AP CM Jagan Trends On Twitter: 'వైఎస్ జగన్ ఒక విఫల ముఖ్యమంత్రి' అంటూ మంటరేపుతున్న ట్విట్టర్. సోషల్ మీడియాలో ప్రజా ఉద్యమాన్ని మించిన 'ఆకాశ రామన్న' ఉద్యమం.

Andhra Pradesh CM YS Jagan Mohan Reddy.

Amaravathi, August 20: ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమైంది? 'పాలిచ్చే ఆవును వదిలి, దున్నను తెచ్చుకున్నారు'. జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి పూర్తిగా తలకిందులైపోయింది. జీవకళ నశించిపోయి అమరావతి చచ్చుబడిపోయింది. ఈ విధ్వంసక జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కన్న కలలన్నీ పేకమేడల్లా కుప్పకూలిపోతున్నాయి. పీపీఎల రద్దుతో ప్రజలకు కరెంట్ షాక్, రివర్స్ టెండరింగ్ తో ప్రాజెక్టులు, రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులన్నీ రివర్స్ వెళ్లిపోతున్నాయి. 5 రూపాయలతో తృప్తిగా భోజనం చేసే పేదవారు ఇప్పుడు 'అన్న'మో రామ'చంద్ర' అని ఆకలి కేకలు పెడుతున్నారు. ఇసుక మాఫియా, కడప మాఫియా, కుల మాఫియా, రౌడీ మాఫియాలన్నీ ఏకమై దౌర్జన్యంగా ఏపీ ప్రజలను దోచేస్తున్నారు.

మొన్నటి వరకు విశేష సంపదతో, ప్రపంచంతో పోటీపడుతూ ఎనలేని కీర్తిని గడిస్తూ కళకళలాడిన రాష్ట్రం ఇదేనా? ఏపీకి ఉన్న ఆ బ్రాండ్ ఇమేజ్ ఇప్పుడు ఏమైంది? ఇంతలో ఏం జరిగింది? అంటూ రాష్ట్రానికి భారీ పెట్టుబడులను మోసుకొచ్చి ఏపీ బార్డర్ వద్ద రెడీగా ఉన్న విదేశీ సంస్థలు ఆశ్చర్యార్థకం, ప్రశ్నార్థకం మొఖాలతో రాష్ట్రంలో అడుగు పెట్టకుండానే అటునుంచి అటే వెనుదిరిగి పోయాయి. జగన్ సీఎం అయిన తర్వాత ఇంతటి కష్టాలన్నీ అనుభవిస్తున్న  ఏపీ ప్రజలు, ఇప్పుడు ఏం చేస్తాం?ఇదంతా మా కర్మ అనుకొని మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో తాము చేసిన ఘోర పాపంపై నేడు పశ్చాత్తాపపడుతున్నారు...... అనేంతంగా ఏపిలో కొంతమంది నాయకులు మాట్లాడుతున్న తీరు, అలాగే కొన్ని విశ్వసనీయ మీడియా సంస్థల వార్తా కథనాల ద్వారా బయట ప్రపంచానికి తెలుస్తుంది.

అందుకేనేమో, ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఏపీ ప్రజలంతా ఏకమై జగన్ పాలనకు వ్యతిరేకంగా ప్రజాఉద్యమం మొదలు పెట్టారు.

'వైఎస్ జగన్ ఒక విఫల ముఖ్యమంత్రి' #YSJaganFailedCM అనే హాష్ టాగ్ ట్విట్టర్ లో ట్రెండ్ అవుతుంది. దీనికి సమాంతరంగా 'ప్రజలతో చంద్రబాబు' #CBNwithPeople అనే హాష్ టాగ్ కూడా ట్రెండింగ్ లో ఉంది. విచిత్రమేమంటే ఈ హాష్ టాగ్ ట్రెండ్ చేస్తున్న వారిలో ఏపీ ప్రజలకు బదులుగా ఎక్కడెక్కడి 'ఆకాశ రామన్న'లు ఉన్నారు. తెలుగు రాని వారు కూడా ఉన్నారు. అంటే ఏపీ ప్రజల కన్నీరే ప్రస్తుతం ఉత్తర భారతదేశంలో వరదలకు కారణం అని స్పష్టంగా అర్థమవుతుంది.

 

 

మరి ఇంత గొప్పగా మీడియా మేనేజ్, గ్రౌండ్ మేనేజ్, సోషల్ మీడియా మేనేజ్ చేస్తున్న ఆ 'హైటెక్' మహనీయులకు అందరూ హాట్సాఫ్ చెప్పాల్సిందే.