Oxfam Report: 63 మంది భారతీయుల సంపద దేశ బడ్జెట్ కంటే ఎక్కువ, ఒకేడాదిలో దేశం మొత్తానికి సరిపోయే డబ్బు పిడికెడు మంది చేతిలోనే, ఆసక్తికర విషయాలను వెల్లడించిన 'ఆక్స్‌ఫాం' సర్వే
ప్రభుత్వాలు ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ఆ రిపోర్ట్ సూచనలు చేసింది.....
Davos, January 20: భారతదేశంలో 1 శాతంగా ఉన్న సంపన్నులు మొత్తం దేశ జనాభాలో 70 శాతం దిగువ తరగతి ప్రజల వద్ద ఉన్న సంపద కంటే 4 రేట్లు ఎక్కువ కలిగి ఉన్నారని తాజాగా ఒక రిపోర్ట్ వెల్లడించింది. దాదాపు 95 కోట్ల భారత ప్రజల సంపద కంటే వీరి వద్ద ఉన్న (Billionaires' Wealth) సంపదే కొన్ని రేట్లు ఎక్కువ అని తెలిపింది. కేవలం 63 మంది భారతీయ బిలయనీర్ల వద్ద ఉన్న డబ్బు గతేడాది 2018-19కి గానూ రూ. 24 లక్షల కోట్లతో (24,42,200 కోట్లు) కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్ కంటే ఎక్కువ అని ఆ నివేదిక వెల్లడించింది.
వరల్డ్ ఎకనామిక్ ఫోరం (World Economic Forum ) యొక్క 50వ వార్షిక సమావేశం ప్రారంభం అవుతున్న సందర్భంగా అంతర్జాతీయ హక్కుల సంస్థ 'ఆక్స్‌ఫాం' (Oxfam) ప్రపంచంలో ఉన్న సంపద గురించి ఏడాది కాలంగా చేపట్టిన తన అధ్యయనం 'టైమ్ టు కేర్' (Time to Care) నివేదికను తాజాగా విడుదల చేసింది. కొద్ది మంది వద్దే సంపద మొత్తం కేంద్రీకరించబడి ఉండటం పట్ల ఆక్స్‌ఫాం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అసమానతలు తగ్గించే విధంగా ఆయా దేశాల ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆక్స్‌ఫాం ఇండియా సీఈఓ అమితాబ్ బెహార్ సూచించారు.
ఆక్స్‌ఫాం రిపోర్ట్ ప్రకారం, ప్రపంచంలోని 2,153 బిలియనీర్లు ఈ భూమిపై ఉన్న జనాభాలో 60 శాతం ప్రజల కంటే ఎన్నో రేట్ల ఎక్కువ సంపదను కలిగి ఉన్నారని పేర్కొంది. గత దశాబ్ద కాలంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిలియనీర్ల సంఖ్య రెట్టింపు అయ్యింది, అయితే గతేడాదిలో వారి సంపద కొంత క్షీణించినప్పటికీ, వారికి మరియు మిగతా జనాభాకు మధ్య ఉన్న ఆర్థిక తారతమ్యం అందనంత ఎత్తులో ఉంంది. ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు విశేషంగా పెరుగుతున్నాయని దిగ్భ్రాంతి కలిగించే విషయం అని నివేదిక పేర్కొంది.
సోమవారం నుండి ప్రారంభమయ్యే WEF ఐదు రోజుల శిఖరాగ్ర సదస్సులో ఆర్థిక అసమానతలు, లింగ వివక్షతపై ప్రధానంగా చర్చలు జరిగే అవకాశం ఉంది. ఈ ఆర్థిక అసమానతల వల్లనే దిగజారుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై 2019లోనూ తీవ్రమైన ఒత్తిడి కొనసాగిందని
గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ పేర్కొంది.
WEF నివేదిక ప్రకారం, ఆర్థిక అసమానతలు, పెరుగుతున్న అవినీతి వంటివి నిత్యావసర ధరల పెరుగుదలకు దారి తీసి సమాజంలో అంశాతికి కారణమవుతుంది. కొన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలో దవ్యోల్బణం గరిష్ఠ స్థాయికి చేరినట్లు సూచించింది.
ఒక అగ్రశ్రేణి సాఫ్ట్ వేర్ టెక్నాలజీ సంస్థ యొక్క సీఈఓ ఏదాదికి సంపాందించే మొత్తాన్ని సంపాందించడానికి ఒక సాధారణ గృహిణికి పట్టే సమయం 22,277 సంవత్సరాలు. అంటే ఆ సీఈఓ ఒక సెకను అర్జించే ధనం, గృహిణి అర్జించడానికి ఏడాది కాలం ఖర్చవుతుందని నివేదిక పేర్కొంది.
జీడీపీలో 2 శాతంగా ఉన్న సంక్షేమ రంగంలో ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించడం ద్వారా 11 మిలియన్ల కొత్తగా ఉద్యోగాలను సృష్టించవచ్చు అని పేర్కొంది.
ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న ఈ 1% సంపన్నులు పదేళ్ల పాటు తమ సంపదపై 0.5 % అదనపు పన్ను చెల్లిస్తే ఒక్క సంక్షేమ రంగంలోనే 117 మిలియన్ల ఉద్యోగాలు సృష్టించవచ్చు. ప్రభుత్వాలు ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ఆ రిపోర్ట్ సూచనలు చేసింది.