Trump 100% Pharma Tariff: భారత ఫార్మా కంపెనీలకు గుడ్‌న్యూస్.. కొన్ని స్పెషాలిటీ మందులకు 100% అమెరికా టారిఫ్ నుంచి మినహాయింపు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కొన్ని పేటెంట్ పొందిన ఔషధాలపై 100 శాతం సుంకాలను అమలు చేస్తున్న వేళ, భారత ఫార్మా రంగానికి కీలక ఊరట లభించింది.
Trump 100% Pharma Tariff: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కొన్ని పేటెంట్ పొందిన ఔషధాలపై 100 శాతం సుంకాలను అమలు చేస్తున్న వేళ, భారత ఫార్మా రంగానికి కీలక ఊరట లభించింది. భారత్‌తో పాటు మరో 19 దేశాలు, ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకునే కొన్ని ప్రత్యేక ఔషధాలు, వాటికి సంబంధించిన ముడి పదార్థాలపై అమెరికా సున్నా శాతం అదనపు సుంకాన్ని వర్తింపజేయనుంది. అమెరికా వాణిజ్య శాఖకు చెందిన బ్యూరో ఆఫ్ ఇండస్ట్రీ అండ్ సెక్యూరిటీ (BIS) ఈ మేరకు ఫెడరల్ రిజిస్టర్‌లో నోటీసు జారీ చేసింది.
ఈ మినహాయింపు అన్ని రకాల మందులకు వర్తించదు. అరుదైన వ్యాధుల చికిత్సకు ఉపయోగించే ప్రత్యేక ఔషధాలు, కొన్ని న్యూక్లియర్ మెడిసిన్స్, ప్లాస్మా ఆధారిత చికిత్సలు, ఫెర్టిలిటీ మందులు, సెల్ థెరపీ, జన్యు చికిత్స, యాంటీబాడీ-డ్రగ్ కంజుగేట్స్ (ADCs), కొన్ని వైద్య అత్యవసర చికిత్సా ఉత్పత్తులు , పశువైద్య ఔషధాలు ఈ సున్నా శాతం సుంకం కేటగిరీలోకి వస్తాయి. వీటికి సంబంధించిన అర్హత కలిగిన పదార్థాలు, భాగాలకు కూడా ఈ రేటు వర్తిస్తుంది. అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్.. డూమ్స్‌డే వార్ వచ్చినా వెనక్కి తగ్గం.. దౌత్యానికి తలుపులు తెరిచే ఉంటాయని కీలక ప్రకటన..
భారత్‌తో పాటు అర్జెంటీనా, బంగ్లాదేశ్, కంబోడియా, ఈక్వెడార్, ఎల్ సాల్వడార్, యూరోపియన్ యూనియన్, గ్వాటెమాలా, ఇండోనేషియా, జపాన్, జోర్డాన్, మలేషియా, నార్త్ మాసిడోనియా, దక్షిణ కొరియా, స్విట్జర్లాండ్, లీచెన్‌స్టెయిన్, తైవాన్, థాయ్‌లాండ్, యునైటెడ్ కింగ్‌డమ్ , వియత్నాం ఈ జాబితాలో ఉన్నాయి. అమెరికాతో ప్రస్తుత లేదా భవిష్యత్ వాణిజ్య, భద్రతా ఫ్రేమ్‌వర్క్ ఒప్పందాలు ఉన్న దేశాల నుంచి వచ్చే అర్హత కలిగిన ఉత్పత్తులకు సున్నా శాతం సుంకం వర్తించే అవకాశం ఉందని నోటీసులో పేర్కొన్నారు.
అమెరికా ప్రభుత్వం దేశీయంగా ఔషధాల తయారీని పెంచే లక్ష్యంతో ఈ సుంకాల విధానాన్ని తీసుకొచ్చింది. ఏప్రిల్ 2, 2026న పేటెంట్ పొందిన ఫార్మాస్యూటికల్స్, బయోలాజిక్స్ , వాటికి సంబంధించిన కొన్ని ఔషధ పదార్థాల దిగుమతులపై Section 232 కింద చర్యలకు సంబంధించిన ప్రకటన వెలువడింది. ఆ ప్రకటన ప్రకారం నిర్దిష్ట ఉత్పత్తులపై 100 శాతం అదనపు సుంకం విధించే నిబంధనను అమల్లోకి తెచ్చారు. ఈ సుంకం కొన్ని కంపెనీలకు జూలై 31 నుంచే అమల్లోకి రాగా, ఇతర కవరైన కంపెనీలకు సెప్టెంబర్ 29, 2026 నుంచి వర్తించేలా నిబంధనలు ఉన్నాయి.
అమెరికా వాణిజ్య శాఖ నోటీసు ప్రకారం జెనరిక్ ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులు, వాటికి సంబంధించిన పదార్థాలు ప్రస్తుతం Section 232 ఫార్మా సుంకాల పరిధిలో లేవు. అంటే భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే ప్రతి మందుపైనా 100 శాతం సుంకం పడటం లేదు. ఈ సుంకాల ప్రధాన ప్రభావం నిర్దిష్ట పేటెంట్ పొందిన ఔషధాలు, బయోలాజిక్స్ , వాటి ముడి పదార్థాలపైనే ఉంటుంది. మొత్తంగా చూస్తే, ఒకవైపు కొన్ని పేటెంట్ పొందిన మందులపై 100 శాతం సుంకం వర్తిస్తున్నప్పటికీ, ప్రత్యేక చికిత్సలకు 0 శాతం మినహాయింపు లభించడం , జెనరిక్ మందులు ఈ పరిధి వెలుపల ఉండటం భారత ఔషధ రంగానికి పెద్ద ఊరటగా నిలిచింది.