Telangana Shocker: తెలంగాణలో దారుణం, ప్రేమకోసం మతం మార్చుకున్నాడు, అయినా పెళ్లికి ఒప్పుకోలేదని లవర్ గొంతు కోసిన ప్రియుడు
పెళ్లికి అంగీకరించడం లేదని ఓ యువకుడు ప్రేయసి గొంతు కోసి (Stalker slits throat of Woman) తీవ్రంగా గాయపరిచాడు.
Hyd, Jan 4: తెలంగాణలోని హనుమకొండ జిల్లా కాజీపేటలో దారుణం చోటుచేసుకున్నది. పెళ్లికి అంగీకరించడం లేదని ఓ యువకుడు ప్రేయసి గొంతు కోసి (Stalker slits throat of Woman) తీవ్రంగా గాయపరిచాడు. స్థానికులు,మడికొండ పోలీస్ ఇన్‌స్పెక్టర్ గుజ్జేటి వేణు కథనం ప్రకారం..కాజీపేట మండలం కపిడికొండకు చెందిన శ్రీనివాస్ అదే గ్రామానికి చెందిన ఓ యువతి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.
ఆమెది వేరే మతం కావడంతో అతడు మతం మార్చుకున్నాడు. అయితే వీరి పెండ్లికి అమ్మాయి కుటుంబ సభ్యులు నిరాకరించారు. దీంతో ఆమె కూడా వివాహానికి ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఇదే విషయంపై శ్రీనివాస్ మంగళవారం రాత్రి యువతి ఇంటికి వెళ్లి నిలదీశాడు. అంగీకరించకపోవడంతో యువతి గొంతు, చేయి కోసి గాయపరిచాడు. అడ్డుకున్న ఆమె కుటుంబ సభ్యులపై కూడా దాడిచేశాడు. ఆగ్రహించిన ఆమె కుటుంబసభ్యులు అతడిని చితకబాదారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. తీవ్రంగా గాయపడిన యువతిని వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికు తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.ఆమెకు ప్రాణాపాయం లేదని, విచారణ చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ వివరించారు.