2024 Bajaj Pulsar NS 125: బజాజ్ పల్సర్ 125cc బైక్‌కు అప్‌డేటెడ్ వెర్షన్ వచ్చేసింది, 2024 మోడల్ పల్సర్ మోటార్ సైకిల్‌లో ఏమేం మారాయి, ఈ బైక్ మైలేజ్ ఎంత ఇస్తుంది.. ధర ఎంత? ఇక్కడ తెలుసుకోండి!
Bajaj Pulsar NS 125 Bike: దేశీయ ఆటోమొబైల్ సంస్థ బజాజ్, తమ పల్సర్ ద్విచక్రవాహనాన్ని నవీకరించే ప్రక్రియలో ఉంది. ఇప్పటికే పల్సర్ NS200 మరియు NS160లలో సరికొత్త వెర్షన్ లను విడుదల చేయగా, తాజాగా పల్సర్ NS125 మోడల్‌ను కూడా అప్‌డేట్ చేసి సరికొత్తగా విడుదల చేసింది. 125 సిసి సామర్థ్యం కలిగిన 2024 బజాజ్ పల్సర్ NS125 బైక్ ఇప్పుడు సరికొత్త హంగులు, స్టైలింగ్‌తో ముస్తాబై మార్కెట్లో విడుదలైంది. పాత మోడల్‌తో పోలిస్తే కొత్త మోడల్ ధర సుమారు రూ. 5000 ఎక్కువ. 2024 బజాజ్ పల్సర్ NS125 మోటార్‌సైకిల్ ధర ఎక్స్-షోరూమ్ వద్ద రూ. 1.05 లక్షలుగా ఉంది.
Bajaj Pulsar NS 125 డిజైన్, స్పెసిఫికేషన్లు
2024 బజాజ్ పల్సర్ NS125 బైక్ డిజైన్ విషయంలో విస్తృతమైన మార్పులు లేనప్పటికీ, ఇది సరికొత్త హెడ్‌ల్యాంప్ సెటప్‌ను పొందింది.
పాత మోడళ్ల కంటే భిన్నంగా లైటింగ్ బోల్ట్‌ల ఆకారంలో ఉన్న DRLలతో పాటు LED హెడ్‌ల్యాంప్‌ను కలిగి ఉంది. ఇది బైక్ కు మరింత స్పోర్టీ లుక్ ను అందిస్తుంది. అయితే, హెడ్‌ల్యాంప్ కేసింగ్ విషయంలో ఎలాంటి మార్పులు ఉండవు.
ఫీచర్లపరంగా చూస్తే.. కొత్త 2024 పల్సర్ NS125లో పూర్తిగా డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్‌ను అందిస్తున్నారు. ఇది స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది, తద్వారా రైడర్లు ప్రయాణంలోను కాల్‌లు, సందేశాలను యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది. ఇది ఫోన్ బ్యాటరీ స్థాయిని కూడా ప్రదర్శిస్తుంది. అదనంగా USB ఛార్జింగ్‌ను కూడా ప్రవేశపెట్టింది. దీని స్క్రీన్‌పై ఓడోమీటర్, రెవ్ కౌంటర్, ట్రిప్ మీటర్, ఫ్యూయల్ గేజ్ రీడింగ్ ఉన్నాయి. ABS ఫీచర్ అందించడం ద్వారా భద్రత మెరుగుపడింది.
ఇక, మిగతావన్నీ మునుపటి మాదిరిగానే ఉంటాయి. బైక్‌లో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుకవైపు 5-స్టెప్ మోనోషాక్ సస్పెన్షన్ ఉన్నాయి. బ్రేకింగ్ సెటప్‌లో ముందు వైపు డిస్క్ బ్రేక్, వెనుక వైపు డ్రమ్ బ్రేక్ ఉన్నాయి. ఈ బైక్ 17-అంగుళాల చక్రాలపై పరుగెడుతుంది. రెండు వైపులా ట్యూబ్‌లెస్ టైర్‌లను కలిగి ఉంది. ఈ బైక్ బరువు 144 కిలోలు, గ్రౌండ్ క్లియరెన్స్ 179 మిమీ సముచితంగా ఉన్నందున బైక్ నడిపేటపుడు తగినంత నియంత్రణ ఉంటుంది.
Bajaj Pulsar NS 125 ఇంజన్ సామర్థ్యం
2024 బజాజ్ పల్సర్ NS125లో 125cc సింగిల్-సిలిండర్ 4-స్ట్రోక్, SOHC 4-వాల్వ్, ఎయిర్ కూల్డ్, DTS-i Ei ఇంజిన్ ఉంటుంది. దీనిని 5-స్పీడ్ గేర్ బాక్సుకు జతచేశారు. ఈ ఇంజన్ గరిష్టంగా 11.80 హెచ్‌పి పవర్, 11 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. నివేదికల ప్రకారం.. బజాజ్ పల్సర్ 125 బైక్ లీటరుకు 50 -55 కిమీ మైలేజీ ఇస్తుంది.
ఈ బైక్ మార్కెట్లో Hero Xtreme 125R, TVS రైడర్ 125 వంటి మోడళ్లతో పోటీపడుతుంది.