AP Weather Alert: వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు.. మత్స్యకారులకు కీలక హెచ్చరిక జారీ చేసిన APSDMA
పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల వెంబడి సముద్రం తీవ్రంగా అలజడిగా మారే ప్రమాదం ఉంది. కెరటాలు ఎగసిపడటంతో పాటు బలమైన గాలులు వీస్తుండటంతో మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లరాదని విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది
AP Weather Alert: వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సుమారు 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని, అలాగే రుతుపవన ద్రోణి కూడా ఈ వ్యవస్థ మీదుగా పయనిస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం మారింది. దీని ప్రభావంతో రాబోయే 24 నుండి 48 గంటల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుండి కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
అల్పపీడన ప్రభావంతో ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. పలు ప్రాంతాల్లో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో, గరిష్ఠంగా 60 కిలోమీటర్ల వేగంతో ప్రచండ ఈదురుగాలులు వీచే అవకాశముంది. వర్ష సూచన నేపథ్యంలో హోం, విపత్తు నిర్వహణ శాఖల అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. కలెక్టర్లు, క్షేత్రస్థాయి యంత్రాంగం లోతట్టు ప్రాంత ప్రజలను ముందస్తుగా హెచ్చరిస్తూ అప్రమత్తం చేశారు.
పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల వెంబడి సముద్రం తీవ్రంగా అలజడిగా మారే ప్రమాదం ఉంది. కెరటాలు ఎగసిపడటంతో పాటు బలమైన గాలులు వీస్తుండటంతో మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లరాదని విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. వేటకు వెళ్లిన వారు వెంటనే సురక్షిత తీరాలకు చేరుకోవాలని సూచించారు.
పిడుగులు పడే అవకాశం ఉన్నందున వర్షం కురిసే సమయంలో ఎవరూ చెట్ల కింద, హోర్డింగ్‌ల వద్ద లేదా విద్యుత్ స్తంభాల సమీపంలో ఆశ్రయం పొందవద్దు. కాలువలు, వాగులు దాటే ప్రయత్నం చేయకూడదని, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని సూచించారు. ఏవైనా అత్యవసర పరిస్థితులు ఏర్పడితే విపత్తు నిర్వహణ సంస్థ స్టేట్ కంట్రోల్ రూమ్ సహాయం కోసం **1070, 112, 1800-425-0101** నంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు.