Telangana Weather: బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం..ఆగస్టు 3 వరకు తెలంగాణలో వర్షాలు.. ఐటీ ఉద్యోగులకు కీలక సూచనలు

వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో ఆగస్టు 3 వరకు విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పశ్చిమ బెంగాల్–ఉత్తర ఒడిశా తీర ప్రాంతాలకు ఆనుకుని కేంద్రీకృతమైన ఈ తీవ్ర వాయుగుండం గంటకు సుమారు 3 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదులుతున్నట్లు అధికారులు తెలిపారు.

Hyderabad Rains (photo-ANI)

Telangana Weather: వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో ఆగస్టు 3 వరకు విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పశ్చిమ బెంగాల్–ఉత్తర ఒడిశా తీర ప్రాంతాలకు ఆనుకుని కేంద్రీకృతమైన ఈ తీవ్ర వాయుగుండం గంటకు సుమారు 3 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదులుతున్నట్లు అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో నైరుతి రుతుపవనాలు మరింత చురుగ్గా మారడంతో ఆగస్టు 3 వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.

వాతావరణ శాఖ ప్రకారం.. ముఖ్యంగా ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరంలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతో పోలీసులు ఐటీ కంపెనీలకు ప్రత్యేక సూచనలు జారీ చేశారు. ఉద్యోగులు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కోకుండా వీలైనంత త్వరగా కార్యాలయాల నుంచి లాగ్‌అవుట్ అయ్యేలా అనుమతులు ఇవ్వాలని సంస్థలను కోరారు.

బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం.. సముద్రం అల్లకల్లోలం.. ఉత్తరాంధ్రకు ముంచుకొస్తున్న పెనుముప్పు.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిక..

సోమవారం ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురిశాయి. మంగళవారం ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

గత రెండు రోజులుగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం రైతులకు కొంత ఊరటనిచ్చింది. సంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 7.2 సెం.మీ., కామారెడ్డి జిల్లాలో 6.9 సెం.మీ., వికారాబాద్ జిల్లాలో 6.4 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది ఎల్ నినో ప్రభావంతో తెలంగాణలో సాధారణం కంటే వర్షపాతం గణనీయంగా తగ్గిపోయింది. జూన్, జులై నెలల్లో కలిపి సుమారు 10 సెంటీమీటర్ల వర్షపాతం లోటు నమోదవగా, దాదాపు 26 జిల్లాలు వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు రైతులకు కొంత ఉపశమనం కలిగిస్తున్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని వర్షాలు కురుస్తాయన్న అంచనాలతో రైతులు సాగు పనులను వేగవంతం చేస్తున్నారు.

మరోవైపు, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలోని ప్రాజెక్టులకు వరద జలాలు చేరుతున్నాయి. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు దాదాపు నిండుకుండలను తలపిస్తున్నాయి. సోమవారం నాటికి జూరాల ప్రాజెక్టుకు సుమారు 24 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. అయితే శ్రీశైలం జలాశయానికి కేవలం 163 క్యూసెక్కులు, నాగార్జునసాగర్‌కు 4,070 క్యూసెక్కుల ప్రవాహం మాత్రమే వస్తుండటం గమనార్హం.

అటు మహారాష్ట్రలోని నాసిక్ పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరి నదిపై ఉన్న జైక్వాడి ప్రాజెక్టుకు 63,618 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో చేరుతోంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కొనసాగితే కృష్ణా, గోదావరి బేసిన్‌లలోని ప్రధాన జలాశయాలకు మరింత వరద నీరు చేరే అవకాశం ఉందని జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో వర్షాల తీవ్రత పెరిగే అవకాశమున్నందున ప్రజలు అవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు జారీ చేసే సూచనలను తప్పనిసరిగా పాటించాలని వాతావరణ శాఖ సూచించింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement