Kidnap-Murder in TS: మహబూబాబాద్‌లో కిడ్నాప్ అయిన బాలుడి కథ విషాదాంతం, కిడ్నాప్ చేసిన గంటలోనే బాలుడి హత్య, పోలీసుల అదుపులో నిందితులు
అనంతరం పేరేంట్స్ కు ఇంటర్నెట్ కాల్స్ చేస్తూ రూ. 45 లక్షలు డిమాండ్ చేశాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని, పోలీసులకు ఫిర్యాదు చేయవద్దు, మీ ఇంటి చుట్టూ మా మనుషులు ఉన్నారని చెప్పి భయపెట్టారు.....
Mahabubabad, October 22: తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నాలుగు రోజుల క్రితం కిడ్నాప్ కు గురైన 9 ఏళ్ల దీక్షిత్ రెడ్డిని నిందితులు హత్య చేశారు. మహబూబాబాద్ పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలో అన్నారాం శివార్లలోని దానమయ్య గుట్టపై కాలిపోయిన స్థితిలో బాలుడి మృతదేహం లభ్యమైంది. నాలుగు రోజులుగా తమ బిడ్డ వస్తాడని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న తల్లిదండ్రులకు ఈ వార్త షాక్ కు గురిచేసింది. కిడ్నాపర్లు డిమాండ్ చేసిన డబ్బును సర్దుబాటు చేసినట్లు చెప్పినా తమ బిడ్డను కిడ్నాపర్లు హత్య చేశారని తెలిసి గుండెలు పగిలేలా రోదిస్తున్నారు.
మొన్న ఆదివారం (అక్టోబర్ 19) సాయంత్రం రోజున మహాబుబాబాద్ పట్టణంలో తన ఇంటి బయట ఆడుకుంటున్న దీక్షిత్‌ను గుర్తు తెలియని వ్యక్తి ఎత్తుకెళ్లాడు. అనంతరం పేరేంట్స్ కు ఇంటర్నెట్ కాల్స్ చేస్తూ రూ. 45 లక్షలు డిమాండ్ చేశాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని, పోలీసులకు ఫిర్యాదు చేయవద్దు, మీ ఇంటి చుట్టూ మా మనుషులు ఉన్నారని చెప్పి భయపెట్టారు. తాము అడిగినంత డబ్బు ముట్టచెప్పితే దీక్షిత్ ను క్షేమంగా విడిచిపెడతామని బెదిరించారు.
దీంతో బాలుడి తల్లిదండ్రులు తమతో సాధ్యమైనంత డబ్బును పోగు చేసి కిడ్నాపర్స్ చేసిన సూచనలను తూచా తప్పకుండా పాటించారు. డబ్బుతో బుధవారం తాము చెప్పిన చోటకు డబ్బు తీసుకురావాలని చెప్పడంతో బాలుడి తండ్రి కుసుమ రంజిత్ రెడ్డి కిడ్నాపర్లు చెప్పిన చోటుకు డబ్బుతో వెళ్లారు, అక్కడే రాత్రి వరకు వేచి ఉన్న బాలుడి తండ్రి కిడ్నాపర్ల నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో తిరిగి ఇంటికి వచ్చేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 100 మంది పోలీసులు కిడ్నాపర్ల కోసం గాలించారు.
ఈరోజు తెల్లవారుఝామున 3 గంటలకు నిందితుడ్ని పోలీసులు పట్టుకున్నారు. నిందితుడు బాలుడి ఇంటిదగ్గరే మెకానిక్ పనిచేసే మంద సాగర్ గా గుర్తించారు. తెలిసినవాడే కావడంతో బాలుడ్ని నిందితుడు సులభంగా తనతో తీసుకెళ్లగలిగాడు. ఆదివారం 6 గంటలకు కిడ్నాప్ చేసి, బాలుడి ఇంటికెళ్తానని మారాం చేయడంతో దొరికిపోతామేమో అనే భయంతో కిడ్నాప్ చేసిన గంటన్నర లోనే హత్య చేశాడు. అయినప్పటికీ రాత్రి బాలుడి తల్లి వసంతకు ఇంటర్నెట్ కాల్స్ చేస్తూ రూ. 45 లక్షలు డిమాండ్ చేస్తూ బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడ్డాడు. సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడ్ని పట్టుకోగలిగామని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి కిడ్నాప్ కథనాన్ని మీడియాకు వెల్లడించారు.
అయితే నిందితుల్ని ఎన్ కౌంటర్ చేయలేదని, మరిన్ని సాక్ష్యాధారాలు సేకరిస్తున్నామని. ఈ కేసుతో సంబంధం ఉన్న మనోజ్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయడంతో పాటు మరో 24 మందిని విచారిస్తున్నామని ఎస్పీ కోటిరెడ్డి స్పష్టం చేశారు.