Hyderabad-Tirupati Flight Fares: ఒక్క గంట ప్రయాణానికి రూ. 24 వేల టికెట్.. హైదరాబాద్-తిరుపతి ఫ్లైట్ ఛార్జీలు షాక్.. ఒక్కసారిగా పెరగడం వెనుక కారణమిదే..

హైదరాబాద్ నుంచి తిరుమల శ్రీవారి దర్శనం కోసం తిరుపతికి విమానంలో వెళ్లాలనుకుంటున్న భక్తులకు విమానయాన సంస్థలు భారీ షాక్ ఇస్తున్నాయి. కేవలం ఒక గంట ప్రయాణానికి ఏకంగా రూ. 24 వేల వరకు టికెట్ చార్జీలు వసూలు చేస్తూ ప్రయాణికుల జేబులకు భారీ చిల్లులు పెడుతున్నాయి.

Tirumala!(X)

Hyderabad-Tirupati Flight Fares: హైదరాబాద్ నుంచి తిరుమల శ్రీవారి దర్శనం కోసం తిరుపతికి విమానంలో వెళ్లాలనుకుంటున్న భక్తులకు విమానయాన సంస్థలు భారీ షాక్ ఇస్తున్నాయి. కేవలం ఒక గంట ప్రయాణానికి ఏకంగా రూ. 24 వేల వరకు టికెట్ చార్జీలు వసూలు చేస్తూ ప్రయాణికుల జేబులకు భారీ చిల్లులు పెడుతున్నాయి. ప్రస్తుతం ఈ మార్గంలో ఇండిగో, అలయన్స్ ఎయిర్, ఎయిర్ ఇండియా వంటి ప్రముఖ విమానయాన సంస్థలు సర్వీసులను నడుపుతున్నాయి.

అయితే సాధారణ రోజుల్లోనే ఇక్కడ టికెట్ ధర రూ. 5,700 నుంచి రూ. 13,500 వరకు అందుబాటులో ఉంటోంది. ఒకవేళ ప్రయాణికులు చివరి నిమిషంలో అత్యవసరంగా టికెట్లు బుక్ చేసుకోవాల్సి వస్తే ఈ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. హైదరాబాద్ నుంచి భౌగోళికంగా ఎంతో సుదూరంలో ఉన్న ఢిల్లీ, ముంబై వంటి మెట్రో నగరాలకు రూ. 3,500 నుంచి రూ. 7,000 లకే విమాన టికెట్లు లభిస్తున్న తరుణంలో.. అతి తక్కువ దూరం ఉన్న తిరుపతికి మాత్రం ఈ స్థాయిలో అడ్డగోలుగా చార్జీలు వసూలు చేయడంపై సర్వత్రా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మళ్లీ ముంచుకొస్తున్న భారీ వర్షం.. హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత వాన.. తెలంగాణలో 16 జిల్లాలకు ఎల్లో అలర్ట్ .. ప్రజలకు సీపీ సజ్జనార్ కీలక హెచ్చరిక..

ఈ స్థాయిలో విమాన చార్జీలు విపరీతంగా పెరగడం వెనుక తిరుమల తిరుపతి దేవస్థానం అందిస్తున్న శ్రీవాణి వీఐపీ దర్శన కోటా ప్రధాన కారణంగా కనిపిస్తోందని విశ్లేషణలు వస్తున్నాయి. తిరుపతి ఎయిర్‌పోర్టుకు వచ్చే విమాన ప్రయాణికుల సౌకర్యార్థం టీటీడీ అక్కడ ప్రత్యేకంగా ఒక కౌంటర్‌ను ఏర్పాటు చేసి.. ప్రతిరోజూ సుమారు 200 శ్రీవాణి వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లను కేటాయిస్తోంది. విమాన ప్రయాణానికి సంబంధించిన చెల్లుబాటయ్యే బోర్డింగ్ పాస్‌ను చూపిస్తే.. ముందు వచ్చిన వారికి మొదటి ప్రాధాన్యత అనే పద్ధతిలో ఈ దర్శన టికెట్లను జారీ చేస్తున్నారు. ముఖ్యంగా ఉదయం పూట హైదరాబాద్ నుంచి తిరుపతికి చేరుకునే ప్రయాణికులకు ఈ కౌంటర్ ద్వారా శ్రీవాణి టికెట్లు సులభంగా పొందే అవకాశం లభిస్తోంది. ఈ ప్రత్యేక సదుపాయాన్ని ఆసరాగా చేసుకుంటున్న విమానయాన సంస్థలు.. ఉదయం వేళల్లో నడిచే విమాన సర్వీసుల ధరలను ఊహించని రీతిలో పెంచేస్తూ భక్తుల భక్తిని తమ వ్యాపార స్వార్థానికి వాడుకుంటున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ విషయమై భక్తుల నుంచి వరుసగా ఫిర్యాదులు రావడంతో టీటీడీ బోర్డు చైర్మన్ బి.ఆర్. నాయుడు తీవ్రంగా స్పందించారు. విమానయాన సంస్థలు ఈ రీతిలో చార్జీలను విపరీతంగా పెంచడం అస్సలు సరికాదని.. కోట్లాది మంది భక్తుల విశ్వాసాలు, సెంటిమెంట్లతో ముడిపడి ఉన్న ఈ సున్నితమైన విషయంలో వ్యాపార ధోరణిని ప్రదర్శించడం తగదని ఆయన తీవ్ర స్థాయిలో హితవు పలికారు. ఎయిర్‌లైన్స్ సంస్థలు వెంటనే స్పందించి ఈ టికెట్ చార్జీలను తగ్గించకపోతే.. తిరుపతి ఎయిర్‌పోర్టులో కొనసాగుతున్న శ్రీవాణి టికెట్ల ప్రత్యేక కౌంటర్‌ను పూర్తిగా రద్దు చేస్తామని స్పష్టం చేశారు. ఆ కౌంటర్ ద్వారా ఇచ్చే టికెట్ల కోటాను సామాన్య భక్తులకు అందుబాటులో ఉండేలా ఆన్‌లైన్ కరెంట్ బుకింగ్‌కు లేదా అడ్వాన్స్ బుకింగ్‌కు బదిలీ చేయాల్సి వస్తుందని ఆయన విమానయాన సంస్థలను గట్టిగా హెచ్చరించారు.

మరోవైపు తిరుపతి ఎంపీ, ఎయిర్‌పోర్ట్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ ఎం. గురుమూర్తి సైతం ఈ విపరీతమైన ధరల పెరుగుదలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తిరుపతికి వచ్చే భక్తులపై ఈ చార్జీలు మోయలేని భారంగా మారాయని.. విమానయాన సంస్థలు తక్షణమే తమ తీరును మార్చుకుని ధరల తగ్గింపుపై పునరాలోచన చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఏదేమైనా ఆధ్యాత్మిక క్షేత్రానికి వచ్చే భక్తుల అవసరాలను ఆసరాగా చేసుకుని విమాన చార్జీలను నియంత్రణ లేకుండా పెంచేయడం ఏమాత్రం సమర్థనీయం కాదు. టీటీడీ చైర్మన్ హెచ్చరికలు, ప్రజాప్రతినిధుల ఒత్తిడి నేపథ్యంలోనైనా విమానయాన సంస్థలు దిగివచ్చి టికెట్ ధరలను సామాన్యులకు అందుబాటులోకి తెస్తాయో లేదో వేచి చూడాలి.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement