IPL Auction 2025 Live

MG Comet EV: ఎంజీ కామెట్ ఎలక్ట్రిక్ కార్ అప్డేడెట్ వెర్షన్ విడుదల, ఇప్పుడు మరింత వేగవంతమైన ఛార్జింగ్ సపోర్ట్‌తో దూసుకొచ్చేసింది, ఈ కారులో ఫీచర్లు ఎలా ఉన్నాయి, ధర ఎంతో ఇక్కడ తెలుసుకోండి!

MG Comet EV (Photo Credits: MG Motor India)

MG Comet EV:  బ్రిటన్‌కు చెందిన కార్ల తయారీదారు మోరిస్ గ్యారెజీ (MG Motors) మోటార్ కంపెనీ, తమ బ్రాండ్ నుంచి అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కారు అయినటువంటి 'ఎంజీ కామెట్' EVని అప్‌డేట్ చేసింది. వినియోగదారుల నుంచి వస్తున్న డిమాండ్ల మేరకు ఇపుడు ఈ కారు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వచ్చింది. అయితే, ఈ కొత్త ఫీచర్ MG కామెట్ EVలోని ఎక్సైట్ FC మరియు ఎక్స్‌క్లూజివ్ FC వేరియంట్‌లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీని బేస్ వేరియంట్ అయిన ఎగ్జిక్యూటివ్ వెర్షన్ లో ఈ ఫీచర్ అందుబాటులో ఉండదు.

MG కామెట్ EV ఎక్సైట్ FC ధర ఎక్స్-షోరూమ్ వద్ద రూ. 8.24 లక్షలుగా ఉండగా, ఎక్స్‌క్లూజివ్ FC ట్రిమ్ ధర రూ. 9.14 లక్షలుగా ఉన్నాయి.  మునుపటి మోడళ్ల కంటే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన కొత్త వేరియంట్ల కోసం రూ. 56 వేలు అదనపు ధరను చెల్లించాల్సి ఉంటుంది.  దీని బేస్ మోడల్ మాత్రం ప్రస్తుతం రూ. 6.99 లక్షలకే లభిస్తుంది.

ఫాస్ట్ ఛార్జింగ్ గురించి చెప్పాలంటే, ఇది వరకు MG కామెట్ EVని ఛార్జ్ చేయటానికి 3.3 kW AC ఛార్జర్‌ను మాత్రమే ఉపయోగించాల్సి వచ్చేది. ఇది 0-100 శాతం నుండి పూర్తిగా ఛార్జ్ చేయడానికి సుమారు 7 గంటల సమయం పట్టేది. ఇప్పుడు కామెట్ కొత్త వేరియంట్‌లకు 7.4 kW AC ఫాస్ట్ ఛార్జర్‌ను అందిస్తున్నారు. అయితే దీనితో పూర్తిగా ఛార్జింగ్ చేయటానికి ఎంత సమయం పడుతుందో కంపెనీ ఇంకా వెల్లడించలేదు. కానీ మునుపటి కంటే సమయం సగానికి తగ్గుతుందని భావిస్తున్నారు.

MG Comet EV బ్యాటరీ సామర్థ్యం

ఎంజీ కామెట్ EVలో 17.3 kWh బ్యాటరీ ప్యాక్‌ ఉంటుంది. ఇది ఏకైక ఎలక్ట్రిక్ మోటారుతో అనుసంధానించబడి ఉంటుంది. దీని మోటార్ 42hp శక్తిని మరియు 110Nm టార్క్‌ను విడుదల చేస్తుంది. ఒకసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే ఈ కారు 230 కిమీ ప్రయాణ పరిధిని అందిస్తుంది. ఎంజీ కామెట్ ఎలక్ట్రిక్ కారు గరిష్ట వేగం గంటకు 101 కిమీ.

MG Comet EV ఫీచర్లు

ఫీచర్ల పరంగా చూస్తే ఎంజీ కామెట్ EVలో వెనుకవైపు డిస్క్ బ్రేక్‌లు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ESC, పవర్ ఫోల్డబుల్ ORVMలు, టర్న్ ఇండికేటర్ ఇంటిగ్రేటెడ్ DRLలు మరియు క్రీప్ మోడ్ వంటి ఫీచర్‌లను కొత్తగా అందిస్తున్నారు. ఇతర ఫీచర్లను పరిశీలిస్తే 10.25-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, మూడు USB పోర్ట్‌లు, కనెక్ట్ చేయబడిన కార్ టెక్ ఉన్నాయి.

భద్రత పరంగా, ఇందులో ABS, EBD, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), సెన్సార్‌లతో కూడిన రివర్స్ కెమెరా మరియు డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి.