
Hyd, December 9: ఈ నెల 12 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే(BRSLP Meeting Update). ఈ నేపథ్యంలో ఈనెల 11న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ శాసనసభాపక్షం సమావేశం కానుంది. 11న మధ్యాహ్నం ఒంటి గంటకు పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ శాసనసభాపక్షం సమావేశం జరగనుంది. ఈ మేరకు ఇప్పటికే పార్టీ ప్రజాప్రతినిధులకు సమాచారం అందింది.
ఈ నెల 27 వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనుండగా 18 లేదా 19న రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈసారి సమావేశాలు వాడీవేడిగా జరగనుండగా పలు కీలక బిల్లులను అమోదించే అవకాశం ఉంది.
బీఏసీలో చర్చ అనంతరం సభా నిర్వహణ తేదీలను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Speaker Gaddam Prasad Kumar) నిర్ణయించనున్నారు. 12వ తేదీన రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారని అసెంబ్లీ వర్గాలు తెలిపాయి.
తర్వాత రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సభలో ప్రవేశపెట్టనున్నారు. దీనిపై చర్చ జరిగిన అనంతరం తీర్మానాన్ని ఆమోదించనున్నారు.
ఈసారి సమావేశాల్లో బీసీ రిజర్వేషన్లు(BC Reservations), ఎస్సీ వర్గీకరణ బిల్లును సభలో ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. ఈ బిల్లుపై చర్చ అనంతరం ఆమోదించి, బీసీల రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీ ముందుకు తేనున్నారు. బడ్జెట్, శాఖలవారీ పద్దులపై చర్చ అనంతరం 27న ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఉగాది, రంజాన్ పర్వదినాల నేపథ్యంలో 27న అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నట్లు సమాచారం.