Revanth Reddy (Photo-X/Congress)

Hyd, Feb 04: తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం (Telangana Assembly Session) ప్రారంభమైంది. సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్య, రాజకీయ, కులగణన సర్వే నివేదికను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నివేదికలోని అంశాలను సీఎం వివరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్య, కులసర్వే నివేదిక సమగ్ర ఇంటింటి కులసర్వే నిర్వహించాలని 2024 ఫిబ్రవరిలో ప్రభుత్వ నిర్ణయం తీసుకుందన్నారు.

కర్ణాటక, బిహార్‌ సహా వివిధ రాష్ట్రాల్లో జరిగిన సర్వేలను క్షుణ్ణంగా అధ్యయనం చేశాం. సర్వే నిర్వహించే విధానాలపై వివిధ సంఘాలు, మేధావుల అభిప్రాయాలు తీసుకున్నాం. దాదాపు 50 రోజుల పాటు సర్వే జరిగింది. గ్రామాల్లో 66.39 లక్షల కుటుంబాలు, పట్టణాల్లో 45.15 లక్షల కుటుంబాల్లో సర్వే నిర్వహించాం. రాష్ట్రంలో మొత్తంగా 1.12 కోట్ల కుటుంబాల వివరాలు సర్వే చేశాం. సర్వే ప్రకారం ఎస్సీలు 61,84,319 (17.43 శాతం), బీసీలు (ముస్లిం మైనారిటీ మినహా) 1,64,09,179 (46.25 శాతం), ఎస్టీలు 37,05,929 (10.45 శాతం), ముస్లిం మైనారిటీలు 44,57,012 (12.56 శాతం) మంది ఉన్నారు. ఈ నివేదికను సంక్షేమ విధానాల తయారీకి వినియోగిస్తామన్నారు.

నేడు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. సభ ముందుకు రానున్న కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికలు.. రాష్ట్రంలో మొత్తం బీసీల జనాభా ఎంతంటే?

బీసీ లెక్కలు తేల్చి వారికి అవకాశాలు కల్పిస్తామని రాహుల్ గాంధీ పాదయాత్రలో హామీ ఇచ్చారని.. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం మేము కుల గణన చేపట్టామన్నారు. మంత్రి ఉత్తమ్ నేతృత్వంలో కమిటీ వేసి ప్రక్రియను ముందుకు తీసుకువెళ్ళామని తెలిపారు. నవంబర్‌ 9 నుంచి 50 రోజుల పాటు సర్వే నిర్వహణ జరిగిందని తెలిపారు. తెలంగాణలో 1.12 కోట్ల కుటుంబాల సర్వే జరిగిందని వెల్లడించారు. పట్టణాల్లో 45.15 లక్షల కుటుంబాల్లో సర్వే జరుగగా.. గ్రామాల్లో 66.39 లక్షల కుటుంబాల్లో సర్వే జరిగిందన్నారు.

జనగణన కంటే పకడ్బంధీగా కులగణన నిర్వహించామని.. ఇందు కోసం రూ.161 కోట్లు ఖర్చు చేసి సర్వే చేశామన్నారు. ఇది ఒక మోడల్ డాక్యుమెంట్‌గా పనిచేస్తుందని తెలిపారు. పూర్తిస్థాయి చట్టబద్ధత కల్పించేందుకు కేబినెట్ ఆమోదం తరువాత సభలో ప్రవేశపెట్టామన్నారు. విద్యా ఉద్యోగ ఉపాధి రాజకీయ అవకాశాలు కల్పించడానికి సర్వే పని చేయాలన్నారు. పార్టీలకు అతీతంగా ప్రభుత్వాన్ని అన్ని పార్టీలు అభినందించాలని ముఖ్యమంత్రి అన్నారు.

అంతకు ముందు సమగ్ర కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికలకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ హాలులో సుమారు రెండు గంటల పాటు కేబినెట్ సమావేశం జరిగింది.ఈ కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, దేశంలోనే మొదటిసారిగా కులగణన చేపట్టి తెలంగాణ రాష్ట్రం చరిత్ర సృష్టించిందని అన్నారు. పకడ్బందీగా సర్వే నిర్వహించి సమాచారం సేకరించామని తెలిపారు. కులగణన, ఎస్సీ వర్గీకరణ విషయాల్లో తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు మార్గనిర్దేశనం చేస్తుందని ఆయన అన్నారు.

దీనితో, కులగణనపై ప్రధానమంత్రిపై ఒత్తిడి పెరుగుతుందని ఆయన అన్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుతో పాటు మంత్రివర్గ ఉపసంఘం, ఏకసభ్య కమిషన్ సిఫార్సుల ప్రకారం ప్రభుత్వం ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ సభకు రావడం లేదని విమర్శించారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్షానికి చిత్తశుద్ధి లేదని ఆయన అన్నారు.