Sonu Sood as Brand Ambassador: సోనూసూద్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించున్న ఢిల్లీ ప్రభుత్వం, 'దేశ్ కే మెంటర్' కార్యక్రమం విశేషాలు చెప్పిన సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఎలాంటి రాజకీయ చర్చ జరగలేదని స్పష్టత

సెప్టెంబర్ మధ్య నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించనున్నట్లు కేజ్రీవాల్ వెల్లడించారు...

Sonu Sood- Arvind Kejiwal | Photo: Twitter

New Delhi, August 27:  కోవిడ్ లాక్డౌన్ సమయంలో ప్రజలకు సహాయం చేస్తూ రియల్ హీరోగా పేరు సంపాదించుకున్న నటుడు సోనూసూద్‌ను,  అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం తమ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. ఢిల్లీ ప్రభుత్వ ప్రతిష్టాత్మక 'దేశ్ కే మెంటర్' కార్యక్రమానికి సోనూసూద్ బ్రాండ్ అంబాసిడర్‌గా మారనున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.

శుక్రవారం ఢిల్లీలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తో భేటీ అయిన సోనూ , అనంతరం ఇరువురు కలిసి సంయుక్తంగా మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా కరోనా సమయంలో సోనూసూద్ చేపట్టిన అనేక దాతృత్వ సేవలను కేజ్రీవాల్ ప్రశంసించారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో దిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే సుమారు 10 లక్షల మంది విద్యార్థుల భవితవ్యాన్ని తీర్చిదిద్దడం కోసం 'దేశ్ కే మెంటర్' అనే కార్యక్రమాన్ని దిల్లీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా మేధావులు, విద్యావంతులు కలిసి విద్యార్థులను ఉజ్వలమైన భవిష్యత్తు వైపు నడిపించగలగడం మరియు వారికి ఇష్టమైన రంగాన్ని ఎంచుకునేలా మార్గనిర్దేశనం చేయాల్సి ఉంటుంది.

ఇది భారతదేశంలోనే అతిపెద్ద మార్గదర్శక కార్యక్రమం అని వర్ణించిన కేజ్రీవాల్, ఇందుకోసం 3 లక్షల మంది యువ నిపుణులు విద్యార్థులకు మార్గనిర్దేశనం చేయనున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించటానికి సోనూ సూద్ అంగీకరించినట్లు అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. సెప్టెంబర్ మధ్య నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించనున్నట్లు కేజ్రీవాల్ వెల్లడించారు.

Check this tweet:

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంక్షేమ కార్యక్రమాల కోసం సోను సూద్ ప్రశంసించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య మరియు వారి పురోగతి కోసం 'దేశ్ కే మెంటర్' కార్యక్రమం ఎంతో ఆదర్శవంతమైనదని తెలిపారు. అయితే రాజకీయాల్లో చేరుతున్నారా? అని విలేఖరులు అడిగిన ప్రశ్నకు తమ మధ్య ఎలాంటి రాజకీయ చర్చ జరగలేదని సోను సూద్ తెలిపారు. ఇప్పట్లో రాజకీయాల గురించి ఆలోచించడం లేదని సోనూ స్పష్టం చేశారు.