Delhi, Aug 18: మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చింది బీజేపీ. రెండు సార్లు బీజేపీకి వార్ వన్ సైడ్ అనేలా ప్రజలు తీర్పు ఇవ్వగా గత ఎన్నికల్లో మాత్రం సంకీర్ణ పార్టీల భాగస్వామ్యంతో మోడీ 3.0 ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈసారి బీజేపీ మెంబర్ షిప్ డ్రైవ్ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో పార్టీ సీనియర్ నేతలతో సమావేశమమైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా...మెంబర్ షిప్ డ్రైవ్‌పై కీలక సూచనలు చేశారు.
రాష్ట్రాల వారీగా ఇంఛార్జీలను నియమించారు. తెలంగాణ, ఏపీ బీజేపీ సభ్యత్వ నమోదు ఇంఛార్జీగా అరవింద్ మీనన్‌ని నియమించగా ఏపీ పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరికి తమిళనాడు, కేరళ, పుదుచ్ఛేరి బాధ్యతలు అప్పగించారు. సెప్టెంబరు 1 నుండి బీజేపీ సభ్యత్వ నమోదు ప్రారంభం కానుంది. బీజేపీ పార్టీ సిద్ధాంతాలను ప్రతి మూలకు తీసుకెళ్లాలని అమిత్ షా నేతలకు పిలుపునిచ్చారు.
బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే కాదు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సభ్యత్వ నమోదు ఎక్కువగా ఉండేలా చూడాలన్నారు. ప్రజలు కాంగ్రెస్‌ను తిరస్కరిస్తూనే ఉన్నారని రానున్న రోజుల్లో బీజేపీని మరింత బలోపేతం చేయాలన్నారు. 20 కోట్ల మందిని బీజేపీ సభ్యులుగా చేర్చాలన్నారు షా.
1984 లో గెలిచిన కేవలం రెండు లోక్‌సభ స్థానాల్లో గెలిచిన బీజేపీ ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిందని తెలిపారు షా. నాలుగు విధానాల ద్వారా బీజేపీలో సభ్యులుగా చేరవచ్చు అన్నారు. మొబైల్ నంబర్‌కు కాల్ చేయడం, క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయడం, నమో యాప్,బీజేపీ వెబ్‌సైట్ ద్వారా బీజేపీ మెంబర్ షిప్‌ను తీసుకోవాలన్నారు. రంగంలోకి దిగనున్న కేసీఆర్, పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి, త్వరలో కీలక నేతలతో పలు రాష్ట్రాల టూర్!
రాజస్థాన్, మధ్యప్రదేశ్, గోవా, డామన్ డయ్యూ మరియు దాద్రా నగర్ హవేలీలకు బిజెపి సీనియర్ నాయకుడు వినోద్ తావ్డే సభ్యత్వ ప్రచార ఇన్‌ఛార్జ్‌గా నియమితులయ్యారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ గౌతమ్ పశ్చిమ బెంగాల్, సిక్కిం, త్రిపుర, ఒడిశాలకు ఇన్‌ఛార్జ్‌గా నియమితులయ్యారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు రేఖా వర్మ ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, లడఖ్ మరియు చండీగఢ్‌లలో ,రితురాజ్ సిన్హాకు ఉత్తరప్రదేశ్, గుజరాత్‌లకు ,ఘజియాబాద్ ఎంపీ అతుల్ గార్గ్‌కు ఉత్తరాఖండ్, బీహార్‌లకు ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తారు.
సభ్యత్వ నమోదు పూర్తయిన తర్వాత సంస్దాగత ఎన్నికలు, గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. 2025 జనవరిలో బీజేపీకి కొత్త జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునే అవకాశం ఉంది. ప్రస్తుత అధ్యక్షుడు JP నడ్డా పదవీకాలం ఇప్పటికే ముగియగా అప్పటివరకు ఆయన్నే అధ్యక్షుడిగా కొనసాగనున్నారు.