Vakeel Saab Teaser: 'కోర్టులో వాదించడం తెలుసు, కోట్ తీసి కొట్టడమూ తెలుసు' పవర్‌ఫుల్ టీజర్‌తో వచ్చిన 'వకీల్ సాబ్', పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి సంక్రాంతి పండగ గిఫ్ట్
ఆ టీజర్ ఎలా ఉందో చెప్పడం కంటే చూస్తేనే కరెక్ట్....
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్న కొత్త చిత్రం "వకీల్ సాబ్" (Vakeel Saab) ఫస్ట్ లుక్ పోస్టర్ సోమవారమే విడుదలైంది. 2016లో విడుదలై బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన 'పింక్' (Pink) సినిమాకు ఇది రీమేక్. పింక్ లో అమితాబ్ బచ్చన్ పోషించిన లాయర్ పాత్రనే వకీల్ సాబ్ గా పవన్ పోషిస్తున్నారు. ఇదే సినిమా తమిళంలో నెర్కొండ పార్వయిగా 2019లో విడుదలై అక్కడ కూడా సూపర్ హిట్ గా నిలిచింది.
ఈ సినిమా కథలో పెద్ద విశేషం ఏమి లేకపోయినా, కథనం మరియు లాయర్ పాత్ర చాలా గొప్పగా ఉంటుంది. కథలో ముగ్గురు లేడీ బ్యాచిలర్స్ ఒక ఇంట్లో అద్దెకు ఉంటారు. అయితే వారు ఊహించని విధంగా ఒక పోలీసు కేసులో చిక్కుకుంటారు. అయితే వారి పట్ల సమాజం, కుటుంబ సభ్యులు చూసే తీరు దారుణంగా ఉంటుంది. కానీ, వారికి పొరుగింట్లో ఉండే ఒక లాయర్, చూడటానికి ఓ సాధారణమైన మనిషిగా, నిరాడంబరంగా కనిపించే వ్యక్తి ఆ అమ్మాయిల కష్టాన్ని చూసి తనకుతానుగా స్పందిస్తాడు. వారు సహాయం కోరకపోయినా, మానవత్వం ఉన్న వ్యక్తిగా ఆ కేసులో నుంచి అత్యంత చాకచక్యంగా వారిని బయటపడేస్తాడు.
ఈ కథలో లాయర్ పాత్ర ఎంతో నిస్వార్థమైనది, సేవాగుణం కలది, తనకు కీడు తలపెట్టాలని చూసినా, తనని అసహ్యించుకున్నా, ఎవరికైనా ఏదో సహాయం చేయాలనే తపన గల ఉదాత్తమైన పాత్ర అది. అలాంటి పాత్రలో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు. వకీల్ సాబ్‌లో అంజలి, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో నటించగా, శృతి హాసన్ గెస్ట్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.
సంక్రాంతి పండగ సందర్భంగా వకీల్ సాబ్ టీజర్ విడుదలైంది. ఆ టీజర్ ఎలా ఉందో చెప్పడం కంటే చూస్తేనే కరెక్ట్.
Vakeel Saab Teaser:
ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా, దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 2020 లోనే విడుదల కావాల్సి ఉండగా కరోనా మహమ్మారి లాక్ డౌన్ కారణంగా దాదాపు 6 నెలలు షూటింగ్ నిలిచిపోయి, గత నవంబర్ లో తిరిగి ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే త్వరలోనే ఈ సినిమా విడుదలకు ఫిల్మ్ మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.