
New Delhi, Feb 19: బీజేపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన శాసనసభాపక్షం సమావేశంలో ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రిగా రేఖా గుప్తాను బీజేపీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సీఎల్పీ లీడర్‌గా ఆమెను ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. ఆమె (Rekha Gupta) గురువారం మధ్యాహ్నం 12.35 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపొందిన విషయం తెలిసిందే.
70 అసెంబ్లీ స్థానాల్లో 48 చోట్ల బీజేపీ విజయం సాధించింది. ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 22 స్థానాలకే పరిమితమైంది. ఆప్ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సైతం ఓడిపోయారు. దశాబ్ద కాలంగా న్యూఢిల్లీకి ప్రాతినిధ్యం వహించిన కేజ్రీవాల్, బిజెపికి చెందిన పర్వేష్ వర్మ చేతిలో 4,089 ఓట్ల తేడాతో ఓడిపోయారు. దాదాపు చాలా సంవత్సరాల తరువాత ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చింది.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా పలువురి పేర్లు వినిపించినప్పటికీ సామాజిక సమీకరణల మధ్య బినోయ్ సామాజిక వర్గానికి చెందిన రేఖ గుప్తాను బీజేపీ పెద్దలు సీఎంగా ప్రకటించారు. రేఖాగుప్తా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో షాలిమార్ బాగ్ అసెంబ్లీ స్థానం గెలుపొందారు. రేఖాగుప్తా ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలిసారే ముఖ్యమంత్రిగా బాధ్యతలు (First-Time BJP MLA Set To Become New Delhi CM) స్వీకరించబోతున్నారు.
రేఖా గుప్తా ఎవరు ? Who Is Rekha Gupta?
భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రిగా రేఖ గుప్తాను ప్రకటించింది, ఇది 27 సంవత్సరాల తర్వాత రాజధానిలో పార్టీ తిరిగి అధికారంలోకి రావడాన్ని సూచిస్తుంది. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన షాలిమార్ బాగ్ నియోజకవర్గంలో ఆప్ అభ్యర్థి బందన కుమారిని 29,595 ఓట్ల తేడాతో ఓడించి, ఆ ప్రాంతంలో ఆప్ దశాబ్ద కాలంగా ఉన్న ఆధిపత్యాన్ని ముగించారు.షాలీమార్ బాగ్ నియోజకవర్గం నుంచి 2015, 2020 ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి.. ఆప్‌కు చెందిన బందనాకుమారి చేతిలో పరాజయం పాలయ్యారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో బందనకుమారిని 29వేల ఓట్లకుపైగా తేడా ఓడించి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు.
హర్యానాలోని జింద్ జిల్లా నంద్‌గఢ్ గ్రామంలో 1974లో జన్మించిన రేఖ గుప్తా 1976లో తన కుటుంబంతో కలిసి ఢిల్లీకి మకాం మార్చారు. ఆమె తండ్రి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అధికారి. ఆమె ఢిల్లీలో విద్యను అభ్యసించి 1992లో ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని దౌలత్ రామ్ కళాశాలలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP)లో తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. గుప్తా దౌలత్ రామ్ కళాశాల నుండి పట్టభద్రురాలయ్యారు. 1996-97 సెషన్‌లో DUSU అధ్యక్షురాలిగా పనిచేశారు.ఆమె గతంలో ఢిల్లీ మేయర్‌గా పోటీ చేశారు.
ఆమె 1996-97లో ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ (DUSU) అధ్యక్షురాలిగా, తరువాత 2007లో నార్త్ పితంపురా నుండి కౌన్సిలర్‌గా పనిచేశారు. మహిళా సంక్షేమం మరియు శిశు అభివృద్ధి కమిటీ చైర్‌పర్సన్‌గా, ఆర్థికంగా బలహీనంగా ఉన్న మహిళా విద్యార్థులకు మద్దతు ఇవ్వడానికి సుమేధ యోజన వంటి కార్యక్రమాలను ప్రారంభించారు. ఆమె BJP మహిళా మోర్చాలో కూడా కీలక పదవులను నిర్వహించారు. ఆమె భర్త పేరు మనీష్ గుప్తా.
రేఖ గుప్తాపై ఎటువంటి క్రిమినల్ కేసులు లేవు. ఆమె మొత్తం ఆస్తులు 5.3 కోట్ల రూపాయలు, 2.7 కోట్ల రూపాయల చరాస్తులు. 2.6 కోట్ల రూపాయల స్థిరాస్తులు ఉన్నాయి. అయితే, ఆమెకు 1.2 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి.రేఖా గుప్తా ప్రస్తుతం ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా, బీజేపీ మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలిగా సేవలందిస్తున్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకార కార్యక్రమం ఫిబ్రవరి 20, 2025న రాంలీలా మైదానంలో జరగనుంది. ఈ కార్యక్రమంలో కొత్త మంత్రివర్గం కూడా పాల్గొంటుంది, లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె. సక్సేనా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, ఇతర సీనియర్ నాయకులు సహా బిజెపి కేంద్ర నాయకత్వం ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.