Telegram: యాప్ స్టోర్ నుండి టెలిగ్రామ్ తాత్కాలిక తొలగింపు.. ఆపిల్ నిర్ణయం వెనుక ఉగ్రవాద అభియోగాల కలకలం..
ఆపిల్ సంస్థ మంగళవారం (ఆగస్టు 4, 2026) నాడు ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలోని తమ iOS యాప్ స్టోర్ నుండి ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ ను కొద్దిసేపు తొలగించడం తీవ్ర కలకలం రేపింది. సోమవారం తెల్లవారుజాము నుండే iOS స్టోర్‌లో టెలిగ్రామ్‌కు సంబంధించిన కొత్త డౌన్‌లోడ్‌లు, అప్‌డేట్‌లను ఆపిల్ నిరోధించింది
ఆపిల్ సంస్థ మంగళవారం (ఆగస్టు 4, 2026) నాడు ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలోని తమ iOS యాప్ స్టోర్ నుండి ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ ను కొద్దిసేపు తొలగించడం తీవ్ర కలకలం రేపింది. సోమవారం తెల్లవారుజాము నుండే iOS స్టోర్‌లో టెలిగ్రామ్‌కు సంబంధించిన కొత్త డౌన్‌లోడ్‌లు, అప్‌డేట్‌లను ఆపిల్ నిరోధించింది. అయితే అప్పటికే వినియోగదారుల ఫోన్లలో ఇన్‌స్టాల్ అయి ఉన్న యాప్ యథావిధిగా పనిచేసినప్పటికీ.. కొద్దిసేపటికే సదరు మెసేజింగ్ యాప్ తిరిగి ఆపిల్ యాప్ స్టోర్‌లో ప్రత్యక్షమైంది.
ఈ ఆకస్మిక తొలగింపుకు గల స్పష్టమైన కారణాలను ఆపిల్ సంస్థ ఇప్పటివరకు అధికారికంగా వెల్లడించలేదు. అలాగే, ఈ పరిణామంపై టెలిగ్రామ్ యాజమాన్యం కూడా ఎలాంటి ప్రకటన విడుదల చేయకపోవడం గమనార్హం. గతంలో 2018లో కూడా అనుచిత కంటెంట్ కారణాల దృష్ట్యా యాప్ స్టోర్ నుండి టెలిగ్రామ్‌ను ఆపిల్ తాత్కాలికంగా తొలగించిన సంగతి తెలిసిందే.
టెలిగ్రామ్ సీఈఓ పావెల్ డురోవ్‌ను ఇటీవల అంతర్జాతీయంగా కావాల్సిన నేరస్థుల జాబితాలో చేర్చడం, అలాగే ఉగ్రవాదానికి సహాయ సహకారాలు, ప్రోత్సాహం అందించారనే తీవ్రమైన అభియోగాలు మోపడం జరిగిన కొద్ది రోజులకే ఈ ఘటన చోటుచేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది
ఈ పరిణామాల వెనుక రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ (FSB) చేసిన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. రష్యాలో ఉగ్రవాద దాడులు, సామూహిక హత్యలు ప్లాన్ చేయడానికి ఉక్రేనియన్ భద్రతా సంస్థలు టెలిగ్రామ్‌లోని ఛానెళ్లు, చాట్‌లు మరియు బాట్‌లను విస్తృతంగా ఉపయోగిస్తున్నాయని FSB ఆరోపించింది.
ఏజెన్సీ వెల్లడించిన కథనం ప్రకారం.. ఉక్రేనియన్ ఆపరేటివ్‌లు టెలిగ్రామ్ ప్లాట్‌ఫారమ్‌పై యువతులుగా నకిలీ ప్రొఫైళ్లు క్రియేట్ చేసి, యువకులను మోసగించి దాడులకు పురికొల్పుతున్నారు. జూలై 2025 నుండి ఇప్పటివరకు ఈ సేవలతో సంబంధమున్న 46 మంది వినియోగదారులను 16 రష్యన్ ప్రాంతాలలో అదుపులోకి తీసుకున్నట్లు FSB పేర్కొంది. వీరిపై ప్రభుత్వ ఆస్తులకు నిప్పు పెట్టడం నుండి పోలీసు అధికారులపై దాడుల వరకు అనేక తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయి. అయితే, రష్యా ఏజెన్సీ పేర్కొన్న ఈ సంఖ్యలకు సంబంధించి ఎలాంటి స్వతంత్ర ధృవీకరణ లభించలేదు.