Indian IT Rules 2021: సోషల్ మీడియా, డిజిటల్ మీడియా దుర్వినియోగం జరుగుతోంది, సాధారణ యూజర్ల సాధికారత కోసమే నూతన ఐటీ చట్టాల రూపకల్పన.. ఐక్యరాజ్య సమితికి స్పష్టం చేసిన భారత్
భారత ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ఐటీ నిబంధనలు, డిజిటల్ మీడియా నైతిక నియమావళికి సంబంధించి రూపొందించిన మార్గదర్శకాలపై ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి ప్రత్యేక విధాన విభాగం వ్యక్తం చేసిన ఆందోళనలపై భారత్ స్పందించింది....
New Delhi, June 21: భారత ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ఐటీ నిబంధనలు, డిజిటల్ మీడియా నైతిక నియమావళికి సంబంధించి రూపొందించిన మార్గదర్శకాలపై ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి ప్రత్యేక విధాన విభాగం వ్యక్తం చేసిన ఆందోళనలపై భారత్ స్పందించింది.
సోషల్ మీడియాను వినియోగించే సాధారణ యూజర్ల సాధికారత కోసమే కొత్త నిబంధనలు రూపొందించామని స్పష్టం చేసింది.
ఇందుకు సంబంధించిన ముసాయిదా నిబంధనల రూపకల్పన కోసం కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ 2018 నుంచి విస్తృత స్థాయిలో అనేక సంప్రదింపులు నిర్వహించినట్టు తెలిపింది.
నిబంధనలను తయారు చేసే ముందు నిపుణులు, పౌర సమాజ ప్రతినిధులు, పారిశ్రమల, పారిశ్రామిక సంస్థల ప్రతినిధులతో సహా పలువురు భాగస్వామ్య వర్గాలతో చర్చలతో పాటు ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేపట్టాము. భావప్రకటన, వాక్ స్వాతంత్య్ర స్వేచ్ఛా హక్కుల పరిరక్షణ, శాంతియుతంగా సమావేశమయ్యే హక్కులు, వ్యక్తిగత రహహ్యాల హక్కు వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్నాము. వివిధ వర్గాలనుంచి అందిన అభిప్రాయాలు, వ్యాఖ్యలపై విపులంగా చర్చించిన మీదటే తుది నిబంధనలు ఖరారయ్యాయని ఐక్యరాజ్యసమితి కార్యాలయానికి, జెనీవాలోని ఇతర అంతర్జాతీయ సంస్థలకు అనుబంధించిన భారతీయ పర్మనెంట్ మిషన్ తన ప్రతిస్పందను వ్యక్తం చేసింది.
భారతీయ ప్రజాస్వామ్య సంప్రదాయాలకు, విలువలకు ఎంతో గుర్తింపు ఉందని ఈ సందర్భంగా ఐరాసకు భారత్ గుర్తుచేసింది.
భావ ప్రకటన స్వేచ్ఛ హక్కులకు భారత రాజ్యాంగం పూచీ కల్పిస్తోంది. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయవ్యవస్థ, పటిష్టమైన సమాచార సాధనాల వ్యవస్థ భారతీయ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక భాగాలే అని తెలిపింది.
సామాజిక, డిజిటల్ మాధ్యమ వేదికల దుర్వినియోగం జరుగుతున్న ఉదంతాలు పెరిగిన కారణంగా విస్తృత స్థాయిలో వెలువడిన ఆందోళనల నేపథ్యంలో కొత్త ఐటి నిబంధనలకు రూపకల్పన చేయాల్సి వచ్చింది. ఉగ్రవాదుల నియామకాన్ని ప్రేరేపించడం, అసభ్యకరమైన అంశాల వ్యాప్తి, సామరస్యాన్ని దెబ్బతీసే అంశాలను ప్రచారం చేయడం, ఆర్థిక అవతకలకు పాల్పడటం, హింసను రెచ్చగొట్టడం, శాంతి భద్రతలను దెబ్బతీయడం, బాలలపై నీలి చిత్రాల చిత్రీకరణ, ఆన్ లైన్ వేదికలపై ఈ అంశాలను, ఇతరత్రా సమాచారాన్ని ప్రచారం చేయడం వంటి వాటికి సామాజిక మాధ్యమాలు దుర్వినియోగం అవుతున్న సంఘటనలు పెరిగిన నేపథ్యంలో ఈ కొత్త నిబంధనలు ఏర్పాటు చేయాల్సిన అగత్యం ఏర్పడిందని భారత్ పేర్కొంది.
సామాజిక మాధ్యమాల వేదికలు భారతీయ చట్టాల కింద జవాబు దారీగా వ్యవహరించేలా చూసేందుకు, న్యాయ వ్యవస్థను మరింత పటిష్టపరచాలని భారత సుప్రీంకోర్టు, పార్లమెంట్ పలు సందర్భాల్లో వ్యక్తం చేసిన తీర్పులు, తీర్మానాల మేరకే కొత్త ఐటీ నిబంధనలు 2021కు రూపకల్పన చేసినట్లు ఐరాసకు రాసిన లేఖలో భారత్ స్పష్టం చేసింది.
భారత్ ఈ ఏడాది మార్చి 26న జారీ చేసిన మధ్యంతర ఐటీ నిబంధనలు, డిజిటల్ మీడియా నైతిక నియమావళి 2021, మానవ హక్కులకు సంబంధించిన మార్గదర్శకాలను పాటించలేదని ఐరాస అభిప్రాయపడింది. కొత్త ఐటీ నిబంధనలపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఐరాస మానవ హక్కుల మండలికి చెందిన ప్రతినిధుల బృందం జూన్ 11న కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. దీనికి భారత్ పైన చెప్పిన విధంగా స్పందిస్తూ జవాబు ఇచ్చింది.