AP Weather Alert: ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు.. మరోసారి పొంచి ఉన్న తుఫాన్ ముప్పు.. ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన..
భానుడి భగభగలతో అల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) చల్లటి వార్త అందించింది. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, కొన్నిచోట్ల గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది
AP Weather Alert: భానుడి భగభగలతో అల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) చల్లటి వార్త అందించింది. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, కొన్నిచోట్ల గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. అదే సమయంలో రాష్ట్రానికి తుఫాన్ ముప్పు పొంచి ఉందని, దీనివల్ల వచ్చే వారంలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అమరావతి, విశాఖ వాతావరణ కేంద్రాల అధికారులు అంచనా వేస్తున్నారు. నేడు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసాయి.. తిరుపతి జిల్లా, పల్నాడు, గుంటూరు జిల్లాలో వర్షాలు కురిసాయి.
విశాఖ వాతావరణ కేంద్రం తెలిపిన సమాచారం ప్రకారం, అక్టోబర్ 12వ తేదీన మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది తర్వాతి 24 గంటల్లో, అంటే అక్టోబర్ 13 నాటికి అల్పపీడనంగా మారి, క్రమంగా బలపడి తుఫాన్‌గా పరిణమించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రస్తుతం అక్టోబర్ నెల కావడం, సముద్ర ఉపరితల పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో ఇది తుఫాన్‌గా మారే అవకాశం ఎక్కువగా ఉందని, ఈ ప్రభావంతో వచ్చే వారం ఏపీ వ్యాప్తంగా విస్తారంగా భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేశారు. విజయవాడలో వెదర్ అప్‌డేట్.. బుధవారం మధ్యాహ్నం జల్లులు, ఉక్కపోత కొనసాగే అవకాశం
ఇక తక్షణ వాతావరణ పరిస్థితుల విషయానికొస్తే, రాష్ట్రంలో ప్రస్తుత ద్రోణి ప్రభావంతో కృష్ణా, అన్నమయ్య, చిత్తూరు, వైఎస్సార్ కడప, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) వెల్లడించింది. అలాగే ప్రకాశం, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు పడే అవకాశం ఉండటంతో ఆయా జిల్లాలకు 'ఎల్లో అలర్ట్' జారీ చేశారు. వర్షాలతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
పిడుగులు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, చెట్లు, విద్యుత్ స్తంభాలు, ప్రకటనల హోర్డింగ్‌ల కింద నిలబడవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు ఉరుములు ప్రారంభం కాగానే సురక్షిత భవనాల్లోకి వెళ్లాలని కోరింది. సముద్రంలో వేటకెళ్లే మత్స్యకారులు కూడా ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ జారీ చేసే హెచ్చరికలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.