Measles Surge in US: అమెరికాలో మీజిల్స్ కల్లోలం.. 1991 తర్వాత ఇదే అత్యంత దారుణంగా పరిస్థితి.. ఒక్క పెన్సిల్వేనియాలో 1,000 దాటిన కేసులు..
అగ్రరాజ్యం అమెరికాలో మీజిల్స్ (తట్టు) వ్యాధి తీవ్రరూపం దాలుస్తుండటంతో తీవ్ర ఆందోళనకర వాతావరణం నెలకొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కేసులు వేగంగా పెరుగుతుండటంతో యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) అప్రమత్తమైంది
Measles Surge in US: అగ్రరాజ్యం అమెరికాలో మీజిల్స్ (తట్టు) వ్యాధి తీవ్రరూపం దాలుస్తుండటంతో తీవ్ర ఆందోళనకర వాతావరణం నెలకొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కేసులు వేగంగా పెరుగుతుండటంతో యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) అప్రమత్తమైంది. తాజా నివేదికల ప్రకారం ఈ ఏడాది ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 3,869 కేసులు నమోదయ్యాయి. 1990-91 నాటి పరిస్థితుల తర్వాత.. అంటే దాదాపు మూడు దశాబ్దాల కాలంలో అమెరికాలో మీజిల్స్ ఈ స్థాయిలో విజృంభించడం ఇదే మొదటిసారి కావడం తీవ్ర కలకలం రేపుతోంది. రష్యా యాంటీ ప్లేగు ల్యాబ్‌లో పరిశోధకురాలి అనుమానాస్పద మృతి..దాదాపు 200 మంది క్వారంటైన్.. ప్రజలు ఆందోళన చెందవద్దని ఆరోగ్యశాఖ సూచన
ఈ ఏడాది ఏప్రిల్‌లో పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియా నగరంలో ఈ వ్యాధి తొలిసారిగా వెలుగుచూసింది. ఆ తర్వాత వేగంగా విస్తరిస్తూ ఒక్క పెన్సిల్వేనియా రాష్ట్రంలోనే ఇప్పటివరకు వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి. పెన్సిల్వేనియాకు సరిహద్దుగా ఉన్న న్యూయార్క్ రాష్ట్రంలో కూడా కేసులు వంద దాటడంతో అక్కడి ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యగా రాష్ట్రవ్యాప్తంగా ‘డిజాస్టర్ ఎమర్జెన్సీ’ ప్రకటించింది. వ్యాధి సంక్రమణను అరికట్టేందుకు విస్తృత స్థాయిలో ఆంక్షలు అమలు చేస్తూ, గుర్తింపు , టీకా పంపిణీ కార్యక్రమాలను ముమ్మరం చేశారు. పెన్సిల్వేనియా, న్యూయార్క్‌లతో పాటు టెక్సాస్, సౌత్ కరోలినా, ఉతా వంటి ఇతర ప్రధాన రాష్ట్రాల్లోనూ ఈ కేసులు నమోదు అవుతున్నాయి.
వ్యాధి బారిన పడిన వారిలో అత్యధికులు మీజిల్స్ నివారణ టీకా (ఎంఎంఆర్ వ్యాక్సిన్) తీసుకోని వారేనని వైద్య వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రధానంగా చిన్నపిల్లలపై ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఇది గాలి ద్వారా అతివేగంగా వ్యాపించే అంటువ్యాధి కావడం వల్ల ముప్పు మరింత ఎక్కువగా ఉంది. ఈ వ్యాధి సోకిన వారిలో తీవ్రమైన జ్వరం, దగ్గు, కళ్ళు ఎర్రబడటం , శరీరంపై ఎర్రటి దద్దుర్లు రావడం వంటి ప్రాథమిక లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి వ్యాప్తిని అరికట్టడానికి సకాలంలో వ్యాక్సినేషన్ చేయించుకోవడమే ఏకైక సురక్షిత మార్గమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.