలిగిస్తోంది.

వాతావరణ నిపుణుల విశ్లేషణ ప్రకారం, ప్రస్తుత పరిస్థితులకు ఎల్‌నినో ప్రభావం ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఎల్‌నినో సంవత్సరాల్లో నైరుతి రుతుపవనాలు బలహీనపడతాయని, అరేబియా సముద్రం నుంచి వచ్చే తేమగాలులు పశ్చిమ కనుమల వరకు మాత్రమే ప్రభావం చూపి, ఆ తర్వాత పొడిగా మారిపోతాయని వారు తెలిపారు. ఈ కారణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలు రెయిన్‌ షాడో ప్రాంతాలుగా మారుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో మేఘాలు కనిపిస్తున్నప్పటికీ, అవి బలంగా అభివృద్ధి చెందకపోవడంతో విస్తృత వర్షాలు కురవడం లేదని వివరించారు.

రాష్ట్రంలో ఇప్పటికే వర్షాల కొరత కారణంగా పంటల సాగు ఆలస్యమవుతోంది. ఇప్పుడు తీవ్ర వాయుగుండం ఉన్నప్పటికీ ఆశించిన వర్షాలు కురవకపోవడంతో రైతుల్లో ఆందోళన మరింత పెరిగింది. రాబోయే రోజుల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారి రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు కురిస్తేనే వ్యవసాయ రంగానికి ఊరట లభించే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement