
Congo, FEB 27: డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (DRC)లో వింత వ్యాధి బెంబేలిత్తిస్తోంది. వాయువ్య కాంగోలో వింత వ్యాధిని గుర్తించారు. ఈ వ్యాధితో ఇప్పటివరకు 50 మందికి పైగా మరణించారు. రోజురోజుకీ ఈ మిస్టరీ డిసీజ్ బారిన పడి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికే డజన్ల కొద్దీ మరణాలకు కారణమైన ఈ వింత వ్యాధి (Mystery Illness) వ్యాప్తిపై యూకే అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. వాయువ్య కాంగోలో గత ఐదు వారాలలో ఇప్పటివరకు 419 కేసులు నమోదు కాగా 53 మరణాలు నమోదయ్యాయి. ఈ వ్యాధి బారిన పడిన వారిలో లక్షణాలు (Mystery Illness) ప్రారంభమైన రెండు రోజుల్లోనే మరణాలు సంభవించాయి.
లక్షణాలివే :
ఈ వింత వ్యాధి సోకినవారిలో జ్వరం, వాంతులు, అంతర్గత రక్తస్రావం వంటి లక్షణాలు మొదట్లో కనిపిస్తాయి. లక్షణాలు కనిపించిన 48 గంటల్లోనే బాధితులు మరణిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ వ్యాధి లక్షణాలు మొదట గబ్బిలాలు తిన్న ముగ్గురు పిల్లలలో కనిపించాయి. ఆ తరువాత కేసులు వేగంగా పెరుగుతున్నాయి.
వింత వ్యాధి ఏంటి? :
ఈ వ్యాధి సోకినవారిలో అంతర్గత రక్తస్రావానికి దారితీస్తుంది. హెమరేజిక్ జ్వరం, ఎబోలా, డెంగ్యూ, ఎల్లో ఫీవర్ వంటి వైరస్‌ల వల్ల సంభవించవచ్చు. కానీ, ఇప్పటివరకు శాంపిల్స్ పరిశీలించిన ఆరోగ్య నిపుణులు ఈ మిస్టరీ డిసీజ్‌కు ఈ వ్యాధులతో ఎలాంటి సంబంధం లేదని కనుగొన్నారు. డబ్ల్యూహెచ్ఓ ఇప్పుడు మలేరియా, వైరల్ హెమరేజిక్ ఫీవర్, టైఫాయిడ్, మెనింజైటిస్, ఫుడ్ పాయిజనింగ్ వంటి ఇతర కారణాలను పరిశీలిస్తోంది.
50 మందికి పైగా మృతి :
ఈ వింత వ్యాధి కారణంగా చాలా మంది మరణించారు. ఈ వ్యాధి జనవరి 21న డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో వెలుగుచూసింది. ఆ తర్వాత ఇప్పటివరకు 400కి పైగా కేసులు నమోదయ్యాయి. అక్కడ 50కి పైగా మరణాలు సంభవించాయి.
డబ్ల్యూహెచ్ఓ (WHO) ఏం చెబుతుందంటే? :
ఈ వింత వ్యాధి గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆఫ్రికా కార్యాలయం ప్రకారం.. బోలోకో గ్రామంలో ముగ్గురు పిల్లలు గబ్బిలాలు తిన్నప్పుడు ఈ వ్యాధి ప్రారంభమైంది. అనారోగ్యంతో మరణించిన పిల్లలు గబ్బిలాన్ని తిన్నారనే నివేదికలను వైద్యబృందం పరిశీలిస్తోంది. ఎందుకంటే ఇదో జూనోటిక్ వ్యాధి. అంటే.. జంతువుల నుంచి మానవులకు వ్యాపించే వ్యాధిగా చెప్పవచ్చు. అంతకుముందు, కాంగోలోని మరో ప్రాంతంలో ఒక వింత వ్యాధితో చాలా మంది మరణించారు.
ఈ వ్యాధి పోషకాహారం లోపంతో పాటు మలేరియా కారణంగానే అంటున్నారు. 400 మందికి పైగా ఈ వ్యాధితో బాధపడుతున్నారు. ఇప్పటికే 79 మంది మరణించారు. 14 ఏళ్ల కన్నా తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో చాలా కేసులు, మరణాలు నమోదయ్యాయి.